చత్తీస్ గడ్ నారాయణపూర్ లో భారీ ఎన్ కౌంటర్ , 7గురు నక్సల్స్ దుర్మరణం 

చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయినట్టు సమాచారం.    ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గత రెండు నెలల వ్యవధిలో ఛత్తీస్ గఢ్ లో జరిగిన మూడో ఎన్ కౌంటర్ ఇది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. 12 మందికి పైగా మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది.  పోలీసులు, మావోయిస్టులకు ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులను పోలీసులు మట్టుపెడుతున్నారు. ఇటీవలే కొంతమంది లొంగిపోయారు.దండకారణ్యంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, మావోలు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించి ఎదురు కాల్పులతో బదులిచ్చాయి. ఉదయం మొదలైన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.  కాగా, పారిపోయే ప్రయత్నంలో ఉన్న పలువురు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ముద్దు పెట్టినందుకు బాదేశారు!

అంగరంగ వైభవంగా పెళ్ళి జరుగుతోంది. వేదిక మీద వున్న వధూవరులు చిలకాగోరింకల మాదిరిగా చూడముచ్చటగా వున్నారు. వాతావరణం అంతా సందడిగా వుంది. పెళ్ళికూతురు తరఫు వాళ్ళు భారీ స్థాయిలో పెళ్ళి ఏర్పాట్లు చేశారు. పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకు అన్ని రకాల మర్యాదలూ చేస్తున్నారు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. పెళ్ళి కూతురు బుగ్గ మీద అతను ముద్దు పెట్టాడు. అది చూసిన ఆడపెళ్ళివారికి ఆగ్రహం ముంచుకొచ్చింది. పెళ్ళికూతురికి ముద్దు పెట్టడానికి నువ్వెవడ్రా అంటూ పెళ్ళికూతురికి ముద్దుపెట్టిన వ్యక్తిని చావబాదారు. దాంతో అతను లబోదిబో, కుయ్యోమొర్రో అన్నాడు.. ఇంతకీ పెళ్ళికూతురికి ముద్దుపెట్టింది ఎవరో దారినపోయే దానయ్య కాదు.. సాక్షాత్తూ పెళ్ళికొడుకే. ఇవాళా రేపు పెళ్ళి వేదికల మీద పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోవడం మామూలు విషయమే.. పాపం పెళ్ళికొడుకు కూడా అదే పని చేశాడు. దాంతో పెళ్ళికూతురు తరఫు వాళ్ళ చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. పెళ్ళికొడుకుని అలా కొట్టినందుకు అతని తరఫు వాళ్ళు రెచ్చిపోయారు. పెళ్ళికూతురు ఫ్యామిలీవాళ్ళని కూడా తుక్కుతుక్కుగా ఇరగొట్టేశారు. వీళ్ళు కూడా తిరగబడ్డారు. దాంతో రెండు వర్గాల వాళ్ళూ విరగబాదుకుంటూ పెళ్ళికి వచ్చిన జనం మీద పడ్డారు. పెళ్ళికి వచ్చిన జనం ఇదేంట్రా కొత్తరకం గొడవ అనుకుంటూ పరుగులు తీసి, తినడానికి సిద్ధంగా వున్న ఆహార పదార్థాల మీద పడ్డారు. దాంతో కంగాళీ, గందరగోళం, సర్వనాశనం..  ఈ సందర్భంగా జరిగిన తన్నులాటలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళలో పెళ్ళికూతురు తండ్రి కూడా వున్నాడు. గాయపడినవాళ్ళందరూ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళలో ఒక వికెట్ అయినా లేచే అవకాశం వుందని అంటున్నారు. తన్నుకునే శక్తి తగ్గిపోయిన తర్వాత రెండు వర్గాలూ మాటల యుద్దం ప్రారంభించాయి. పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేంటయ్యా అని వీళ్ళు అంటే, మా అమ్మాయిని అందరి ముందూ ముద్దు పెట్టుకుంటే మేం ఊరుకోం అని వాళ్ళు అన్నారు. చివరికి పెళ్ళికొడుకు అసలు విషయం బయటపెట్టాడు. పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోమంటేనే ఈ అందగాడు ముద్దు పెట్టుకున్నాడట. అలా ఒక్క ముద్దు పెట్టిన పాపానికి వంద గుద్దులు తినాల్సి వచ్చింది. అసలు విషయం తెలిసి అందరూ నోళ్ళు తెరిచారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగింది.

 ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునాశ్రయించిన పిన్నెల్లి

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం యంత్రాలను  ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే పిన్నెల్లిని ఏ1గా ఎఫ్ఐఆర్ ‎లో చేర్చారు. ఐపీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేయనున్నట్టు సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.మరోవైపు నరసారావుపేట కోర్టులో లొంగిపోనున్నారనే వార్తలు వినిపించిన కొద్ది సేపటికే తాజాగా ఏపీ హైకోర్టు లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హై కోర్టులో విచారణ జరుగనుంది.

ఫలితాల్లో ఫస్ట్ ఓటమి రోజాదే!

