కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలి: ఎర్రబెల్లి

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలి. తెలంగాణ ప్రజలను రాజకీయ నేతలు మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నాయి” అని తెలంగాణ తెలుగుదేశం పోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, నేతల భూకబ్జాలు, సెటిల్ మెంట్లను వ్యతిరేకిస్తు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రోజు గన్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సెటిల్ మెంట్లు చేస్తున్నాడని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ ధర్నా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆంధ్రజ్యోతి టిడిపి మానసపుత్రిక

        ఆంధ్రజ్యోతి తెలుగుదేశం మానసపుత్రిక అని, చంద్రబాబు కు ఆంధ్రజ్యోతి ఎంపీ వేమూరి రాధాకృష్ణ బినామీ అని, ఆయన అధికారంలోకి రావాలని రాధాకృష్ణ టీఆర్ఎస్ మీద బురద జల్లుతున్నారని, కనీసం కేటీఆర్ వివరణ తీసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనం ప్రసారం చేయడం జర్నలిజం విలువలకు వ్యతిరేకం అని టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆంధ్రజ్యోతి కథనం మీద ప్రభుత్వం స్పందించాలని, రాధకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన మీద ప్రసారం చేసిన కథనాలకు ఆధారాలు చూపాలని, లేదా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులలో టీడీపీ ధర్నా చేయడం విశేషం.

కాగితకు తప్పిన ప్రమాదం

      ఇంటింటా టిడిపి కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లిలో పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాగిత వెంకట్రావు నీరసంతో కుప్పకూలిపోయారు. ఉదయం నుంచి హుషారుగా ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరించి సమస్యలు తెలుసుకున్న ఆయన ఎండా వేడిమికి నీరసపడ్డారు. చెక్కెర మోతాదు తగ్గిపోవడంతో పాటు రక్తపోటు అధికమవడంతో నడుస్తూనే బంటుమిల్లి జూనియర్ కళాశాల వద్ద రోడ్డుపై పడిపోయారు. పక్కనే ఉన్నవారు ఆయనకు నేలదెబ్బ తగలకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స చేశారు. ఆయన కోలుకున్న తరువాత మెరుగైన వైద్య చికిత్స కోసం మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రి కి తీసుకెళ్ళారు. ఆయన ఆరోగ్యం కుడుతపడే వరకూ ఆసుపత్రి లో ఉండాలని వైద్యులు సూచించారు. బంటుమిల్లిలో పాదయాత్ర చేస్తున్న కాగిత వెంకట్రావు దృష్టికి ప్రజలు అనేక సమస్యలు తీసుకొని వచ్చారు. తాగు నీటి సమస్య మీద ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు, డ్రైనేజీలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాది హామీ తదితదర అంశాలలో పిర్యాదులు అందాయి.

దేవినేని నెహ్రు ముందస్తు వ్యూహాలు

      2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటి చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రు). ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు డివిజన్ సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన ప్రజల వద్దకు నేరుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు, రాజకీయవారసుడైన దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా బాద్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని అవినాష్, ఈరోజు ఇంటింటికీ కాంగ్రెస్ పథకాల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 18 డివిజన్లలో అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ''కృష్ణలంకలోని గంగానమ్మగుడి వద్ద నుంచి ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుందని, శుక్రవారం నుంచి రోజు సాయంత్రం అయిదు నుంచి తొమ్మిది వరకూ ఆయా డివిజన్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని, మద్యలో తన తండ్రిని కలుస్తానని '' దేవినేని అవినాష్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ విషయంమై ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే గా వున్న యలమంచిలి రవి, మాజీ మంత్రి దేవినేని నెహ్రు మధ్య తీవ్ర పోటి నెలకొనివుంది. దీంతో టిక్కెట్ దక్కించుకోవడానికి దేవినేని నెహ్రు ముందస్తు వ్యూహాలు మొదలుపెట్టారు.

నిన్నహరీష్ రావు, నేడు కేటీఆర్!

  తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు పారిశ్రామిక వేత్తలనీ, వ్యాపారులని, సినిమా పరిశ్రమని బెదిరించి కోట్లు పోగేసుకొంటునట్లు ఇప్పటికే చాల కధనాలు విన్నాము. తెరాస నేత హరీష్ రావు పద్మాలయా స్టూడియో యాజమాన్యం నుండి రూ.80 లక్షలు వసూలు చేసాడని ఆ పార్టీనుండి బహిష్కరింపబడిన రఘునందన్ రావు ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు కే.తారక రామరావు పేరు ఇద్దరు ఆంధ్రా రియల్టర్ ల మధ్య సెటిల్మెంట్ వ్యవహారంలోబయటకి పొక్కింది.   ఈ కధ హైదరాబాదులో మొదలయ్యి ఒరిస్సా వరకు సాగి విశాఖలో ముగిసింది. ఆ కధ క్లుప్తంగా ఇలా సాగింది:   ఆంధ్రా ప్రాంతానికి చెందిన యన్.శ్రీనివాసరావు జూబిలీ హిల్స్ లో ఉన్న తన 1200గజాల స్థలాన్ని డెవెలప్ మెంటు కోసం సుబ్బారెడ్డి అనే మరో రియల్టర్ తో ఒప్పందం చేసుకొని రూ.5కోట్లు అడ్వాన్స్ పుచ్చుకొన్నాడు. అయితే, పీకలోతు అప్పులోకి కూరుకుపోయున్న శ్రీనివాస రావు ఆ స్థలాన్ని అంతకు ముందే మరొకరికి తాక్కట్టు పెట్టి దానిపై అప్పు తీసుకొన్నాడు. కానీ, ఈ విషయాన్నీ దాచిపెట్టి సుబ్బారెడ్డికి దానిని అంటగట్టడంతో సమస్య మొదలయింది.   శ్రీనివాసరావు రూ.5 కోట్లు వాపసు చేయలేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంతో, సుబ్బారెడ్డి తనకు బాగా పరిచయమున్న కేటీఆర్ ను ఆశ్రయించాడు. కేటీఆర్ తనకు నమ్మిన బంటయిన సతీష్ రెడ్డిని పంపి శ్రీనివాసరావుని తన దగ్గిరకు రప్పించుకొన్నాడు. (డబ్బు వసూలు చేసేందుకు వారు తనను చితక బాదినట్లు శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.)   అయితే, శ్రీనివాసరావు దగ్గర డబ్బులేదనే సంగతి కెటీఆర్ కి కూడా అర్ధమయిన తరువాత, అప్పుడు శ్రీనివాసరావే వారికి ఒక బ్రహ్మాండమయిన ఆఫర్ ఇచ్చాడు. తాను ఒరిస్సాలో సుభాష్ అగర్వాల్ అనే కాంట్రాక్టర్ వద్ద సబ్ కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ రోడ్డు నిర్మాణం చేసానని, అందుకు గాను అతను తనకి రూ.100 కోట్లు బాకీ ఉన్నాడని, అది గనుక తనకి తిరిగి ఇప్పించగలిగితే, సుబ్బారెడ్డి దగ్గిర తీసుకొన్న రూ.5కోట్లే కాకుండా, భారీ కమీషన్ కూడా ఇస్తానని హామీ ఈయడంతో కేటీఆర్ కి ఆశపుట్టింది.   ఈ భారీ వంద కోట్ల వ్యవహారం తేల్చేందుకు తన అనుచరుడు సతీష్ రెడ్డిని, అతని అనుచరులను ఒరిస్సాకి పంపాడు. ఒరిస్సా వెళ్ళిన సతీష్ రెడ్డి అతని అనుచరులు సుభాష్ అగర్వాల్ ని శ్రీనివాసరావుకి ఈయవలసిన డబ్బుకోసం బెదిరించారు. అయితే ఆయన లొంగకపోవడంతో, ఆయనని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేసారు. కానీ, ఇది తెలుసుకొన్న ఒరిస్సా పోలీసులు వారిని జీపులలో వెంబడించి పట్టుకొన్నపటికీ, సుభాష్ అగర్వాల్ ఉన్న వ్యాన్ని మాత్రం పట్టుకోలేకపోయారు. అయితే వారు ఇచ్చిన సమాచారం ప్రకారం విశాఖ పోలీసులు, నగర శివారు ప్రాంతమయిన పెందుర్తి వద్ద వారిని వెంబడించి పట్టుకోగలిగారు. ఈ కధంతా జరిగి రెండు నెలలు పైనే అయింది.   అప్పటి నుండి శ్రీనివాసరావు, సతీష్ రెడ్డి, అతని అనుచరులు, అందరూ కూడా ఒరిస్సా పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. అయితే, కధ ఈవిధంగా అడ్డం తిరగడంతో కేటీఆర్ చల్లగా పక్కకు తప్పుకోవడంతో సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ విషయం బయట పెట్టారు.   ఈ కధనంతా బయట పెట్టిన ఆంధ్రజ్యోతి మీద, దాని యజమాని రాధాకృష్ణ మీద ఇప్పుడు తెరాసా నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ పై జరుగుతున్న దాడి తెలంగాణా ఉద్యమంపై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. తమపై చేసిన ఆరోపణలు కనుక ఋజువు చేయకపోతే రాధాకృష్ణను, ఆంధ్రజ్యోతిని కోర్టుకీడుస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ 'కమ్మ'నైన వ్యూహం

