షర్మిల మళ్లీ మొదలెట్టేసారు!
posted on May 25, 2024 @ 9:53AM
అసలే ఓటమి భయంతో వణికి పోతున్న వైసీపీ నేతలకు ఇప్పుడు షర్మిల విమర్శల దాడి పుండుమీద కారం చల్లినట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా గొంతెత్తినా వారిని తెలుగుదేశం పెయిడ్ అర్టిస్టులంటూ నిందలేని, విమర్శలు చేసి నానాయాగీ చేసి చంకలు గుద్దుకున్న వైసీపీ నేతలకు షర్మిల రిటార్డ్ మింగుడు పడలేదు. అందరినీ విమర్శించినట్లే షర్మిలపై కూడా వైసీపీ నేతలు, శ్రేణులు తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ముద్రవేసి గేలిచేసే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వారికి దీటుగా బదులిచ్చి నోళ్లు మూయించగలిగారు. షర్మిల చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వైసీపీ విమర్శలకు, తనకు స్క్రిప్ట్ చూసి ప్రసంగాలు చేయాల్సిన ఖర్మ లేదని చెప్పడమే కాకుండా.. జగన్ కు స్క్రిప్ట్ రాసేవాళ్లెవరో కాస్త వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు చెప్పారు. అంతే కాదు.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలన్నిటి వెనుకా ఉన్నది జగన్ ప్రభుత్వమేనంటే ఎదురుదాడికి దిగారు. కడప లోక్ సభ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిపై పోటీకి దిగి మొత్తం కడప జిల్లా రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసిన షర్మిల.. ఆ తరువాత అంటే పోలింగ్ ముగిసిన తరువాత తన విమర్శల దాడికి ఒకింత విరామం ఇచ్చారు.
అయితే ఆ విరామం తాత్కాలికమేనని షర్మిల తన తాజా మాటల దాడితో రుజువు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత పేదవాడైన జగన్ జగన్ అత్యంత ఖరీదైన విమానంలో విహార యాత్రకు వెళ్లారంటూ సెటైర్లు గుప్పించారు. ఏలూరు జిల్లాలో టెన్త్ విద్యార్థిని మీద జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ రాష్ట్రంలో ఇంత అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటుంటే జగన్ మాత్రం, ఓట్లేసిన మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు పట్టించుకోకుండా లండన్ విధులలో విహార యాత్రలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. పోలింగ్ పూర్తయ్యే వరకూ తల్లుల్లు, నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలు అంటూ చెప్పిన జగన్ మాటలన్నీ ఫేక్ అని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ పాలనలో మహిళల భద్రత కరవైందని దేశం మొత్తం చెబుతుంటే వైసీపీ నేతలు, మంత్రులకు కనీసం సిగ్గని కూడా అనిపించడం లేదని దుయ్యబట్టారు.
అసలే ఎన్నికలలో ఫలితం తమకు అనుకూలంగా లేదన్న ఆందోళనలో ఉన్న వైసీపీకి.. ఇప్పుడు షర్మిల మళ్లీ విమర్శల దాడి మొదలు పెట్టడంతో సమాధానం ఎలా చెప్పుకోవాలో, షర్మిల విమర్శలకు ప్రతి విమర్శలు ఎలా చేయాలో కూడా అర్ధం కావడం లేదు. ఇప్పుడు సరే నిజంగానే రేపు వైసీపీ అధికారానికి దూరమైతే షర్మిల మాటల దాడిని తట్టుకోవడం ఎలారా భగవంతుడా అని తలలు పట్టుకుంటున్నారు.