హోంమంత్రి కి అరెస్ట్ భయం!

        జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు మోపుతూ సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపధ్యంలో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. తన రాజీనామా విషయాన్ని సీఎం కు తెలిజేయగా, తొందరపడి రాజీనామా చేయవద్దని, మంత్రి ధర్మానపై కూడా సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఆయన కేసు కోర్టులో నడుస్తోంది గనుక, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొందామని చెప్పినట్లు వార్త వచ్చింది. ఇప్పటికే ధర్మానపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం, కోర్టులో కేసు నడుస్తుండటం తమ ప్రభుత్వానికి ప్రతికూలాంశమని ముఖ్యమంత్రి భావించకపోగా, దానినే ఆధారం చేసుకొని ఇప్పుడు సబితాఇంద్రారెడ్డిని కూడా వెనకేసుకురావడానికి ఉపయోగించుకోవడం మన రాజకీయ వ్యవస్థలో వచ్చిన పరిణతికి అద్దం పడుతోంది. ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో నేరాలు అరికట్టవలసిన హోం మంత్రిపైనే నేరారోపణ జరిగినప్పుడు, పదవిలో కొనసాగేందుకు మార్గాలు వెతుకుతూ, ప్రజలకు ప్రతిపక్షాలకు సంజాయిషీలు ఇచ్చుకొంటూ అవమానకర పరిస్థితులు ఎదుర్కొనేబదులు ఆమె స్వయంగా రాజీనామా చేసి ఉండి ఉంటె బాగుండేది. కానీ, ఆవిధంగా చేస్తే హోంమంత్రిగా ఆమెకిప్పుడున్న రక్షణ కవచం తొలగిపోతుంది గనుక, మరుక్షణం సీబీఐ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది గనుక ఆమె రాజీనామా చేయకపోవచ్చును.   ఆమె రాజీనామా చేయకుండా మరికొంత కాలం తనని తానూ కాపాడుకోవచ్చునేమో గానీ, ఒకసారి సీబీఐ చార్జ్ షీటులో పేరు కూడా ఎక్కిన తరువాత ఎంతో కాలం కాపాడుకోలేక పోవచ్చును. కనీసం కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇక ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీకి కక్కలేని మింగలేని పరిస్థితి సృష్టించిందని చెప్పవచ్చును.

ఎన్టీఆర్ దెబ్బా..తమ్ముళ్ళకు అబ్బా!

        గత కొన్ని రోజులగా రగులుతున్న ఫ్లెక్సీల వివాదం పై జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో స్పదించాడు. తాజాగా జరుగుతున్న సంఘటనలతో తన బాద్ షా సినిమా విజయాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నానని ఆయన అన్నారు. తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లోనే తన ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని తానూ ఇదివరకే చెప్పానని ఆ మాటకు తానూ జీవితాంతం కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. తన తాత రక్తమే తన ఒంట్లోను ప్రవహిస్తోందని అందువల్ల తెదేపాను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు సంబంధం లేని వివాదాలలో లాగి, తన ఆనందం పాడుచేయవద్దని కోరారు. ఇదే మరి పొలిటికల్ మెచ్యూరీటి అంటే..ఏమంటారు తెలుగు తమ్ముళ్ళు?

సి.ఎం. ఎదుట కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి

  సిబీఐ తాజాగా నమోదు చేసిన ఐదవ ఛార్జి షీటులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు జతచేసిన విషయం విధితమే. 120బి,  420 సెక్షన్ల క్రింద, అలాగే అవినీతి నిరోధక చట్టం  9,12,13, 13 (1) సెక్షన్ల క్రింద సబితా ఇంద్రారెడ్డి పేరును ఛార్జి షీటులో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి రాజీనామాకు సిద్ధపడారని వినిడికి. సహచర మంత్రులు ఆమెకు సర్ది చెప్పారని తెలిసింది. సబితా ఇంద్రా రెడ్డి సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తాను గనులశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేషీలో అధికారుల నిర్ణయాల ప్రకారమే తాను ఫైళ్ళపై సంతకాలు చేసినట్టు, తనకు ఏ పాపం తెలియదని కిరణ్ కుమార్ ఎదుట కన్నీళ్ళ పర్యంతం అయ్యారని తెలిసింది. సి.ఎం. కిరణ్ కుమార్ స్పందిస్తూ సబితా ఇంద్రారెడ్డిని ఓదార్చినట్లు తెలిసింది.

