ప్రజలపై కిరణ్ సర్కార్ పెనుభారం
posted on Apr 2, 2013 @ 3:12PM
ప్రజలపై కిరణ్ సర్కార్ పెనుభారం మోపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని అన్నారు.
కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఛార్జీల రూపంలో రూ.2 వేల కోట్ల భారం మోపారని ఆమె ధ్వజమెత్తారు. కరెంట్ ఉండదు, బిల్లులు మాత్రం వస్తుంటాయని విజయమ్మ వ్యాఖ్యానించారు.
రైతుల కష్టాలు చూసి చలించిపోయి అప్పట్లో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇచ్చారని విజయమ్మ గుర్తుచేశారు. వైఎస్‌ఆర్ హయాంలో ఉచిత విద్యుత్ చక్కగా అమలైతే, వైఎస్ అనంతరం ఆ పథకానికి కిరణ్ సర్కార్ తూట్లు పొడిచిందని అన్నారు. కరెంట్ బిల్లులను రెట్టింపు పెంచేస్తే సామాన్యులు ఎలా చెల్లించగలరని విజయమ్మ ప్రశ్నించారు.