పిన్నెల్లికి మాచర్ల దూరమే.. నియోజకవర్గంలో అడుగుపెడితే అరెస్టే!
posted on May 25, 2024 9:24AM
పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లను బద్దలుకొట్టిన కేసులో పరారీలో ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హై కోర్ట్ లో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. అయితే ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది. పోలింగ్ రోజే వైసీపీ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను ధ్వంసం చేసి మాచర్ల నియోజకవర్గంలో దాడులతో భయానక వాతావరణాన్ని సృష్టించిన పిన్నెల్లి కౌంటింగ్ రోజు మాచర్లలోకి అడుగు పెట్టడానికి వీల్లేదని కోర్టు షరతు విధించింది.
పిన్నెల్లి కౌంటింగ్ రోజు కూడా మాచర్లలో ఉంటే అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాలలో కౌంటింగ్ రోజు కేంద్ర బలగాలతో అదనపు భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందంటూ కూటమి నేతలు అధికారులను డిమాండ్ చేశారు. ఈవీఎం లను ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి ని అరెస్టు చేయాలనీ ఈసీ ఆదేశించినప్పటికీ ఆయనకు హై కోర్ట్ ముందస్తు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు ఆయనను మాచర్లలో అడుగుపెట్టరాదని షరతు విధించింది. కౌంటింగ్ రోజున ఆయన నరసరావు పేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకైతే అనుమతి ఇచ్చింది. అదే విధంగా నరసరావు పేట దాటి బయటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా మాచర్లలో పిన్నెల్లి ఓటమి ఖాయమైపోయిందని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పిన్నెల్లి ధ్వంసం చేసిన ఈవీఎంలో వీవీ ప్యాట్ ఆధారంగా ఆ బూత్ లో అప్పటి వరకూ పోలైన ఓట్లలో తెలుగుదేశం సైకిల్ గుర్తుకు 22 ఓట్లు, వైసీపీ ఫ్యాన్ కి 6 ఓట్లు మాత్రమే పడ్డాయని తేలింది. దీనిని బట్టే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం, అలాగే పిన్నెల్లిని ఓడించి తీరాలన్న మాచర్ల ప్రజల సంకల్పం ప్రస్ఫులంగా తెలుస్తున్నాయని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో మాచర్లలో అడుగుపెట్టడానికి వీల్లేని పిన్నెల్లి, జూన్ 4న ఫలితం వెలువడిన తరువాత మాచర్లవైపు చూసే ధైర్యం కూడా చేయలేరని అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈనెల 13న
పాల్వాయి గేటులోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నందుకు తనపై పిన్నెల్లి దాడి చేశాడని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు రెంటచింతల పోలీసులు తెలిపారు. దీంతో పిన్నెల్లిపై
307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.