బంద్ నిర్వహిస్తున్న వామపక్ష నేతల అరెస్ట్

  తెల్లవారు ఝామున నాలుగు గంటలనుండే నగరంలోని ఎం.జి.బి.ఎస్. అవుట్ గోయింగ్ గేటు వద్ద సిపీఐ, సిపియం, కార్యకర్తలు, బి.వి.రాఘవులు, నారాయణ ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల ఎదుట వామపక్షాలు, విపక్షాల కార్యకర్తలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. కడపజిల్లాలోని అన్ని బస్ డిపోల నుండి బస్సులు బయటకు రాలేదు. జిల్లాలోని వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఎం.జి.బి.ఎస్. ఎదుట నిరసన తెలుపుతున్న బి.వి.రాఘవులు, నారాయణ, వామపక్ష కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బి.వి. రాఘవులు మాట్లాడుతూ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు తమ మద్ధతు తెలిపి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నిరసనలు తెలుపుతున్నారని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. నారాయణ మాట్లాడుతూ సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లోని కళంకిత నేతలను ముందుగా అరెస్ట్ చేయాలని, తరువాతే తమను అరెస్ట్ చేయాలని, హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి పేరును సిబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చిందని, ముందుగా పోలీసులు సబితా ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని, అసలు తమను అరెస్ట్ చేసే హక్కు సబితా ఇంద్రారెడ్డికి లేదని వ్యాఖ్యానించారు.

జగన్ ఎత్తుకు నందమూరి వంశం చిత్తు

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో తను పావుగా మారడం జూ.యన్టీఆర్ కు చాలా బాధ కలిగించింది. జరుగుతున్న సంఘటనలతో తన బాద్ షా సినిమా విజయాన్ని కూడా ఆస్వాదించలేని పరిస్థితిలో ఉన్నానని ఆయన అన్నారు. అనవసరమయిన వివాదాలలోకి తనను లాగి ఈ చిన్నపాటి ఆనందం కూడా తనకు దూరం చేయవద్దని ఆయన రాజకీయ నాయకులను కోరారు. ఆయన ఆ విధంగా కోరడం సబబుగానే ఉన్నపటికీ, ఇదే మాట బందరులో మొదటి ఫ్లెక్సీ వెలిసినప్పుడే అని ఉంటే పరిస్థితి ఇంత వరకువచ్చేది కాదు. కానీ, ఆతని మౌనమే ఇంత పెద్ద రగడకు దారి తీసిందని చెప్పకతప్పదు. పార్టీతో బేధాభిప్రాయాలు ఉన్నపటికీ, వాటిని పక్కన బెట్టి, తమ మధ్య చిచ్చుపెడుతున్న వైకాపాకు సరయిన జవాబు చెప్పి ఉండి ఉంటే సమస్య ఇంత తీవ్రతరం అయ్యేదికాదు. ఇక, నందమూరి కుటుంబ సభ్యులు అందరి మద్య నివురుగప్పిన నిప్పులా ఉన్నభేదాభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా బయటపడ్డాయి. తమ వంశ ప్రతిష్ట దెబ్బతింటోందని అందరికీ తెలిసినప్పటికీ, మాట్లాడటం అనివార్యం అవడంతో అందరూ మాట్లాడి నలుగురిలో మరింత చులకన అయ్యేరు. తమ శత్రుపార్టీ విసిరిన ఒక చిన్న పాచికకే అందరూ బెంబేలు పడిపోవడానికి వారి అనైక్యతే కారణమని చెప్పక తప్పదు. నిత్యం నీతి సూత్రాలు వల్లించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తను అద్దాల మేడలో కూర్చొని ఎదుట పార్టీల మీదకు రాళ్ళు విసురుతున్నట్లు గ్రహిస్తే ఆ పార్టీకే మేలు.

