అభ్యర్థులకు చెమట్లు పట్టిస్తున్న నోటా!
posted on May 25, 2024 @ 11:17AM
నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కీలకం కాబోతోంది. బారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్న నియోజకవర్గాలను పక్కన పెట్టేస్తే.. హోరాహోరీగా పోటీ జరిగిన నియోజకవర్గాలలో మాత్రం నోటా గెలుపు ఓటములను కచ్చితంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు వారు పలు ఉదాహరణలు కూడా చూపుతున్నారు. దీంతో ఏపీలో ఇప్పుడు పలు నియోజకవర్గాల అభ్యర్థులకు నోటా టెన్షన్ పట్టుకుంది. నోటా కోటాలో ఎన్ని ఓట్లు పడి ఉంటాయన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. 2014 ఎన్నికలలో నోటా ఓట్లు పెద్దగా ప్రభావం చూపలేదు కానీ, 2019 ఎన్నికలలో నోటాకు పడిన ఓట్లు గణనీయంగా పెరిగాయి. 2024 ఎన్నికలలో కూడా అదే జరిగితే.. ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశమే ఇప్పుడు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది.
ఉదాహరణకి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 2014లో నోటాకు 14వేల457 ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆ సంఖ్య 48వేల621కి పెరిగింది. గిరిజన ప్రాంతాలలో పెరిగిన అక్షరాస్యత ఓటర్లు నోటా వైపుకు మొగ్గు చూపేలా చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే గిరిజనులలో అక్షరాస్యులు నోటావైపు మొగ్గు చూపుతున్నారని భావిస్తున్నారు. అరకు నియోజకవర్గాన్నే తీసుకుంటే.. అక్కడ 2019 ఎన్నికలలో నోటాకు వచ్చిన ఓట్ల విషయంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
దీంతో ఇప్పుడు నోటా ఓటు అభ్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. కొన్ని సందర్బాలలో విజయం సాధించిన అభ్యర్థికి, పరాజయం పాలైన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇందుకు ఉదాహరణగా చోడవరం నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థి మెజారిటీ నోటాకు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా ఉన్నాయి.