కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరాలంటే చంద్రబాబే దిక్కు!?
posted on May 25, 2024 @ 12:00PM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి విజయం ఖారారైపోయింది. ఈ విషయాన్ని పోలింగ్ కు ముందు.. అంటే షెడ్యూల్ విడుదల కావడానికి ముందు వెలువడిన దాదాపు డజన్ ప్రముఖ సర్వే సంస్థలు చెప్పేశాయి. పోలింగ్ సరళి, పోలింగ్ తరువాత వైసీపీ నేతలు, శ్రేణుల భాష, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుగుదేశం కూటమిదే అధికారమని చెప్పకనే చెప్పేశాయి. అధికారికంగా ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. కనీసం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావాలన్నా జూన్ 1 వరకూ ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకూ ఎవరి అంచనాలు వారివి. ఎవరి ధీమా వారిది అనే భావించాల్సి ఉంటుంది. అయితే అయితే ప్రశాంత్ కిషోర్ సహా ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్టులు మాత్రం ఇప్పటికే తమ అభిప్రాయంగా ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం సునాయాసమని చెప్పారు. తాజాగా ఆ జాబితాలోకి సీనియర్ పోల్ అనలిస్ట్ యోగేంద్ర యాదవ్ చేరారు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో ని పాతిక లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం కూటమి కనీసం 15 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని విశ్లేషించిన ఆయన తెలుగుదేశం అండ లేకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరే అవకాశాలు చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఘనంగా చెప్పుకుంటున్నట్లుగా సొంతంగా మూడు వందలకు పైగా స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మృగ్యమన్నదే తన అభిప్రాయమని అన్నారు. ఆయన చెప్పిన ఈ మాటలు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆయన ఇటీవల వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పడమే కాకుండా కేంద్రంలో బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధిస్తుందని చెప్పారు.
అయితే యోగేంద్రయాదవ్ మాత్రం బీజేపీ అగ్రనేతలు ప్రకటనలు చేస్తున్నట్లుగా ఎన్డీయే కూటమి 400 స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు. బీజేపీకి కంచుకోటలాంటి ఉత్తర ప్రదేశ్ లోనే ఆ పార్టీ భారీగా సీట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యోగేంద్రయాదవ్ అంచనా ప్రకారం బీజేపీ సొంతంగా 240 నుంచి 260 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మరో 35 నుంచి 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందనీ, దాంతో మొత్తంగా ఎన్డీయేకు 275 నుంచి 305 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మేజిక్ ఫిగర్ 272 అన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా 303 స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆ పరిస్థితి ఎంత మాత్రం లేదని యోగేంద్రయాదవ్ అభిప్రాయపడ్డారు. సో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడక తప్పదనీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో సీట్ల పరంగా ఎక్కువ స్థానాలు సాధించే పార్టీ తెలుగుదేశమేననీ చెప్పిన ఆయన కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరాలంటే, సుస్థిరంగా కొనసాగాలంటే తెలుగుదేశంపై ఆధారపడక తప్పదని యోగేంద్రయాదవ్ చెప్పారు.