నన్ను వివాదాల్లోకి లాగోద్దు: జూ.ఎన్టీఆర్

  ఎట్టకేలకు జూ.యన్టీఆర్ కూడా ఈ రోజు కలకలం సృష్టిస్తున్న ఫ్లెక్సీ బ్యానర్ల విషయంలో స్పందిచారు. తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లోనే తన ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని తానూ ఇదివరకే చెప్పానని ఆ మాటకు తానూ జీవితాంతం కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. తన తాత రక్తమే తన ఒంట్లోను ప్రవహిస్తోందని అందువల్ల తెదేపాను వీడే ప్రసక్తే లేదని అన్నారు. తనకు సంబంధం లేని వివాదాలలో లాగి, తన ఆనందం పాడుచేయవద్దని కోరారు. హరికృష్ణ కూడా ఈ రోజే ఈ విషయంపై చాలా ఘాటుగా స్పందించారు. ఎవరో చేస్తున్న పనులకు తన కొడుకును ఏవిధంగా సంజాయిషీ కోరుతారని ప్రశ్నించారు. అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏ ఒక్కరి సొత్తు కాదని ఆయన ప్రజల మనిషని స్పష్టం చేసారు.

హోంమంత్రి సబితాకు షాకిచ్చిన సీబీఐ

        జగన్ అక్రమ ఆస్తుల కేసులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి సిబిఐ షాక్ ఇచ్చింది. తాజాగా సి.బి.ఐ. నమోదు చేసిన ఐదవ ఛార్జి షీటులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఆమె నాల్గవ నిందితురాలుగా ఉన్నారు. 120 బి, 420 సెక్షన్ల క్రింద, అలాగే అవినీతి నిరోధక చట్టం 9.12,13, 13(1) సెక్షన్ల క్రింద శ్రీమతి సబిత పేరును ఛార్జి షీటులో నమోదు చేశారు. సి.బి.ఐ, మొత్తం 13 మందిపై ఇందులో అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ కార్యదర్శి అయిన శ్రీలక్ష్మిని ఐదవ నిందితురాలు గా చేర్చారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి మొదటి సారి గెలుపొందినప్పుడు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆమె 407 ఎకరాలను కడపలో దాల్మియా సిమెంట్సుకు కేటాయించారని సి.బి.ఐ. అభియోగం మోపింది. అందుకు ప్రతిగానే దాల్మియా సుమారు 95 కోట్లు జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టు సి.బి.ఐ. తమ అభియోగ పత్రంలో పేర్కొన్నది. సండూర్ వవర్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, భారతి సిమెంట్స్, పెన్నా, దాల్మియా, ఇండియా సిమెంట్స్‌పై విడివిడిగా చార్జ్‌షీట్లు నమోదు చేస్తున్నట్టు సి.బి.ఐ. తెలియజేసింది ఆ సమయంలో అయినవారికి భూములు పంచిపెట్టడానికి మొత్తం 26 జి.ఓ.లు విడుదల అయిన విషయాన్ని కూడా సి.బి.ఐ. కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.

చిరు మెగాస్టార్ కాదు.. దగాస్టార్

        టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర పై చిరంజీవి చేసిన విమర్శలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. చిరంజీవి సినిమాలో మెగాస్టార్ అని, కాని రాజకీయాల్లో దగాస్టార్ అని టీడీపీ నేతలు బొజ్జల, సీఎం రమేష్, కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై రాజ్యసభలో ఒక్క రోజు కూడా స్పందించని వ్యక్తి చిరంజీవి అని అన్నారు. ప్రజల కోసం చంద్రబాబు ఎంత దూరమైనా నడుస్తున్నారని, చిరంజీవిలా పార్టీని వీలినం చేయలేదన్నారు. టీడీపీ బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ భయపడే చిరంజీవిని ఉసిగొల్పుతోందని ఆరోపించారు.ఎన్నికల ముందు పంచలు ఊడదీసి కొడతామని, ఇప్పుడు పంచెల చాటున దాక్కున్నారని ఘాటుగా విమర్శించారు. పీఆర్పీది ఫెయిల్యుర్ పార్టీ అని, మార్పు, మార్పు అంటూ పార్టీనే మార్చేసారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. చిరంజీవి సలహాలు టిడిపి అవసరం లేదని అన్నారు.

