వైయస్ విజయమ్మ ఆమరణ దీక్ష
posted on Apr 2, 2013 @ 11:56AM
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంచడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం విశేషమే. బషీర్బాగ్లో విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఆమె అక్కడ నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కరెంట్ సత్యాగ్రహం దీక్ష వేదిక వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు. ఆమె వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు ఉన్నారు. సత్యాగ్రహం దీక్షావేదికపై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్పించిన అనంతరం విజయమ్మ ఆమరణ దీక్షకు కూర్చున్నారు.
అయితే అనూహ్యంగా విజయమ్మ ఆమరణ దీక్షకు పూనుకోవడం ఆసక్తి కరంగా ఉంది. ఇప్పటికే వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ విద్యుత్ చార్జీల మీద నిరవధిక దీక్షలు చేపట్టాయి. అయితే ప్రభుత్వం వారిని బలవంతంగా విరమింపచేసింది. ప్రస్తుతం బీజేపీ నిరవధిక దీక్షలో ఉంది. ఇప్పుడు విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టింది. మిగిలిన పార్టీలు ఆందోళన చేస్తుంటే తాము వెనకబడతామన్న ఆలోచనే ఆమరణ దీక్షకు కారణం అయి ఉండవచ్చు.