అల్లు అర్జున్ కెరీర్ పై సీనీ రాజకీయ రంగాల్లో విస్తృత చర్చ
posted on May 25, 2024 @ 12:51PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకుంటుంది అన్న చర్చలతో పాటు మరో వ్యక్తి గురించి కూడా రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీకి దగ్గర బంధువు.. అలా చెప్పే కంటే.. మెగాస్టార్ చిరంజీవికి స్వయానా మేనల్లుడు. అటువంటి అల్లు అర్జున్ ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు అంటూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతుగా నంద్యాల వెళ్లి మరీ ర్యాలీలో పాల్గొన్నారు.
మరో వైపు జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయనకు ఒక ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించి ఊరుకున్న అల్లు అర్జున్ పనిమాలా నంద్యాల వరకూ వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థి శిల్పాకు మద్దతు ప్రకటించి రావడం సంచలనం సృష్టించింది. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు పొసగడం లేదా అన్న అనుమానాలు సైతం సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం కూడా జరిగింది. అది పక్కన పెడితే ఓట్ల లెక్కింపు జరిగి, ఫలితాలు ప్రకటించే జూన్ 4వ తేదీ సమీపిస్తున్న కొద్దీ అల్లు అర్జున్ పై రాజకీయ సినీ రంగాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఒక వేళ శిల్పా ఓడిపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి అన్నదే ఈ చర్చ. ఎందుకంటే పోలింగ్ సరళిని చూసిన తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం కూటమే అన్న భావన సర్వత్రా బలపడింది. అందుకు తగ్గట్టుగా వైసీపీ శ్రేణులు, నేతల ప్రకటనలు కూడా ఓటమిని అంగీకరించేసినట్లుగానే ఉన్నాయి. దీంతో వైసీపీ అధికారం కోల్పోయినా, గెలిచే కొన్ని సీట్లలో నంద్యాల లేకపోతే అల్లు అర్జున్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు. అదే సమ యంలో జూనియర్ ఎన్టీఆర్ కున్న సంయమనం కూడా అల్లు అర్జున్ పాటించలేదని అంటు న్నారు. ఎందుకంటే వైసీపీ తరఫున గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లు ఎన్టీఆర్ కు చాలా సన్నిహిత స్నేహితులు. వారిరువురూ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేశారు.
అయితే ఆ ఇద్దరి తరఫునా ప్రచారం చేయడానికి కానీ, మద్దతు పలకడానికి కానీ ఎన్టీఆర్ ముందుకు రాలేదు. అసలు తన స్నేహితులు ఇద్దరూ వైసీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ వారికి అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు అటువైపు చూడనే లేదు. అయితే అందుకు భిన్నంగా బన్ని అనవసర ఆర్భాటం చేసి మరీ శిల్పాకు మద్దతుగా నంద్యాల వెళ్లారని సినీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. బన్నీ తీరు కచ్చితంగా ఆయన కెరీర్ పై ప్రభావం తప్పకుండా పడుతుందని చర్చించుకుంటున్నారు.