వైసీపీ నాయకురాలు రోజాకి ‘ఐరన్ లెగ్’ అనే బిరుదు మొట్టమొదటిసారి ఎవరు ఇచ్చారోగానీ, ఆ ఇచ్చినోడి నాలుక మీద మచ్చలు వుండే వుంటయ్ నో డౌట్. ఎందుకంటే, ఆ మాట ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ వస్తోంది. రోజా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవిలోకి వచ్చినా సదరు ‘ఐరన్ లెగ్’ అనే మాట మాత్రం ఆమె జీవితంలో నుంచి తొలగిపోవడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించడానికి ప్రయత్నిస్తున్న రోజా ఈ సారి తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయమనే విషయంలో పోలింగ్ రోజు క్లారిటీ వచ్చేసింది. తనను ఓడించడానికి తన పార్టీ నాయకులే పనిచేస్తున్నారని రోజా బాహాటంగా చెప్పుకుని లబోదిబో అనడం గురించి అందరికీ తెలిసిందే. దీన్నిబట్టి ఏంటంటే, నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడం మాత్రమే కాదు.. ఫలితాలలో మొదటగా వచ్చే ఫలితం నగరిదే.. అంటే, వైసీపీకి ఓటమి బోణీ కొట్టేది రోజా నియోజకవర్గమేనన్నమాట.. పాపం వైసీపీ, అయ్యో పాపం రోజా! ఎన్నికల ఫలితాలలో మొదటి ఫలితం తనదే అయ్యే అదృష్ణం రోజాకి ఎందుకు పట్టిందంటే, నగరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువ. ఇక్కడ మొత్తం 2,02,574 మంది ఓటర్లు వున్నారు. పోలింగ్ బూత్‌ల సంఖ్య కూడా తక్కువ (231). అలాగే పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువే. ఇక్కడ కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే రంగంలో వున్నారు. సంఖ్యాపరంగా అన్నిరకాలుగా తక్కువలో వున్న నగరి నియోజకవర్గం రోజాకి, వైసీపీకి మొదటి షాక్ ఇవ్వబోతోంది.

బుద్ద వనంలో ఘనంగా బౌద్జ జయంతి ఉత్సవాలు

ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన   గౌతమ బుద్దుడు గొప్ప దార్శనికుడని , ఆయన చూపిన అష్టాంగ మార్గం ఆచరణీయమని తెలంగాణ పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రమేష్ నాయుడు అన్నారు. బుద్దవనంలో టీజీటీఎస్ సీ నిర్వహించిన 2568వ బుద్ద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. కర్ణాటక రాష్ట్రంలోని బైలు కుప్పె, సెరా బౌద్దారామం  నుంచి వచ్చిన గెషెనవాంగ్ జుంగే , సికింద్రాబాద్ మత బోధి బుద్ద విహార నుంచి వచ్చిన శీలం ల నేతృత్వంలో  బుద్ద పాదాల వద్ద బుద్ద పాదాభినందనం, ఆచార్య నాగార్జున కాస్య శిల్పం వద్ద పుష్ప నివాళి అర్పించారు.  అనంతరం మహా స్థూప సమావేశమందిరంలో  బుద్దవనంతో ప్రారంభమైన బుద్ద జయంతి ఉత్సవ సభకు, రమేష్ నాయుడు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా హాజరైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయ చరిత్ర విభాగ పూర్వ అధ్యక్షులు, చరిత్ర కారిణి, ఆచార్య అలోకాపరాషెర్ సీకు, బౌద్దంలో స్నేహం, శాతావాహన  విశ్వ విద్యాలయ మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య మల్లేష్ సంకశాల బౌద్దంలో సామాజికత అన్న అంశాలపై ప్రసంగించారు. బుద్దవనం కన్సల్టెంట్  డాక్టర్ శివనాగిరెడ్డి రచించిన బుద్ధుని మొదటి ప్రవచనం, బుద్దుని  చివరి రోజులు పుస్తకాలను విషిష్ట అతిథులు ఆవిష్కరించగా బుద్ధవనంపై జరిగిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు రమేష్ నాయుడు బహుమలులను అందించారు. ,బుద్ద వన ఓయస్డీ సుదర్శన్ రెడ్డి,  టీజీటీసి, ఎగ్జిక్యూటివ్   డైరెక్టర్  ఉపేందర్ రెడ్డి, హోటల్స్ జీఎం,  నాగార్జున సాగర్   యూనిట్ మేనేజర్  , అధి సంఖ్యలో  బౌద్దులు  ఉత్సవాల్లో  పాల్గొన్నారు.

దేవుడా... కొడాలి నాని బతకాలి!