      కాంగ్రెస్ పార్టీ 'కమ్మ' సామాజికవర్గాన్ని టార్గెట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని రోజులూ రెడ్డి ఆదిపత్యపు పార్టీగా నిలిచిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు కాపులతో పాటు కమ్మలకు కూడా ప్రాధాన్యం ఇచ్చి వారిని తమవైపు తిప్పుకోవాలని చూస్తోందని అంటున్నారు. అందుకే కమ్మ ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు ఇస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.   తాజాగా కావూరి సాంబశివరావుకు కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కడంతో ఈ విశ్లేషణలకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్ కమ్మలను ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తోందని అర్థం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ తరపున కావూరి, రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి ఎంపీలుగా ఉన్నారు! నలుగురిలో ఇద్దరు కేంద్ర క్యాబినెట్ లో మంత్రులు! ఇంకా రేణుకాచౌదరి అధిష్టానం స్థాయిలో చక్రం తిప్పుతున్నారు!  మరి కాంగ్రెస్ లో ఇప్పుడు వారికి మంచి ఆదిపత్యమే దక్కుతోంది.   మరి ఈ పరిణామాలతో కమ్మ సామాజికవర్గాన్ని కాంగ్రెస్ ఆకర్షించగల్గుతుందా? తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందా?  

బంగారు తల్లి ఆడపిల్లల కోసమా? రాజకీయ ప్రయోజనాల కోసమా?

  రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రూపొందించిన బంగారు తల్లి పధకానికి ముందుగా స్వపక్షంలోనే వ్యతిరేఖత ఎదురయింది. తప్పనిసరి పరిస్థితుల్లో దానిని అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి తనకు అనుకూలురయిన మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీ వేసారు. వేల కోట్లతో ముడిపడిన ఈ పధకం గురించి ఆ కమిటీ ఎటువంటి అధ్యయనం చేయకుండానే యదా తధంగా దానిని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో సభలో కేవలం అధికార పక్ష సభ్యులు తప్ప ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేరు. ఇక ఆ బిల్లును వ్యతిరేఖిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, జానా రెడ్డి ఇద్దరూ కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలిపే సమయంలో సభ నుంచి బయటకి వెళ్ళిపోవడం గమనిస్తే వారిరువురూ కూడా దానిని వ్యతిరేఖిస్తునట్లు అర్ధం అవుతుంది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పధకం ఎన్నికలను, ఓట్లను ఉద్దేశించి పెట్టింది కాదని సభలో చెప్పుకోవలసి రావడమే ఆయన అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలియజేస్తోంది. ఇటీవల కాలంలో ఆయన ఇటువంటి సంక్షేమ పధకాలు చాలానే ప్రవేశపెట్టారు. అయితే, వాటి గురించి కనీసం తన మంత్రి వర్గ సహచరులకి సైతం తెలియకుండా జాగ్రత్తపడుతూ, ఆయన నేరుగా సభలలోనే వాటిని ప్రకటించడం గమనిస్తే, అవన్నీ కేవలం తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకొనేందుకు, రాజకీయ ప్రయోజనాలకోసం నిర్ధేశించబడినవేనని అర్ధం అవుతుంది. ఆయనకి నిజంగా ప్రజలకి మేలు చేయాలనే తలపు ఉండి ఉంటే వాటిని అంత రహస్యంగా ప్రకటించవలసిన అవసరం ఉండదు.   తన మంత్రివర్గాన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి పధకాలను ప్రవేశపెట్టవలసిన ఆగత్యం ఏమిటని ఆలోచిస్తే వాటిని శాశ్విత ప్రాతిపాదికన అమలు చేయడం కష్టం గనుక, వాటిని మంత్రివర్గం తిరస్కరించే అవకాశం ఉందని, అందువల్లే ఆ పధకాలను ముఖ్యమంత్రి నేరుగా ప్రజలలో ప్రకటిస్తునట్లు అర్ధం అవుతోంది.   వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.200 పెన్షన్ ఇవ్వడానికే ప్రభుత్వం క్రిందా మీద పడుతున్నపుడు, రాష్ట్రంలో పుట్టిన ప్రతీ ఆడపిల్ల పేరునా రూ.2000 చొప్పున ప్రభుత్వం ఏవిధంగా జమా చేయగలదు?దానికి అవసరమయిన వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి దులిపి తీసుకువస్తుంది? అని ప్రశ్నించుకొంటే ఈ పధకంలో డొల్లతనం అర్ధం అవుతుంది. ఇంతవరకు ఉన్న పధకాలను సక్రమంగా అమలు చేయలేని ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ ఈ భారీ పధకం తలెకెత్తుకోవడం చూస్తే, దాని అమలు పట్ల చిత్తశుద్ధి లేదని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినదేననని అర్ధం అవుతుంది. కనీసం రానున్న ఎన్నికల వరకయినా ఈ భారీ పధకాన్ని ఎలాగోఒకలాగ అమలు చేయాలన్నాకూడా ఆ భారం కూడా ప్రజల మీదే మోపక తప్పదు.   ఇక గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా లక్షలు కోట్లు వ్యయం అయ్యే జల యజ్ఞం ప్రాజెక్టులు ప్రకటించి ఆయన వ్యక్తిగతంగా, రాజకీయంగా లాభం పొందారు తప్ప నేటికీ అనేక ప్రాజెక్టులు నిధులు కొరతతో సగంలో నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి లక్షల కోట్లు ఖర్చుచేసిన అటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, మళ్ళీ ఇప్పుడీ కొత్త పధకాలు ప్రవేశపెట్టడం చూస్తే, వాటి అమలుపై చిత్తశుద్ధి కంటే, వాటివల్ల కలిగే రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి భావిస్తునట్లు అర్ధం అవుతోంది.   ఇటువంటి భారీ పధకాలను ప్రవేశపెట్టినపుడు సహజంగానే చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆమె పేరు నమోదుతో మొదలయ్యే ఈ అవకతవకలు ఆమెచేతిలో లక్ష రూపాయలు పడేవరకు కూడా కొనసాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరటువంటప్పుడు, డబ్బుతో ముడిపడిన ఈ పధకంలో లోటుపాట్లను, దానిని అమలు చేయడంలో ఎదురయ్యే సమస్యలను పూర్తిగా అధ్యయనం చేయకుండా హడావుడిగా ఎందుకు ప్రవేశపెట్టినట్లు? అని ఆలోచిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ‘ఎన్నికలలు’ కంటున్నారో అర్ధం అవుతుంది.   ఈ విధంగా ఆయన తన ప్రతిష్ట పెంచుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాలకోసం ఇటువంటి పధకాలను ప్రవేశపెట్టి ఆ భారాన్ని ప్రజలను మోయమనడం చాలా అనుచితం.