జూ.ఎన్టీఆర్ తప్పు చేయడు: హరికృష్ణ

        ఫ్లెక్సీల వివాదం లో జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన తండ్రి, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్ ఎప్పుడు తప్పు చేయడని, ఎవరో చేసినదానికి జూ.ఎన్టీఆర్ బాధ్యుడు కాదని హరికృష్ణ స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్లెక్సీల్లో ఫోటోతో సంబంధంలేదన్నారు, టీడీపీలోనే ఉంటానని జూ.ఎన్టీఆర్ ఏనాడో స్పష్టం చేశాడని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకోవడం రాజకీయ వ్యభిచారం అనడం తప్పని, ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడం వారి వ్యక్తిగతం అని హరికృష్ణ వెల్లడించారు. పార్టీ వ్యవహారాలపై మీరు అడగాల్సింది తాను చెప్పాల్సింది చాలా ఉందని, త్వరలో మీడియాతో అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

జగన్ ఫ్లెక్సీల చిచ్చు ఎందుకు పెట్టినట్లు

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బ్యానర్ల డ్రామా మొదలుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్య పోయినప్పటికీ మొదట అదేదో పొరపాటున జరిగి ఉండవచ్చని అందరు అనుకొన్నారు. కానీ, అదేమి పొరపాటునో లేక కాకతాళీయంగా మొదలుపెట్టలేదని, ఆ పార్టీ పక్కా ప్రణాలికతోనే రంగంలోకి దిగిందని అందరికి అర్ధం అయింది. అయితే, అది అందరూ ఊహిస్తున్నట్లుగా తన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టడానికి మాత్రమే కాకుండా, దానిలో వేరే ఆలోచనలు ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి.   తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ నానాటికి బిగుసుకొంటున్నసీబీఐ మరియు ఈ.డీ. కోర్టుల ఉచ్చువలన అతను ఇంత త్వరగా జైలు నుండి బయటపడే అవకాశం లేదని గ్రహించిన ఆ పార్టీ, ఇటువంటి వ్యూహంతో ప్రజలని, ముఖ్యంగా తన పార్టీ తన కార్యకర్తలని ఏమార్చే ప్రయత్నం చేస్తోంది. తమ అధినేత ఇప్పట్లో జైలు నుంచి బయటకి రాడని తెలిస్తే కార్యకర్తలలో పార్టీ పట్ల విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఇప్పటికీ నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న ఆ పార్టీలో జగన్ ఇప్పట్లో విడుదల కాడని తెలిస్తే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.   ఇక సీబీఐ కూడా తన జోరు పెంచి వరుసగా చార్జి షీట్లు దాఖలు చేస్తుండటం, కేవీపీ, పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డి, రఘురామ రాజు వంటి వారిని విచారణ చేస్తుండటం ద్వారా ఆ మరింత మంది నాయకుల మెడలకి సీబీఐ కేసులు చుట్టుకోనున్నాయనే మీడియా ప్రచారంతో మొదలయిన కలకలం కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితులను సృష్టించింది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షీ మీడియా ఒక్కటీ ఒకవైపు, మిగిలిన మీడియా అంతా మరో వైపు నిలవడంతో మీడియాలో ఆ పార్టీకి అనుకూల ప్రచారం కంటే వ్యతిరేఖ ప్రచారమే ఎక్కువగా ఉంటోంది. యావత్ మీడియాలో జగన్ అరెస్టు వ్యవహారం, అక్రమస్తుల కేసులు, అతని కంపెనీల ఆస్తుల జప్తులు వగైరా వార్తలే ఎక్కువగా వస్తుండటంతో క్రమంగా ఆ ప్రభావం పార్టీ కార్యకర్తల మీద పడి వారి మనోధైర్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల, అటువంటి విషయాలనుండి వారి దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహం రచించి, దిగ్విజయంగా అమలు చేస్తోంది.   ఈ పధకంతో స్వామీ కార్యం, స్వకార్యం రెండూ కూడా పూర్తవుతాయనేది ఆ పార్టీ ఆలోచన. నిజాయితీగా చెప్పుకోవాలంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం అమలు చేయడంలో విజయవంతం అయిందనే చెప్పవచ్చును. కానీ,ఆ పార్టీ ఈ డ్రామాను కలకాలం కొనసాగించడం కష్టం కనుక అప్పుడు మళ్ళీ ఇటువంటిదే మరో కొత్త ఉపాయం కోసం ఆలోచించక తప్పాడు.