మేక ఆకులు నమిలినట్టు నాన్‌స్టాప్‌గా గుట్కా నమలటం, చీకటి పడిన దగ్గర్నుంచి నుంచి అర్ధరాత్రి దాటే వరకు  పీకల్దాకా తాగడం. నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఎవరో ఒకర్ని తిడుతూ వుండటం.... ఇదీ కొడాలి నాని దినచర్య. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ వుంటే ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి సడెన్‌గా ఫ్యూజ్ కొట్టేస్తుంది. ప్రస్తుతం కొడాలి నాని ఫ్యూజ్ ఉండనా, కొట్టేయనా అన్నట్టుగా వుందని సమాచారం. గుడివాడలో గురువారం ఉదయం తన పార్టీ నాయకులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, ఆయనకు వైద్యులు చికిత్స అందించడం గురించి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా వుందనే సమాచారం లేదు. సకల కళా వల్లభుడైన కొడాలి నాని ఆరోగ్యం పాతాళానికి చేరుకుందని మాత్రం తెలుస్తోంది. కొడాలి నాని తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘దేవుడా... కొడాలి నాని బతకాలి.. ఆయన మళ్ళీ మామూలు మనిషిలా అందరిలో తిరగాలి’’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రార్థనలు ఫలించి, దేవుడు కరుణించి కొడాలి నాని పూర్తిగా కోలుకుంటారని ఆశిద్దాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఆయన కోలుకోవాలని కోరుకుంటున్న వాళ్ళు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాదు.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. అదేంటీ అనుకుంటున్నారా... అదే కొడాలి నాని విలన్‌గా ‘రంగస్థలం-2’. ‘రంగస్థలం’ సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, సినిమా మొదట్లో విలన్‌ని ఎవరో చంపబోతుంటే హీరో కాపాడతాడు. ఎందుకు కాపాడతాడంటే, దుర్మార్గుడైన విలన్‌కి ఎవరో శిక్ష విధించకూడదు.. తానే శిక్ష విధించాలి. అందుకోసమే కాపాడాడు. అలాగే, కొడాలి నాని విలన్ అయిన పొలిటికల్ ‘రంగస్థలం-2’ ప్రకారం, ఇప్పుడు కొడాలి నానికి ఏమైనా అయితే, ఆయన చేసిన పాపాలన్నిటికీ శిక్ష ఎలా అనుభవిస్తాడు? అందుకే, ఆయన బతికుండాలి, గుడివాడ నియోజకవర్గంలో తన ఓటమిని స్వీకరించాలి. ఆ తర్వాత ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. అప్పటి వరకూ ఆయన క్షేమంగా వుండాలి. 

ముస్లిం రిజర్వేషన్ చట్ట విరుద్ధం హైకోర్టు సంచలన తీర్పు!

ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.  2010 సంవత్సరం తర్వాత నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 14 ఏళ్ళ‌ వ్యవధిలో జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దయ్యాయి.  అయితే, ఓబీసీ సర్టిఫికెట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతరాని వెల్లడించింది. 2010 సంవత్సరం తర్వాత మ‌మ‌తా సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు 1993 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2010 ఏప్రిల్‌ – సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది.  2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  స్పష్టం చేశారు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగుబాటు?

పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి ఈవీఎం ను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్ల ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోనికి వచ్చిన తరువాత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో పోలీసులు పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం (మే 22) ఆయన సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో చిక్కినట్లే చిక్కి తప్పించుకు పారిపోయారు. ఆ సందర్భంగా ఆయన కారును అందులో ఉన్న ఆయన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన కారు డ్రైవర్ ను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఇలా ఉండగా ఆయన తమిళనాడు వెళ్లారనీ, అక్కడ నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్నరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇలా ఉండగా గురువారం (మే 23) ఆయన నరసరావు పేట కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయని అందిన సమాచారం మేరకు పోలీసులు నరసరావుపేట కోర్టు వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. 

పిన్నెల్లి ఆస్తుల్ని సీజ్ చేయాలి! ఉక్కుపాదంతో అణిచేయాలి!

పల్నాడు ప్రాంతంలో జరిగిన పోలింగ్ హింసను చూసి వామ్మో అనుకుంటున్నాం కానీ... ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగే నేరపూరిత చర్యలు వింటేనే వళ్ళు జలదరిస్తుంది. తుపాకులు ధరించి యదేచ్చగా తిరిగే రాజకీయ నాయకుల అనుచరులను ఎదిరించి బ్రతికేవారు ఉండరు. వీళ్ళని స్వయంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులే పొంచి పోషిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి అనేవాడు లేకుండా చేసి ఎన్నికల్లో "ప్రజాస్వామ్యబద్ధంగా" గెలుస్తారు.  కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ లో, పోలీస్ కస్టడిలో ఉండగా, మీడియా లైవ్ లో కాల్చి చంపబడ్డ ఆతిక్ అహ్మద్ అనే రాజకీయ నాయకుని చరిత్ర తెలుసుకున్నప్పుడు.... అధికారం చేతిలో ఉన్న రాజకీయ రౌడీల ముందు... ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, భారత రాజ్యాంగం ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతున్నాయి అనే విషయం మనకి అర్థం అవుతుంది. హింస, హత్య రాజకీయాలతో 40 సంవత్సరాలపాటు ఎం.పీ, ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ గ్యాంగస్టర్ ను ఏ ప్రభుత్వము, ఏ వ్యవస్థ ఏమి చేయలేకపోయాయి. జడ్జీలు కూడా అతని కేసు తీసుకోవడానికి భయపడేవారట. "నీకు వ్యవస్థలు, చట్టం అంటే గౌరవం లేనప్పుడు... నీకు జీవించే హక్కు లేదు" అనే విధానాన్ని యూపీ ప్రభుత్వం అమలు చేయటం మొదలుపెట్టి, గ్యాంగస్టర్ లను నిర్ధాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఈ నేరపురిత విష సంస్కృతి అదుపులోకి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత మాఫియా పోకడ ఇక్కడ లేకపోయినప్పటికీ... రెండు పార్టీలలో రౌడీయిజాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసే వారికి కొదవలేదు. తమ వ్యాపార, ఆధిపత్య పోకడలను బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థలను... ముఖ్యంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటంలో నైపుణ్యమున్న శాసనసభ్యులు అనేకమంది రెండు పార్టీలలోనూ ఉన్నారు. నేడు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నది, పూర్తిగా నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ కారణంగా వస్తున్న ఫలితం. ఒకప్పుడు రాయలసీమ, గుంటూరు పల్నాడు ప్రాంతంలో ప్రముఖంగా కనిపించిన దుర్మార్గమైన ఫ్యాక్షన్ హింస, ఇప్పుడు లేదు. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో బయటపడిన దాడులు, ప్రతి దాడులు పోలీసుల వైఫల్యంతో జరిగినవి. ఏమాత్రం శ్రద్ధ తీసుకుని ఉన్నా ... అలాంటి హింసను అరికట్టే అవకాశం పోలీసుల చేతుల్లో ఉంది.  మే 13వ తేదీ నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 202 పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. అక్కడ EVMను ఎత్తి పడేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ధ్వంసం చేస్తున్న సమయంలో పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అతడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి చేసారు.   పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినట్లు సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది.  ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఈవీఎం ను పగల కొట్టిన దృశ్యం సంచలనంగా కనిపిస్తుంది కానీ... గతంలో బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లి బావుల్లో పారవేసిన, ధ్వంసం చేసిన కేసులు అనేకం ఉండేవి. వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాలు, మొబైల్ ఫోన్ కెమెరాల సాంకేతిక  పరిజ్ఞానం అందులోకి వచ్చినాక.... ఇలాంటి దౌర్జన్యాలు దాదాపు కనుమరుగయ్యాయి.  ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇది తరచూ మనం వినే మాట. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా...ప్రజాస్వామ్యం నిర్దేశించిన పద్ధతులు, ఫలాలు జనాలకు ఇంకా పూర్తిగా చేరలేదు అని చెప్పొచ్చు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని అనేక రకాల హింసాయుత పద్ధతులను ఆచరించి ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఈ దేశంలో కొదవలేదు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