ఢిల్లీలో ఏం జరుగుతోంది?

      తెలంగాణకు ప్యాకేజీ ఇస్తారన్న వార్తలు నేపథ్యంలో డిఎస్ వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. రూ.25 వేల కోట్ల తెలంగాణ అభివృద్ది బోర్డును ఏర్పాటు చేసి డీఎస్ ను చైర్మన్ గా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. తెలంగాణకు ప్యాకేజీ వార్తల నేపథ్యంలో సీమాంధ్రకు కూడా ప్యాకేజీ కావాలని మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్యాకేజీ వార్తల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీ వెళ్లారు. డీఎస్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తారని, ఈ సాయంత్రానికి జానారెడ్డి ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ అంశానికి వీలయినంత త్వరగా ముగింపు పలికేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

డౌరీ కేసులో శంకర్ రావు & ఫ్యామిలీ

  మాజీ మంత్రి శంకర్ రావు గ్రీన్ ఫీల్డ్స్ కేసులో ఇదివరకు అరెస్టయినప్పుడు ఆయనకి గుండె జబ్బు ఉన్న కారణంగా అరెస్టు నుండి తప్పించుకోగలిగారు. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఆయన కుటుంభ సభ్యుల మీద మరో కొత్త కేసు నమోదయింది. ఈ సారి కేసు వేసింది మాత్రం స్వయాన్న ఆయన కోడలు వంశీ ప్రియ.   ఆరు నెలల క్రితమే ఆమె సెంట్రల్ క్రైం పోలీసు స్టేషన్లో తన మామగారు, అత్తగారు, భర్త మరియు ఆడపడుచు తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినపుడు వారిపై సెక్షన్ 498-ఏ క్రింద కేసు నమోదు చేసినప్పటికీ, వారు హై కోర్టు నుండి బెయిల్ తెచ్చుకొని తమ పరపతితో పోలీసు విచారణ జరపకుండా అడ్డుకొంటున్నారని, ఆమె హై కోర్టులో పిటిషను వేశారు. అయితే కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. శంకర్ రావు ఆరోగ్యకారణాలతో క్రిందటి సారి అరెస్ట్ తప్పించుకొన్నపటికీ, ఈ సారి మాత్రం వరకట్న వేధింపుల కేసులో అరెస్టు తప్పించుకోవడం కష్టమేనని చెప్పవచ్చును. పైగా ఆయన గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆయన సోదరుడిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు అభియోగాలు చేస్తున్నారు. ఒకవేళ, ముఖ్యమంత్రి గనుక పోలీసులకి అనుమతిస్తే ఈ సారి శ్జంకర్ రావు అరెస్ట్ తప్పించుకోవడం కష్టమే.

