ఏపీ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారిందిః చంద్రబాబు ఆందోళన
posted on May 25, 2024 @ 12:00PM
కాంబోడియా, భారత్ మధ్య అక్రమ మానవ రవాణా రాకెట్ నడుస్తోంది. ఉద్యోగాల పేరిట ఎర వేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి, ఆన్ లైన్ స్కాం ఎలా చేయాలో వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మన యువతను మోసం చేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న నకిలీ ఏజెంట్ల ఆటకట్టించాలని, ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ను కూడా చంద్రబాబు తన ట్వీట్ లో ట్యాగ్ చేశారు. వీలైనంత త్వరగా బాధితులను కాంబోడియా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు సాయపడాలని జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట కాంబోడియాకు మానవ అక్రమ రవాణా పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణా అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మహిళలు, బాలలు, వృద్ధులపై నేరాలు విపరీతంగా పెరిగాయి. ఆర్థిక, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. హత్యాయత్నాలు, అపహరణలు పెరిగాయి. జాతీయ నేర గణాంక సంస్థ గణాంకాలు విశ్లేషిస్తే మన రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయని చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుతోంది. ఏపీ నుంచి 150 మందికి పైగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత ఆ ముఠా చేతిలో బందిగా వుంది. ఫెడెక్స్ , టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చేయడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షన్నర వరకు వసూలు చేసి కంబోడియాకు తరలిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం అనగానే యువత ట్రాప్‌లో పడిపోతోంది.
కంబోడియాలో రక్షించిన దాదాపు 60 మంది భారతీయులతో కూడిన మొదటి బ్యాచ్ స్వదేశానికి చేరుకుంది. అందులో పలువురు ఏపీ వాసులు ఉన్నారు. కంబోడియా సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి బయటపడి స్వరాష్ట్రానికి చేరుకున్న పలువురికి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో విశాఖపట్నం పోలీసులు స్వాగతం పలికారు. తమను చైనీస్ ఆపరేటర్లకు విక్రయించి, హింసించారు.సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారు, చీకటి గదులలో ఉంచి పనిచేయాలని హింసించినట్లు బాధితులు చెప్పారు.
అక్రమ రవాణాకు గురైన యువకుల విడుదల కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిందని, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసిందని, దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది.
- ఎం.కె. ఫజల్