కొడాలి నానికి తీవ్ర అస్వస్థత

గుడివాడ సిట్టింగ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ( మే 23) తన నివాసంలో పార్టీ మండల స్థాయి నాయకులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే నేతలు, గన్ మెన్ లు వైద్యులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.   కొడాలి నాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరన్న వార్తలు ఇటీవలి కాలంలో గట్టిగా వినిపించాయి. ఆయన రెండుమూడు సార్లు హైదరాబాద్ లోని బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చినప్పటి ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే తన  అనారోగ్యం విషయం నాని ఎప్పడూ చెప్పలేదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన అనారోగ్యం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. 

పిన్నెల్లి బ్రదర్స్ ఎన్‌కౌంటర్ ఖాయమా?

పిన్నెల్లి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ ఆరితేరిన దొంగల మాదిరిగా తప్పించుకు తిరుగుతున్నారు. నిజంగానే తప్పించుకు తిరుగుతున్నారో, లేక ప్రభుత్వమే జాగ్రత్తగా తప్పిస్తోందో ఎవరికి తెలుసు? కాకపోతే బయటకి వచ్చే వార్తల లోతును తెలుసుకోలేని సాధారణ ప్రజలు పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారనే అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ వెంట పడుతున్నారని, వాళ్ళు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించకుంటున్నారని... ఇలా సినిమాల్లోని సీన్స్ ఊహించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పోలీసుల నుంచి ఇప్పటికే రెండుసార్లు తప్పించుకున్నారు. సాధారణంగా సినిమాల్లోగానీ, ఒక్కోసారి నిజంగా కూడా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేవారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేస్తూ వుంటారు. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కూడా అలాగే ఎన్‌కౌంటర్ అయిపోతారేమోనని అమాయక జనం అనుకుంటున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.  అలా సినిమా నాలెడ్జ్.తో ఫీలైపోతున్న అమాయక చక్రవర్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడం లేదు. ప్రభుత్వం, పోలీసులు చక్కగా వాళ్ళిద్దర్నీ కాపాడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలూ ఇంటి అల్లుళ్ళ మాదిరిగా అనుభవిస్తూ వాళ్ళు నీడపట్టున హ్యాపీగా వున్నారు. అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఇద్దరూ ఎన్నికల ఫలితాలు విడుదలై, ఎన్నికల కోడ్ ముగిసే వరకూ బయటకి రారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక అప్పటి సంగతి అప్పుడు. మళ్ళీ రాబోయేది తమ రౌడీ రాజ్యమే కాబట్టి అప్పుడు తమకేమీ ఢోకా లేదని ఈ బ్రదర్స్ అనుకుంటూ వుండవచ్చు. కానీ, రాబోయేది రౌడీ రాజ్యం కాదు.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యం. అప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి సీన్ సితారైపోతుంది. 

పిన్నెల్లి వీడియో లీక్ చేసింది పోలీసులేనా? సీఈవో మాటలకర్ధం అదేనా?