తెలంగాణ పై హైదరాబాద్ బ్రదర్స్ సూచన

        తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల సమావేశానికి హాజరుకాని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు నోరు విప్పారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని, ఇలాగే నానబెడుతూ పోతే కాంగ్రెస్‌కు నష్టం తప్పదని మంత్రి ముఖేష్‌ గౌడ్‌ అన్నారు. అభివృద్ధి… ప్యాకేజీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్య పరిష్కారం కాదని మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా సీఎం పదవి తీసుకోనని ఎప్పుడో చెప్పినట్లు మంత్రి జానారెడ్డి అన్నారు. తనకెలాంటి పదవి ఇవ్వకోపోయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్యాకేజీలు ఊహాగానాలే అని జానారెడ్డి కొట్టిపారేశారు.

కెసిఆర్ ఎత్తుగడ ఫలించింది!

      కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన సీనియర్ లీడర్ కేశవరావు .. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. కేశవరావు కి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా వస్తుందని అంతా బావించారు. ఇంతలో ఏమైందో కాని సెక్రటరీ జనరల్ గా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయించారు. కేశవరావు గారి ఆధ్వర్యంలో తాము కచ్చితంగా ప్రత్యేక తెలంగాణ సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేశవరావు కి సెక్రటరీ జనరల్ గా నియమించడం వెనుక కెసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని అందరూ భావిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే , కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని పార్టీ అదినేత కె.చంద్రశేఖరరావు కాని, పార్టీలోని ప్రముఖులు కాని అబిప్రాయపడ్డారని అంటున్నారు. ఆయనకు పార్టీ తరపున జాతీయ వ్యవహారాలు అంటగట్టి...రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడిగా పనిచేసిన కేశవరావు ఇప్పుడు మరో ఉప ప్రాంతీయ పార్టీలో సెక్రటరీ జనరల్ గా నియమితులవడం కూడా ఆసక్తికరమైన విషయమే.

తెలంగాణ కోసం భారీ ప్యాకేజి

.....సాయి లక్ష్మీ మద్దాల       తెలంగాణ పై ఇహ నాన్చుడు ధోరణి కాకుండా,ఏదో ఒకటి నిర్ణయించే దిశలో రాహుల్ గాంధి పట్టుదలగా ఉన్నట్లు యుపిఎలోని అత్యున్నత స్థాయి వర్గాల సమాచారం. ఇప్పుడున్న పరిస్థుతులలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని మిగతా రాష్ట్రాలలో తలెత్తే సమస్యలకు తావివ్వకుండా, కోర్ కమిటీ ప్యాకేజి నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈప్యాకేజి ముఖ్యాంశాలలో ఒకటి తెలంగాణ ప్రాంత ఉద్యోగావకాశాలు,రాజకీయ అధికారం పంపిణిలోను తెలంగాణ వాటా నిర్ణయం. ఈ ప్యాకేజిని ఈ నెల 28 లోగా ప్రకటిస్తారని ప్రభుత్వంలోని అతున్నత స్థాయి వర్గాల సమాచారం. ఈ ప్యాకేజితో అందరు తెలంగాణ వాదులను సంత్రుప్తి పరచగలమని వారి ఆశ.  ఉద్యమానికి వివధ కొత్త కోణాలతో రాజకీయ రంగు పులిమి తద్వారా తానేదో బావుకుందామని ఆలోచిస్తున్న కే.సి. ఆర్ కు ఇది మింగుడు పడే  అంశమేనా? రాబోయే కాలంలో కేంద్రంలో చక్రం తిప్పబోయేది ఫెడరల్ ఫ్రంట్ ద్వారా తామేనని కొత్తగా మరో ప్రకటన చేశారు గనుక. తెలంగాణ లో  అభివృద్ధి  లేని కారణంగా ప్యాకేజిని ఇచ్చి తద్వారా అభివృద్ధిని సాధించి పెట్టవచ్చు అనేదే రాహుల్  ఆలోచన అయితే,మరి ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ది కి నోచుకోని ప్రాంతాలు,నాగరికతకు ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలు అటు ఉత్తరాంధ్రలోను,ఇటు రాయలసీమలోనూ ఉన్నాయి మరి ఆప్రాంతాలకు ఎటువంటి న్యాయం చేస్తారో,వివరించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అన్ని ప్రాంతాలలోను సమానంగా జరిగినపుడే ప్రాంతీయ అసమానతలు తోలగుతాయనేది రాజ్యంగ ధర్మం. కాని నేడు ఆధర్మాన్ని వారి వారి రాజకీయాల లబ్ధి కోసం తుంగలో తొక్కుతున్నారు.