ఈ సంవత్సరం తెలంగాణ వస్తుందట

      కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, 2013లోగానే తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ప్రకటిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేందుకు 99 శాతం కసరత్తు పూర్తయిందని, సీమాంధ్రలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవటంతోనే తెలంగాణ ప్రకటన ఆగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉందని, కేసీఆర్‌లాగా ఏనాడూ ఉగాది, దీపావళి, అమావాస్య, పున్నమిలంటూ కాంగ్రెస్ డెడ్‌లైన్‌లు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనకు కట్టుడి ఉంటుందని, ఎప్పుడూ తాము ఇచ్చిన మాటను తప్పలేదన్నారు.సీమాంద్రుల్లో అన్ని రాజకీయ పా ర్టీలు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్కటైనప్పటికీ తెలంగాణలోని పార్టీలు కాం గ్రెస్‌తో కలిసి రావటం లేదన్నారు.

జగన్ బయటకు వస్తే ఏం జరుగుతుంది?

        దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అధికార, ధన దాహంతో అనేక ఆర్థిక నేరాలకు పాల్పడడం వల్లే ఆయనకు ఈ దుస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఆయన జైలు నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తారని నిలదీశారు. అనివార్య కారణాలవల్ల విద్యుత్ చార్జీలు పెంచినప్పటికీ పేదలపై ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతో తాను చేసిన విన్నపం మేరకు 200 యూనిట్ల దాకా చార్జీలు పెంచవద్దని నిర్ణయం తీసుకున్న సీఎం కిరణ్‌కు చిరు కృతజ్ఞతలు తెలిపారు.

'బాద్‌షా' ఎప్పుడు డిసైడ్ చేస్తాడు?

  తెలుగుదేశం పార్టీలో మరియు నందమూరి కుటుంబ సభ్యుల మద్య చిచ్చుపెడదామనే పక్కా ప్రణాళికతో వైయస్సార్ కాంగ్రెస్ అమలు చేస్తున్న ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహం బాలకృష్ణ జూ.యన్టీఆర్ కు హెచ్చరిక జారీ చేయడంతో అనుకొన్న ఫలితం సాదించినట్లే చెప్పవచ్చును. బాలకృష్ణ హెచ్చరించినప్పటికీ, జూ.యన్టీఆర్ కానీ, అతని తండ్రి హరికృష్ణ గానీ ఇంతవరకు పెదవి విప్పక పోవడంతో, తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది.   పార్టీలో హరికృష్ణకు తగిన ప్రాదాన్యం ఈయకపోగా, ఆయన కుమారుడు జూ.యన్టీఆర్ ను కూడా పక్కన పెడుతూ, చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ ను క్రమంగా పార్టీలోముందుకు తీసుకురావడంపై ఆగ్రహించడం వలననే బహుశః వారిద్దరూ వైకాపా తమ పార్టీ మీద ప్రకటించిన ఈ యుద్ధానికి మౌనంగా ఉండి పరోక్ష సహాయం చేస్తున్నారని భావించవచ్చును. తద్వారా పార్టీలో తమకున్న ప్రాదాన్యతను చంద్రబాబుకు తెలిసి వచ్చేలా చేయడం వారి ప్రధాన ఉద్దేశ్యం తప్ప, అందరూ ఊహిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచన మాత్రం చేయరని చెప్పవచ్చును. వైయస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ఈ యుద్ధంలో తెదేపాపై మరింత ఒత్తిడి పెరిగినప్పుడు పార్టీ అధిష్టానమే తమ సహాయం అర్దించివస్తే అప్పుడు తమది పై చేయి అవుతుందని వారిరువురి ఆలోచన కావచ్చును. బహుశః అందువల్లే వారిరువురూ కూడా ఇంతవరకు బాలకృష్ణ హెచ్చరికలను పట్టించుకోలేదని అనుకోవచ్చును.   అయితే, హరికృష్ణ వంటి కోపిష్టిని వదులుకోవడానికి చంద్రబాబు పెద్దగా సంకోచించకపోయినా, అతనితో పాటు పార్టీకి స్టార్ ఎట్రాక్షన్ అని చెప్పదగ్గ జూ.యన్టీఆర్ కూడా దూరమవుతాడని కొంచెం సంయమనం పాటిస్తున్నట్లు ఉంది. అంతే గాక వారిరువురినీ పార్టీ నుండి బయటకి పంపినట్లయితే నందమూరి వారు స్థాపించిన తెదేపాలో నందమూరి వారికి స్థానం లేదనే సరికొత్త ప్రచారం మొదలవడమే కాకుండా, అలనాడు యన్టీఆర్ ని పార్టీ నుండి బయటకి గెంటినట్లే, ఇప్పుడు ఆయన కుమారుడిని, మనుమడినీ కూడా బయటకి గెంటారనే అపఖ్యాతి కూడా చంద్రబాబు మెడకి చుట్టుకోవడం ఖాయం గనుక, ఈ వ్యవహారంలో ఆయన ఇంతవరకు కలిగించుకోకుండా బాలకృష్ణకే అప్పగించారు.   కానీ, పార్టీలో కోడెల శివప్రసాద్ వంటి ఇతర నేతలు ఆయన అనుమతి లేకుండా జూ.యన్టీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారని భావించలేము. అంటే, చంద్రబాబు వారిని స్వయంగా విమర్శించకపోయినప్పటికీ వారిరువురికీ చాల స్పష్టమయిన సందేశమే ఇస్తున్నట్లు భావించవచ్చును. వారిని తానూ స్వయంగా పూనుకొని పార్టీలోంచి బయటకి పంపడం కంటే, వారంతట వారే పార్టీని వీడిపోయేలా చేయడం చంద్రబాబు అభిమతం కావచ్చును. మొన్న బాలకృష్ణ జూ.యన్టీఆర్ ను తీవ్ర స్వరంతో హెచ్చరించడమే అందుకు మొట్ట మొదటి సంకేతంగా భావించవచ్చును.   కానీ, ఈ సమస్య టీ కప్పులో తుఫానులా త్వరలోనే చల్లారిపోయే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. ఎందుకంటే, జూ.యన్టీఆర్ వంటి అతిముఖ్యమయిన వ్యక్తిని చంద్రబాబు చేజేతులా ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తారని కానీ, తన స్వంత ఇల్లువంటి తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని వీడి జూ.యన్టీఆర్ అవినీతి కేసుల్లో ఇరుకొన్న జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని గానీ భావించలేము.   ఈ వ్యవహారాన్ని చూసి మురిసిపోతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఫ్లెక్సీ బ్యానర్ యుద్దానికి మరింత ముందుకు తీసుకు వెళుతూ ఆ పార్టీ బాకా మీడియా సాక్షిలో తమను విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ మీద ప్రతివిమర్శలు గుప్పించడమే కాకుండా తాము చేస్తున్న పనిలో తప్పేమీ లేదని వితండవాదన కూడా మొదలుపెట్టింది. అయితే, బాద్ షా ఏమి డిసైడ్ చేస్తాడనేదానిమీదనే క్లైమాక్స్ సీన్ ఆధారపడి ఉంటుంది. ఒకసారి బాద్ షా డిసైడ్ అయితే ఇక వార్ వన్ సైడవుతుందని ని వేరే చెప్పనవసరం లేదు.