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. స్వయంగా అభ్యర్థే పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి, అందరినీ బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మీడియా సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ సమర్ధించుకోవడానికి చేసిన ప్రయత్నం ఆ పార్టీపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తడానికే దోహదపడింది. అంబటి వంటి నాయకులైతే నిస్సిగ్గుగా ఈవీఎం పగులగొట్టడాన్ని పక్కన పెట్టి అసలా వీడియో ఎలా వెలుగులోకి వచ్చింది అంటూ ప్రశ్నించడం విస్మయపరిగింది. అంబటి అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ వీడియో ఫేక్ అని చెప్పడానికి కూడా వెనుకాడలేదు.  అయితే ఆ వీడియో ఎలా వెలుగులోకి వచ్చి ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన ప్రాయంగానైనా సరే వెల్లడించేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ కు వీడియో ఫుటేజిలు అప్పగించామని చెప్పారు. అంటే సిట్ అధికారులే ఈ వీడియోను లీక్ చేశారని ఆయన చెప్పకనే చెప్పేశారు. అదే జరిగితే అధికారులే విపక్షానికి మేలు చేసే విధంగా వీడియో లీక్ చేశారంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నదానికి ఇంత కంటే బలమైన సంకేతం ఏముంటుంది?  క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కనిపెట్టే అవకాశం ఇంకెవరికన్నా పోలీసు  శాఖకే అధికంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఒక ఎమ్మెల్యేను ఏడేళ్ల పాటు జైలుకు పంపిం చేందుకు సాక్ష్యంగా ఉన్న వీడియో గురించి. ఈ వీడియో ఎమ్మెల్యేను నేరస్తుడిగా నిరూపించడమే కాదు, వైసీపీ ప్రతిష్టను కూడా కొలుకోలేనంతగా దెబ్బతీసింది.  నిజంగా క్షేత్ర స్థాయిలో జగన్ పార్టీకి ప్రజా మద్దతు ఉండి ఉంటే, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి ఎన్నికౌతారనుకుంటే కచ్చితంగా పోలీసలు ఈ వీడియోను లీక్ చేయరు.  గత ఐదేళ్లుగా పోలీసు శాఖ జగన్ కు అనుకూలంగా ఎంతగా నింబంధనలకు కూడా తిలోదకాలిచ్చేసి పని చేసిందో చూశాం.   తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా అరెస్టు చేశారో చూశాం. అలాగే చంద్రబాబు అరెస్టు కు సంబంధించి సీఐడీ చీఫ్ మీడియా సమావేశాలు పెట్టి మరీ రాజకీయాలు మాట్లాడిన వైనాన్ని గమనించాం. అటువంటి పోలీసు శాఖ  జగన్ కు జగన్ పార్టీకీ భారీ నష్టం చేకూరుస్తుందని తెలిసి కూడా లీక్ చేశారంటే.. రాబోయే సర్కార్ కచ్చితంగా వైసీపీ సర్కార్ కాదన్న నిర్ధారణకు వచ్చేశారనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు కూడా వైసీపీ చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి  ఈసీ ద్వారా బీజేపీ సహకారం అందిస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెడితే అది తనను తాను మోసం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని గట్టిగా విశ్వసిసించినా కూడా  బీజేపీ తెలుగుదేశంకు ఈ రకంగా సహకారం అందించే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఉండవు,  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామి అయినప్పటికీ బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను విమర్శించే విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో ఎన్నికల ప్రచార సమయంలో చూశాం.  స్వయంగా ప్రధాని మోడీయే తన ప్రసంగంలో ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలుగుదేశం కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్నా కూడా  బీజేపీ తెలుగుదేశం పార్టీకి సహకరించేందుకు ముందుకు రాదు.  అయినా   ఎన్డీయే కూటమిలో తన తరువాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అన్న సంగతి తెలిసిన బీజేపీ, జగన్ రెడ్డి పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎంత మాత్రం సాహసించే అవకాశాలు లేవు. ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుని పరిశీలిస్తే పోలీసుల ద్వారానే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో విడుదలైందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీ కొంప ముంచేసేవిగానే ఉన్నాయని అర్ధం. పరిశీలకులు దీనినే ఉటంకిస్తూ జగన్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని అంటున్నారు. 

ఫలితాల రోజు వాటర్ తాగండి బ్రో!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీ సర్వనాశనం అయిపోవడం ఖాయమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అలాగే కేంద్ర రాజకీయాల గురించి కూడా ఆయన తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలను కొంతమంది విమర్శిస్తున్నారు. ఇది సహజం. అయితే తన అంచనాలపై వస్తున్న  విమర్శలకు ప్రశాంత్ కిషోర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెరైటీ కౌంటర్ ఇచ్చారు. ‘‘శరీరానికి, మెదడుకు నీరు చాలా అవసరం. నా అంచనాలను విమర్శిస్తున్న వారు జూన్ 4వ తేదీన బాగా మంచినీరు తాగడం మంచిది.. ఎందుకంటే, ఆరోజు వచ్చే ఫలితాలను చూసి వాళ్ళ శరీరంలో నీరు ఆవిరైపోయే ప్రమాదం వుంది’’ అనే అర్థం వచ్చే విధంగా ఎక్స్.లో కామెంట్ పోస్ట్ చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రశాంత్ కిషోర్ తాను చెప్పినదానికి కట్టుబడి వుంటున్నారు. అంటే, మన జలగన్న ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్!  

