త్రీడీ ప్రింటింగ్ తో కొత్త జీవితం
posted on Apr 2, 2013 @ 10:57AM
బ్రిటన్ వైద్యులు ప్రపంచలో తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం తో కృత్రిమ ముఖాన్ని తాయారు చేశారు. దీని సాయంతో కేన్సర్ బాధితుడికి కొత్త జీవితాన్ని ఇచ్చారు. బ్రిటన్‌లోని ఎసెక్స్‌కు చెందిన ఎరిక్ మోగర్ (60) ఒక రెస్టారెంట్ మేనేజర్. నాలుగేళ్ల క్రితం అతని ముఖం ఎడమ భాగంలో ఒక కణితి ఏర్పడి పెరగడం ప్రారంభమైంది. అది కేన్సర్ కణితి అని, దాన్ని తీయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి కణితిని తీసేశారు.ఈ ప్రయత్నంలో అతడి ఎడమకన్ను, దవడ ఎముక భాగం మొత్తాన్ని తీసేయాల్సి వచ్చింది.
ఈ శస్త్రచికిత్స వల్ల ఎరిక్ కేన్సర్ బారి నుంచి బయటపడిన...ఆ తరువాత అతనికి అనేక సమస్యలు మొదలైయాయి. అతడి ముఖం అతడికే భయంగొల్పే విధంగా మారిపోయింది. ఆహారం, నీరు తీసుకోవడటం కూడా సాధ్యం కాలేదు. పొట్టలోకి అమర్చిన ట్యూబ్ ద్వారా మాత్రమే ఆయన ఆహారం తీసుకొనేవారు. అయితే ఇటీవలికాలంలో కొత్తపుంతలు తొక్కుతున్న అవయవాల త్రీడీ ముద్రణ పరిజ్ఞానం అతడికి వరంలా అందివచ్చింది. ఎరిక్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బ్రిటన్ వైద్యులు.. స్కానింగ్ ద్వారా అతడి పుర్రె కొలతలు తీసుకున్నారు. ఈ వయసులో సహజంగా ఎరిక్ ముఖం ఎలా ఉంటుందో కంప్యూటర్ మోడలింగ్ ద్వారా సృష్టించారు.
ఆయన ముఖంలో ఖాళీగా ఉన్న ఎడమవైపు భాగాన్ని ఒక్కొక్కపోర చొప్పున పేర్చుకుంటూ కృత్రిమ ముఖాన్ని రూపొందించారు. అది ఎరిక్ కు అతికినట్లు సరిపోయింది. ఆ కృత్రిమ ముఖాన్ని తన చేతిలో ఉంచినప్పుడు.. తన ముఖాన్ని తానే చేతుల్లో చూసుకున్నట్టుగా అనిపించిందని ఎరిక్ పేర్కొన్నాడు. "దాన్ని మొదటిసారి నా ముఖం మీద పెట్టుకున్నప్పుడు.. నమ్మలేకపోయాను, అదెంత అందంగా ఉందో'' అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.