జూ.ఎన్టీఆర్ నోరు తెరవాలి: కోడెల

        టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ పై భారీ అస్త్రాలనే సంధించారు. ఫ్లెక్సీల విషయంలో ఆయన మాట్లాడుతూ…కొడాలి నానికి ఎవరైతే ఒత్తిడి తెచ్చి టీడీపీలో సీటు ఇప్పించారో ఆ వ్యక్తి నోరు తెరవాలని అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో కోడెల ఫ్లెక్సీల గురించి స్పందించారు. జూనియర్ తెలియకుండానే కొడాలి నాని పార్టీ వదిలవెళ్లారా అన్నట్టుగా మాట్లాడారు…''ఆయనకు తెలియకుండానే పార్టీ నుంచి నాని బయటకు వెళ్లారా…” అని కోడెల వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. “ఆయనకు తెలియకుండానే ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో వాడుకుంటున్నారా…” అని కోడెల అన్నారు.

ఎన్టీఆర్ అందరివాడు: పురందేశ్వరి

  ఇప్పటి రాజకీయ నేతల్లో చాలా హుందాగా ప్రవర్తించే అతికొద్ది మందిలో కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా ఒకరు. నేటి రాజకీయనేతలకి భిన్నంగా ఆమె మాట్లాడటం కంటే ఎదుట వారు చెప్పే విషయం గురించి శ్రద్దగా వినడానికే ప్రాదాన్యం ఇస్తారు. అదే విధంగా ఆమె ఎవరినీ వ్యక్తిగత విమర్శలు చేయడం లేదా అనవసరమయిన మాటలు మాట్లాడటం కానీ చేయరు. గత కొద్ది రోజులుగా వైకాపా నేతలు ఆమె తండ్రి గారయిన స్వర్గీయ యన్టీఆర్ బొమ్మను తమ ఫ్లెక్సీ బ్యానర్లపై వేసుకొని చేస్తున్న రాజకీయంపై స్పందించమని మీడియా కోరగా ఆమె సున్నితంగా తిరస్కరించినప్పటికీ, యన్టీఆర్ ప్రజలందరి సొత్తు అని ఆమె చూచాయగా తన అభిప్రాయాన్ని తెలియజేసారు. తెదేపా, వైకాపాల పాదయాత్రలపై స్పందిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, అధికారం కోసమే పాదయాత్రలు చేస్తున్నాయని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ ఫోటోతో వైకాపాకి సంబంధం లేదు

        వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ టిడిపిల మధ్య ఫ్లెక్సీ ల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ కూడా స్పందించారు. ఆ పార్టీ నేతల ఫోటోలు బ్యానర్లలో పెట్టుకొంటే ఓట్లు రాలవనే ఆలోచనతోనే వారు ఎన్టీఆర్ ఫోటోలు వాడుకొంటున్నట్లున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జూ.ఎన్టీఆర్ వెంటనే ఖండించాలని అన్నారు.   ఈ వివాదం పై జూ.ఎన్టీఆర్ స్పందించలేదు, కాని జగన్ పార్టీ మాత్రం స్పందించింది. ఈ వివాదం పై వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత కొణతల రామకృష్ణ మాట్లాడుతూ..స్వర్గీయ ఎన్టీఆర్ గారికి చాలా మంది అభిమానులున్నారని, అలాంటి వారిలో కొంతమంది తమ పార్టీలోవున్నారని, వారెవరైనా ఫోటో పెట్టుకుంటే అది తమ సంబందించిన విషయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొడాలి నాని ఎన్టీఆర్ అభిమాని అని, ఆయనపై అభిమానంతో ఎవరైనా ఫ్లెక్సీ లలో ఎన్టీఆర్ ఫోటో పెట్టి వుంటారన్నారు. ఎన్టీఆర్ ఫోటోతో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి సంబంధం లేదని రామకృష్ణ స్పష్టం చేశారు.   

హమ్మయ్యా..దీక్ష భగ్నం చేశారు!

        విద్యుత్ ఛార్జీల పెంపుపై వైకాపా నేతలు చేస్తున్న నిరవదిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శిభిరంలో నిరాహార దీక్ష చేస్తున్న చాలా మందికి బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతుండటంతో ఆరోగ్యాలు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టాయి. దీంతో నిన్న అర్ధరాత్రి వైఎస్ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు.   అయితే అందరూ చేసినట్లే తాము ఓ మూడు, నాలుగు రోజులు దీక్షలు చేసి పోలీసుల చేత భగ్నం చేయించుకొని వీరులు అనిపించుకొని బయట పడదామని అనుకొంటే కిరణ్ కుమార్ ప్రభుత్వం చల్లగా కూర్చొని చూస్తుండటంతో వైకాపా నేతలు ఖంగుతిన్నారు. ఆఖరికి  ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు వారి దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అరెస్టు చేయనంతవరకు తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించిన వైకాపా నేతలు, అరెస్టు తర్వాత తమపై ఉక్కుపాదం మోపుతారా అంటూ విమర్శిస్తున్నారు.

వైయస్ జగన్, కొడాలి నానిని ఏ మగాడు అడ్డుకోలేడా?

        నేను శాసన సభ్యుడిని కాకుండా, జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఏ మగాడు అడ్డుకోలేడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. చంద్రబాబు తప్ప ఎవరైనా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవచ్చని, టిడిపి నుంచి ఎన్టీఆర్ గెంటేసిన చంద్రబాబుకు ఆయన ఫోటో పెట్టుకునే హక్కులేదని నాని ధ్వజమెత్తాడు. షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.   కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపాయని, జగన్ పార్టీలో చేరినందుకు నన్ను నానా మాటలు అన్నారు. నేను డబ్బులు తీసుకుని జగన్ పార్టీలో చేరానని ప్రచారం చేశారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కుటుంబానికి అండగా ఉంటామని కృష్ణా జిల్లా మొత్తం చెబుతుందని, ఎన్టీఆర్ ఫోటో వాడుకున్నానని అవాకులు, చవాకులు పేలుతున్నారని, అసలు చంద్రబాబుకే ఆయన ఫోటో వాడే హక్కులేదని అన్నారు.