రెండు శక్తులు కలిశాయ్.. సైకోని తరిమేశాయ్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రకంగా ప్రాధాన్యం వున్న అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల తీరునే మార్చేసిన సంఘటన ఒకటి జరిగింది. అదే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కీలక సమయంలో మరోసారి పొత్తు కుదరడం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైన కులాలు.. కమ్మ, కాపు! కమ్మ కులానికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బలం ఎక్కువ వుంది. కాపు కులానికి కొన్ని ప్రాంతాల్లో రెడ్డి కులానికి బలం ఎక్కువుంది. బలం లేని ప్రాంతాల్లో రెండు కులాలకూ బలహీనత వుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు కులాలు ఒక్కటైతే మరో బలమైన కులం రెడ్డికి బలం తగ్గిపోతుంది. అందుకే చాలాకాలంగా ఈ రెండు కులాలు ఒక్క తాటిమీద నడవకుండా చేయడానికి ‘రెడ్డి’ నాయకులు శాయశక్తులా కృషి చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు, ఏర్పడిన తర్వాత తెలుగు రాజకీయాలలో రెడ్డి కులం ఆధిపత్యం కొనసాగేది. 1983లో ఎన్టీఆర్ రంగప్రవేశం చేసిన తర్వాత కమ్మ కులం బలమేంటో రాజకీయంగా రెడ్లకు అర్థమైంది. రాష్ట్ర రాజకీయాల్లో తమకు పెద్ద ముప్పు ఏమిటో అవతగమైంది. ఒక్క కమ్మకులాన్ని అయితే ఎలాగోలా ఎదుర్కోవచ్చు.  కమ్మ, కాపు కులాలు రెండూ కలిశాయా.. ఇక తమకు ఉనికే ఉండదని క్లియర్‌గా తెలిసిపోయింది. అందుకే ఈ రెండు బలమైన కులాల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు.  రంగాని ఎవరు హత్య చేశారో రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన సీనియర్లు చాలామందికి తెలుసు. కానీ, ఆ నేరాన్ని ఎన్టీఆర్ మీద, కమ్మ కులం మీద నెట్టారు. చేయని పాపాన్ని కమ్మ వారి మీద రుద్దారు. అప్పటి నుంచి కాపులు కమ్మ కులస్తులను శత్రువులుగానే చూస్తూ వచ్చారు. అప్పుడప్పుడు పాత పగలు చల్లారి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే సందర్భం వచ్చినా ‘రెడ్డి రాజులు’, కాపుల్లోనే వున్న ముద్రగడ లాంటి పెద్దలు చెడగొడుతూ వచ్చారు.  ఎన్నో అవరోధాలను అధిగమించి కాపు కుల ఆశాదీపంగా వున్న పవన్ కళ్యాణ్‌కి, కమ్మ నాయకుడైన చంద్రబాబుకు మధ్య 2014లో పొత్తు కుదిరింది. అధికారం దక్కింది. రెండు కులాల సత్తా ఏమిటో తెలిసింది. మధ్యలో కొంతమంది క్రియేట్ చేసిన విభేదాలు ఇద్దర్నీ మళ్ళీ దూరం చేశాయి. దాంతో 2019లో అపజయం తప్పలేదు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్ల సందర్భంగా ఈ రెండు కులాల నాయకులు ఒకే తాటిమీద నడవడం శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కమ్మ, కాపు కులాలకు చెందిన నాయకులు ఎన్నికలలో కలసికట్టుగా పనిచేశారు. కమ్మ కులం బలం తక్కువున్న చోట కాపు కులస్తులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. కాపు కులం బలం తక్కువున్న ప్రాంతాల్లో కమ్మ కులస్తులు కూటమిని బలోపేతం చేశారు. రెండు కులాలకూ బలం వున్న ప్రాంతంలో ఇక చెప్పేదేముంది... పండగే పండగ. దమ్మున్న కమ్మ కులస్తులు, ఊపున్న కాపు కులస్తులు... ఈ రెండు శక్తులూ కలిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోని తరిమేశాయ్.