దిద్దుబాటు చర్యలలో కమల నాధులు

  మోడీని వ్యతిరేఖిస్తూ అద్వానీ అస్త్ర సన్యాసం చేసిన తరువాత తలెత్తిన రాజకీయ పరిణామాలను చూసి ఉలిక్కి పడిన కమలనాథులు ఆ ఊబి లోంచి బయటపడేందుకు ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతున్న మోడీయే స్వయంగా అద్వానీని కలిసి మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు పార్టీలో తనకు మద్దతు ఇచ్చేవారిని వ్యతిరేకించేవారిని కూడా కలుస్తూ పరిస్థితులను తనకనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు ఆరంబించారు. అద్వానీని కలిసి పార్టీకి ఆయన మార్గదర్శనం అవసరమంటూ నచ్చజెప్పి ఆయన చేత తనకు, పార్టీకి అనుకూలంగా ఎలాగయినా ఒక ప్రకటన చేయించి విమర్శకుల నోర్లు మూయించాలన్నది మోడీ యోచన. పనిలోపనిగా మోడీ పార్టీ ప్రధాన కార్యకర్తలతో కూడా భేటీ అయ్యి రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో విజయం సాదించేందుకు ఏవిధంగా ముందుకు సాగాలనే విషయంపై దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.   మరో పక్క రాజ్ నాథ్ సింగ్ కూడా పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయమై ఆయన పార్టీ ముఖ్య నేతలతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. సీనియర్ నేత వెంకయ్య నాయుడు కూడా విమర్శకులకు సమాధానాలు చెప్పే పనిలో పడ్డారు. పార్టీ అంతర్గత సమస్యలపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబు ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో 2002 లో జరిగిన దురదృష్టకర సంఘటనలను పదే పదే ఎత్తి చూపిస్తూ బీజేపీని నిందిస్తూ తన తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.   కాంగ్రెస్ దేశాభివృద్ధిని నిర్లక్ష్యం చేసి, కుంభ కోణాలలో అగ్రగామిగా నిలుస్తోందని ఆయన ఎద్దేవా చేసారు. మతతత్వ పార్టీగా తమపై ముద్ర వేస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలలోనే ఎక్కువ మత కలహాలు చెలరేగుతున్నాయని ఆయన అన్నారు. గుజరాత్ లో గత 10 పదేళ్ళు గా తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కర్ఫ్యూ లు, బంద్ లు జరగలేదని ఆయన అన్నారు. గత 10 ఏళ్లలో గుజరాత్ లో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడమని ఆయన కాంగ్రెస్ పార్టీకి హితువు పలికారు.   తమ పార్టీ అభివృద్దే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్ మాత్రం కుంభకోణాలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగిపోతోందని ఆయన ఎద్దేవా చేసారు. తమ పార్టీ పరమత సహనం కలదని ఆయన అన్నారు. ఉదాహరణకి గోవా రాష్ట్రంలో 30 శాతానికి పైగా క్యాథలిక్ లున్నారని, అక్కడ తమ ప్రభుత్వంలో 8 మంది శాసన సభ్యులు క్యాథలికులేనని ఆయన గుర్తు చేశారు.   తమ ప్రభుత్వ హయాంలో ఉన్న రాష్ట్రాలలో వ్యవసాయరంగ వృద్ధిరేటు 18 శాతం కాగా ,కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాలలో అది 1.96 శాతానికి పడిపోయిందన్నారు. మంత్రి వర్గ విస్తరణతో కేవలం కాంగ్రెస్ విస్తరణే తప్ప పరిపాలనకు కానీ, దేశాభివృద్ధికి అది ఏవిధంగాను దోహదపడదని ఆయన తేల్చి చెప్పారు.

