నాలుగు రోజుల నిరవదిక నిరాహార దీక్షలు
posted on Apr 1, 2013 @ 9:27PM
దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రధానమయిన అన్ని రాజకీయపార్టీలు పెరిగిన కరెంటు చార్జీలకు నిరసనగా నిరవధిక నిరాహార దీక్షలు పుచ్చుకోవడం, ఓ నాలుగు రోజులు తరువాత వాటిని పోలీసులు భగ్నం చేసి వారిని ఆసుపత్రిలొ చేర్చడం, దానిని సదరు పార్టీల నేతలు మీడియా ముందు ఖండించడం, ఆసుపత్రిలో కూడా కొనసాగిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేయడం, ఈ వార్తలన్నిటినీ ఫోటోలతో సహా మీడియాలో ప్రచురించడం, ఆ మర్నాడు ఎవరి బలవంతం మీదనో తప్పని సరి పరిస్థితులో ఇంత నిమ్మ రసం పుచ్చుకొని అయిష్టంగానే దీక్షలు విరమించడం అంతా ఒక పద్దతి ప్రకారం జరిగిపోవడం చూసి ప్రజలు కూడా చాలా ముచ్చట పడుతున్నారు. నిరవదిక నిరాహార దీక్షలకి’ కూడా ఇంత చక్కటి పద్దతిని ఏర్పరుచుకోగలిగినందుకు అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు రెండూ కూడా చాలా సంతోషిస్తున్నాయి. దీని వల్ల ఇద్దరికీ పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు గనుక ఎటువంటి ఉద్రిక్తతలు కూడా లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ‘నాలుగు రోజుల నిరవదిక నిరాహార దీక్షలు’ మూడు దీక్షలు ఆరు మీడియా ఫోటోలతో దిగ్విజయంగా ముగుస్తున్నాయి. శాసనసభ సమావేశాలకి కూడా ఇటువంటిదే ఏదయినా ఒక పద్దతి కనిబెడితే బాగుంటుందని ప్రజల విన్నపం.
పాపం మనం కనిపెట్టుకొన్న ఈ పద్దతుల గురించి తెలియని అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక పెద్ద మనిషి గత 9రోజుల నుండి కడుపు మాడ్చుకొని డిల్లీలో ‘నిజంగానే నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ అక్కడి పోలీసులు కూడా మన పద్దతులు తెలియనందున ఆయన దీక్షను ఇంతవరకు భగ్నం చేయనూ లేదు. ఆ తరువాత జరుగవలసిన తంతు కూడా జరుగలేదు. మన నేతలేవరయినా వెంటనే డిల్లీ వెళ్ళేపని ఉంటే కొంచెం అక్కడి పోలీసులకు మన ‘నాలుగురోజుల నిరవదిక నిరాహార దీక్షా పద్దతులు’ గురించి చెవిలో వెయగలిగితే ఆ అమాయకుడి ప్రాణాలు నిలబెట్టిన పుణ్యం దక్కుతుంది.
ఇప్పుడే అందిన సమాచారం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపటి నుండి వైయస్సార్ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ‘నిరవధిక నిరాహారదీక్ష’ ప్రారంభిస్తారు.