జగన్ మేనమామ కూడా చెప్పేశారు.. ఫలితాలపై ఆశలొద్దని!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ ఐదేళ్ల దుష్టపాలనను వదిలించేసుకుందా? ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ వైసీపీ నేతల మాటలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి ఉక్రోషం చూస్తుంటే.. విజయంపై నమ్మకాన్ని వాళ్లు వదిలేసుకున్నారని అనిపించక మానదు. ఎంత గంభీరంగా ఉందామని ప్రయత్నించినా, విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్లు నటిద్దామని ప్రయత్నించినా, వారికి తెలియకుండానే మాటల్లో నిరాశ, ముఖంలో నిర్వేదం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. నగరి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి రోజా పోలింగ్ రోజునే మీడియా ముందకు వచ్చి తనను తన పార్టీ వారే ఓడించడానికి ప్రయత్నించారని ఎవరూ అడగకుండానే తన ఓటమి మాట చెప్పేశారు. ఆ తరువాత సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు అయితే పోలీసులు తెలుగుదేశం వారితో కుమ్మక్కైపోయారని విమర్శలు గుప్పించి, తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకున్నారు. అంతే కాకుండా రీపోలింగ్ డిమాండ్ చేసి తనకు జనం ఓట్లు వేయలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తగదునమ్మా అని రీపోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు, ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఆత్మ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని పరోక్షంగా చెప్పేశారు. తన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని చడీచప్పుడు లేకుండా రాష్ట్రం దాటించేశారు. పోలింగ్ రోజు నుంచి సజ్జల భార్గవ్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ ఇలా పూర్తయ్యిందో లేదో వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళాలు పడిపోయాయి. ఇక జగన్ భజనలో ఆరితేరిన కొమ్మినేని శ్రీనివాసరావు అయితే తొందరపడి బెట్టింగులూ గట్రా కట్టి సొమ్ములు పోగొట్టుకోకండి అంటూ అడగకుండానే వైసీపీ అభిమానులు, కార్యకర్తలకు ఒక ఉచిత సలహా పారేసి, వైసీపీ విజయంపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పేశారు. నిజానికి వైసీపీ గెలుపుపై బెట్టింగులు కాయడానికి వైసీపీ వారెవరూ సిద్ధంగా లేరనుకోండి అది వేరే విషయం. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. వల్లభనేని వంశీ గోడెక్కేశాడు. ఎటు దూకాలో తేల్చుకునే పనిలో ఉన్నారు. ఇక  ఆపద్ధమర్మ ముఖ్యమత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్  సొంత మేనమామ, పార్టీ కమలాపురం అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అయితే తన మేనల్లుడి పార్టీ రాష్ట్రాన్ని గబ్బుపట్టించేసిందని వ్యాఖ్యానించి మొత్తం గాలి తీసేశారు. పోలింగ్ పూర్తయిన తరువాత తాపీగా ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా మనసులో మాట బయటపెట్టేశారు. రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని మీడియాకు చెప్పేసి ఆ తరువాత నాలుక్కరుచుకున్నారు, అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఆయన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయాయి.  స్వయంగా జగన్ మేనమామ రవీంద్రనాధరెడ్డే వైసీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బుపట్టించిందంటూ నిజం కక్కేయడంతో వైసీపీ శ్రేణులలో కాస్తో కూస్తో ఉన్న గెలుపు నమ్మకం పూర్తిగా పోయిందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  

వైసీపీ కొత్త డ్రామా...రీ పోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి

   దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్లలో రిగ్గింగ్ వ్యవహారం కోర్టుకెక్కింది. మొగుడిని కొట్టి  మొగసాలకు ఎక్కినట్టు రిగ్గింగ్ కు పాల్పడిన వైసీపీయే కోర్టు మెట్లు ఎక్కింది. రిగ్గింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనే పిన్నెల్లి మీద చట్ట పర చర్యలు తీసుకోవాలని కోరే బదులు రీ పోలింగ్ డ్రామాకు వైసీపీ తెరలేపింది.  పల్నాడు ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అయిందని   మంత్రి  అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని, తనను తిరగకుండా అడ్డుకున్నారని అన్నారు. ఒక బూత్‌లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్‌ చేశారని, రీపోలింగ్‌ నిర్వహించబోమని ముందుగానే ఈసీ చెప్పడం సరికాదన్నారు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్‌ జరిగిన పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారుఎన్నికల పోలింగ్ పై మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుమందిని చేర్చారు.  ఈ పిటిషన్ ధర్మాసనం రేపు విచారించే అవకాశం ఉంది.  

ఎన్డీయే కూటమిలోతెలుగుదేశం మాత్రమే శక్తిమంతమైన పార్టీ!

ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి వేవ్ లేదని రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర శర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేవ్ లెస్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలను ఎన్డీయేలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీ బోలెడంత రాజకీయ లబ్ధి పొందిందని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నిటిలోనూ తెలుగుదేశం పార్టీయే శక్తమంతమైనదని చెప్పిన ఆయన ఆ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా జీరో స్టేక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో  కూడా కొన్ని స్థానాలను బీజేపీ దక్కించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.  అన్నిటికీ మించి ఐదేళ్ల పాటు ఏపీలో అధకారంలో ఉన్న వైసీపీకి అన్ని విధాలుగా అండదండలు అందించి, ఇరు పార్టీల మధ్యా ఏదో రహస్య బంధం ఉందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడేలా చేసుకున్న బీజేపీ.. చివరి నిముషంలో తెలివిగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపడం ఆ పార్టీకి కచ్చితంగా ఎన్నికల లబ్ధి చేకూరుస్తుందని అన్నారు.  అన్ని విధాలుగా తమ అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహరించిన, ఇక ముందు కూడా వ్యవహరించక తప్పని స్థితిలో ఉన్న వైసీపీని కాదని, సమస్యలపై, రాష్ట్ర ప్రయోజనాలపై గట్టిగా నిలబడి నిలదీసే చంద్రబాబును ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ వ్యూహకర్తలు వాస్తవికంగా ఆలోచించారనీ, ఉత్తరాదిలో ఏదో మేరకు బీజేపీ నష్టపోతున్నదన్న అంచనాల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా దక్షిణాదిలో ఆమేరకు బలం పెంచుకోనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీతో జత కట్టిందని ఆయన విశ్లేషించారు.   ఇక సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన ఐదు విడతల పోలింగ్ లో బీజేపీకి సంతృప్తికర ఫలితాలు వస్తాయన్న భావన పరిశీలకుల్లో వ్యక్తం కాలేదు. ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్న తమిళనాడు( ఇప్పటి వరకూ తమిళనాట బీజేపీకి పెద్ద స్టేక్ లేదు. అయితే జయ మరణం తరువాత ఏర్పడిన రాజకీయ వాక్యూమ్ ను భర్తీ చేయడానికి కమలనాథులు ప్రయత్నించారు. పోలింగ్ కు ముందు వరకూ కూడా తమిళనాట చెప్పుకోదగ్గ స్ధానాలు వస్తాయని భావించారు. అయితే పోలింగ్ సరళితో కమలనాథుల ఆశలు ఆవిరయ్యాయి. ) ఆ తరువాత కర్నాటక విషయానికి వస్తే  అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా క్షేత్ర స్థాయిలో ఉన్న బలంతో అక్కడ గతంలో కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించింది. అయితే పోలింగ్ సరళి చూసిన తరువాత బీజేపీలో ఆ ఆశ కూడా ఆవిరైపోయిందని అంటున్నారు. ఇక శివసేన, ఎన్సీపీలను చీల్చిన కారణంగా మహారాష్ట్రలో కూడా బీజేపీ బాగా బలహీన పడిందని, ఆ పార్టీల చీలిక అంతిమంగా బీజేపీకే చేటు చేసిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ఏక్ నాథ్ షించే వర్గం శివసేన ఇప్పుడు రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజల సానుభూతి ఉద్ధవ్ థాక్రే వర్గానికి వరంగా మారే అవకాశాలు ఉన్నాయన్నది పరిశీలకులు అంచనా. అదే విధంగా ఎన్సీపీలోని చీలిక కూడా అంతిమంగా బీజేపీకి నష్టం చేస్తుందని చెబుతున్నారు.  అలాగే బీహార్ లో నితీష్ కుమార్ ను దగ్గరకు తీయడం కూడా ఆ రాష్ట్రంలో బీజేపీకి కొంపముంచే వ్యవహారంగానే మారింది. కేవలం ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం తరచూ కూటములను మార్చేసే నితీష్ కుమార్ పట్ల బీహార్ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోందనీ, ఆ కారణంగా కూడా ఆ రాష్ట్రంలో నితీష్ తో పాటు బీజేపీ కూడా భారీగా నష్టపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.  ఇన్ని నష్టాల మధ్య బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడం వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీ చెప్పుకోదగ్గ స్థానాలలో పొలిటికల్ గెయిన్ సాధిస్తుందని రుచిర్ శర్మ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వేవ్ లేని ఈ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి  ఒక వేళ అధికారంలోకి వస్తే.. ఆ కూటమిలో శక్తిమంతమైన పార్టీగా తెలుగుదేశం నిలుస్తుందని చెబుతున్నారు.  

తెలంగాణ ఆర్టీసీ లోగో సిద్దం కాలేదు: సజ్జనార్ 

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారుఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించారు. జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్‌ హెడ్స్‌, అధికారిక పత్రాల్లో సైతం టీజీ అని వచ్చేలా చూడాలన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం టీజీగా మార్చడంతో టీఎస్‌ఆర్టీసీ కూడా టీజీ ఆర్టీసీగా మారుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఆర్టీసీ లోగో కూడా మారిపోయిందంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అయ్యాయి. మారిన లోగో ఇదేనంటూ కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే దీంట్లో ఏ మాత్రం నిజం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ క్లారిటీ ఇచ్చారు. లోగో మార్పుపై జరుగుతోన్న ప్రచారానికి సంబంధించి ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు.  ‘కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ ఆర్టీసీ  కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.  

అన్న చాలా మంచోడు.. పిన్నెల్లికి జగన్ కితాబు.. వైరల్ అవుతున్న పాత వీడియో

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా ఆయన పోలీసులను తప్పించుకుని పరారైపోయారు. అజ్ణాతంగా ఉన్నారు. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ సంఘటనలన్నీ ఆయన ఎంతటి నేరస్తుడో ఎవరికైనా అర్ధం అయిపోతుంది. పిన్నెళ్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కనీసం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని సాక్షాత్తూ  డీజీపీయే చెప్పారు. అటువంటి నేరస్థుడికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన కితాబుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  తెగ వైరల్ అవుతోంది.  ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న వీడియోను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుందనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఎందుకంటూ ఏకి పారేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో జగన్ ఏమన్నారంటే.. పిన్నెల్లి అన్న తనకు సోదర సమానుడు. చాలా మంచి వ్యక్తి. ఆయనను మంచి మెజారిటీతో గెలిపిస్తే ఆయనకు ఉన్నత స్థానం హోదా కల్పిస్తాను. అంటే మంత్రిని చేస్తాను. మీరంతా ఆయన వెనుకే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాటలన్నీ జగన్ స్వయంగా అన్నవి. వాస్తవానికి పిన్నెల్లి మంచి తనం ఏమిటో ఈవీఎం ధ్వంసం ఘటనతో, అదేమని ప్రశ్నించిన ఒక మహిళపై దుర్భాషలాడిన వీడియోతోనే తేలిపోయింది.  దీంతో ఇప్పుడు వైసీపీ నోరు మూతపడిపోయింది. పిన్నెల్లిని సమర్ధించుకునేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. ఇటువంటి పిన్నెల్లిని చాలా మంచి వ్యక్తి అంటూ పొగిడిన జగన్ కు జనం ముందు దోషిగా, రౌడీలకూ, గూండాలకూ కొమ్ముకాసే వ్యక్తిగా ముద్రపడిపోయింది.