కళంకిత సభా సమావేశాలు

  ఒకప్పుడు ఎవరినయినా కోర్టులు తప్పుబడితే అది చాల అవమానకరంగా భావించేవారు. అటువంటి వారిపట్ల ప్రజలకి, ప్రభుత్వానికి కూడా చిన్న చూపే ఉండేది. ఇక సదరు వ్యక్తులు కూడా తీవ్ర ఆత్మన్యునతకి గురయి స్వచ్చందంగా రాజీనామా చేసి తమ పదవుల నుండి తప్పుకొనేవారు. అందువల్ల, అందరికీ సమాజమంటే కొంత భయం కూడా ఉండేది. ఇదంతా ఒకనాటి మాట. నేడు దీనికి పూర్తి వ్యతిరేఖ పరిస్థితులు దాపురించాయి.   శాసన సభలో సాక్షాత్ ముఖ్యమంత్రే కళంకిత మంత్రులను, శాసనసభ్యులను వెనకేసుకు వస్తూంటే, సదరు వ్యక్తులు తమపై వచ్చిన నేరారోపణలకు సిగ్గుపడకపోగా తమని ప్రశ్నించినవారిపై ఎదురుదాడికి పాల్పడటం విశేషం. ఈ రోజు శాసన సభలో కళంకిత మంత్రులపై తెదేపా లేవదీసిన చర్చకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ధీటుగా జవాబిచ్చారు. తన పరిశీలనలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాలు కనబడ్డాయని, అయినప్పటికీ చంద్రబాబు, నాటి రెవెన్యూ శాఖ మంత్రిగా అశోక్ గజపతి ఎన్నడూ తప్పు చేసినట్లు భావించలేదని, కోర్టుకు వెళ్లి బెయిలు కూడా తెచ్చుకొని నిర్భయంగా నిర్లజ్జగా తిరుగుతూ ఇప్పుడు తనని ప్రశ్నించడం ఏమిటని ఆయన నిలదీశారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెదేపాకు బదులిస్తూ రాజీనామాలు చేసినంత మాత్రాన్న మంత్రులను నేరస్తులుగా పరిగణించలేమని, గతంలో తెదేపా మంత్రులపై కూడా అనేక నేరారోపణలు వస్తే వారంతా బెయిలు పొంది హాయిగా తిరుగుతున్నపుడు, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన తన మంత్రులను ఎందుకు తప్పు పట్టాలి? అని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రే స్వయంగా కళంకిత మంత్రులకు బాసటగా నిలవడం ఒక తప్పయితే, ఎదుట వాడు తప్పు చేసాడు గనుక తాము కూడా తప్పు చేసినా తప్పులేదని వాదించడం మరో తప్పు.   ఇది ఒక దుసంప్రదాయంగా మారి నేరస్తులే ప్రజలను పరిపాలించే అవకాశం కల్పిస్తుంది. స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ఒకసారి విలువలు దిగజార్చుకోవడం మొదలుపెడితే ఇక సమాజం అధః పాతాళానికి జారడం ఖాయం. సమాజంలో ఇప్పటికే నేర ప్రవృతి పెరిగిపోయింది. దానికి ఈ విధంగా ప్రభుత్వం కూడా సహకరిస్తే అది మరింత పెరిగి తుదకు ఏదో ఒకనాడు అది సమాజాన్నే కబళించక మానదు.

తప్పు చేయలేదు.. రాజీనామా చేశారు!

      శాసనసభలో కళంకిత మంత్రుల వివాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. మంత్రులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఎక్కడ రుజువు కాలేదన్నారు. ఛార్జీషీట్ వేసినందున ఇద్దరు మంత్రులు కాంగ్రెసు పార్టీ విధానాలకు అనుగుణంగా రాజీనామా చేశారని, అంతమాత్రాన వారు తప్పు చేసినట్లు కాదన్నారు. మిగిలిన మంత్రులపై సిబిఐ ఎలాంటి అభియోగాలు మోపలేదన్నారు. ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దీనిపై ఎక్కువ మాట్లాడటం సరికాదని ముఖ్యమంత్రి చెప్పారు. స్టే తెచ్చుకున్న వారు తమను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. టిడిపి హయాంలో తీసుకున్న నిర్ణయాలు కూడా పలు కోర్టులో ఉన్నాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెసు వారు మాత్రమే జైలుకెళ్లారా? టిడిపి నేతలు వెళ్లలేదా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ కి 16 ఎంపీ సీట్లు!

      కేసీఆర్ బహుముఖ ఉద్యమకారుడు. ప్రతి దానికి కేసీఆర్ వచ్చి పాల్గొనాలనడం మూర్ఖత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరినో అడిగి బంద్‌కు పిలుపు ఇచ్చే అవసరం లేదని, టీఆర్ఎస్ ఇండిపెండెంట్ పార్టీ అని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేది టీఆర్ఎస్సే అని, 16 ఎంపీ సీట్లతో ఢిల్లీకి వెళ్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 50 వేల మందిని బైండోవర్ చేసి 'ఛలో అసెంబ్లీ' సక్సెస్ కాలేదంటున్నారు, ఇదేం ప్రజాస్వామ్యమని మండిపడ్డారు. ఆటంకాలు కలిగించి ప్రభుత్వాన్ని ఉక్కిబిక్కిరి చేశామన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నేతలు పనికిమాలిన సమావేశాలతో ఎవరిని మోసం చేస్తున్నారన్నారు. దమ్ముంటే తాడోపేడో తేల్చుకుని బయటకు రావాలని సవాల్ చేశారు.

తెరాసలో కేశవ్ రావుకి పట్టాభిషేకం ఎందుకో

  నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ హస్తం పట్టుకు తిరిగిన కేశవ్ రావ్ తదితరులు, తెలంగాణా సాధన కోసమంటూ కేసీఆర్ కారెక్కినప్పుడు, వారికి కేసీఆర్ చేతిలో అవమానాలు తప్పవని అందరూ ముక్త కంఠంతో ఘోషించారు. ఇంకా అనేకమంది తెరాసలో చేరాలని ఆలోచిస్తున్నపటికీ, ఈ భయంతోనే తెరసలోకి దూకకుండా గోడ మీద ఉండిపోయారు. వారి భయాలను దూరం చేయడానికన్నట్లు, కేసీఆర్ తన పంచన చేరిన కేశవ్ రావుకి పార్టీ జనరల్ సెక్రెటరీగా నియామకం చేయడమే కాకుండా తానూ ఆయన అభిమానంటూ ఆయనని ఆకశానికి ఎత్తేసారు.   ఈ దెబ్బతో కేశవరావు పూర్తిగా ఫ్లాట్ అయిపోయే ఉంటారని వేరే చెప్పక్కరలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీలో కేశవ్ రావు నిర్వహించిన కీలక పదవులతో పోలిస్తే ఇదేమంత గొప్ప పదవి కాదని ఆయనకి కూడా తెలిసినప్పటికీ, ప్రస్తుతం ఆ పార్టీలో ఇంత కంటే గొప్ప పదవి మరొకటి లేదు కనుక దానితోనే సరిపెట్టుకోక తప్పదు మరి. ఇప్పుడు ఆయనే స్వయంగా కాంగ్రెస్ పార్టీలో తన మిత్రులను తెరాసలో జేర్పించే శ్రమ తీసుకోవచ్చును.   ఇక, కేశవ్ రావుని పార్టీలో అందలం ఎక్కించడం ద్వారా, తెరాసలో చేరాలా వద్దా అని ఊగిసలాడుతున్నఇతర పార్టీల నేతల భయాలు కూడా దూరం అవుతాయి గనుక త్వరలో మళ్ళీ తెరసలోకి వలసలు ఆరంభమవవచ్చును. కేశవ్ రావుకి కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల, మున్ముందు అవసరమయితే మళ్ళీ ఆపార్టీతో కేసీఆర్ బేరసారాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఒక దెబ్బకు ఇన్ని పిట్టలు కొట్టడం కేవలం కేసీఆర్ కే చెల్లు.

ఆపరేషన్ దిగ్విజయ్

  మంత్రివర్గ విస్తరణలో కావూరి, శీలంలకు పెద్ద పీట వేయ్యడం ద్వారా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో పట్టుసాధించ వచ్చనేది కాంగ్రెస్ యోచన. ఆ ప్రాంతాలను వారిరువురూ ప్రభావితం చేయగలరని కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. జె.డి.శీలం ద్వారా ఆయన సామజిక వర్గానికి చెందిన వారి ఓట్లను చేజిక్కించుకోవాలని యోచించింది. ఇక, ఇప్పటి వరకూ సమైఖ్యవాదాన్ని బలంగా వినిపించిన శీలం,కావూరి అకస్మాత్తుగా మెత్తబడి తెలంగాణాపై అధిష్టానం ఇచ్చే తీర్పుని గౌరవిస్తానంటూ లైన్ క్లియర్ చేశారు కనుక రాష్ట్రంలో సీమంద్రా వైపు నుండి తెలంగాణా వ్యతిరేఖత కొంత మేర తగ్గించుకొన్నట్లయింది. ఇక సమైక్యవాదులయిన లగడపాటి, శైలజానాథ్ వంటి పార్టీకి విధేయులయిన మిగిలిన వారిని కూడా నియంత్రించడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద కష్టమేమి కాదు గనుక ఇక తెలంగాణాపై నిర్దిష్ట ప్రకటన చేయడానికి రంగం సిద్దం చేసుకొంటోంది.   అందుకే ఆయన ఇంచార్జ్ గా బాధ్యతలు చెప్పటిన వెంటనే ఈ నెలాఖరులోగా రాష్ట్రాన్ని పర్యటించబోతునట్లు తెలియజేసారు. ఆయన తన పర్యటనలో సమైక్యవాదులయిన మిగిలిన నేతలతో కూడా సంప్రదింపులు జరిపి తెలంగాణా ప్రకటనకు మార్గం సుగమం చేసే ప్రయత్నాలు చేయవచ్చును.   ఇక,  దిగ్విజయ్ సింగ్ గతంలో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్ ఘడ్ వేరు చేసి కొత్త రాష్ట్రం సృష్టించడంలో బీజేపీకి పరోక్షంగా చాలా సహాయం చేసి ఉన్నందున ఆ అనుభవంతో ఆయన తెలంగాణా సమస్యను కూడా పరిష్కరించగలదని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయం.   ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం జటిలమయిన తెలంగాణా సమస్యని పరిష్కరించగలిగితే, రానున్న ఎన్నికలను దైర్యంగా ఎదుర్కొనగలదని అభిప్రాయ పడుతోంది. తద్వారా, కేవలం తెలంగాణా వాదంతోనే కాంగ్రెస్ ను చావు దెబ్బ తీయలనుకొంటున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కు చెక్ బెట్టి మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. మరి కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు దిగ్విజయంగా ఈ వ్యవహారం దిగ్విజయ్ సింగు చక్కబెట్టగలరో లేదో చూడాలి.