కొనసాగుతున్న జలవిలయం

      కేదారేశ్వరుడి సాక్షిగా గంగ సృష్టించిన విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది.. సునామిలా విరుచుకుపడిన మందాకినీ నది అలలు వందాల ప్రాణాలు తీయటంతో పాటు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేయగా. ఇప్పుడు మిగిలిన ఆ ఆనవాలు కూడా మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి..   ఇప్పటికే సైన్యం ప్రాణాలకు తెగించి వేల ప్రాణాలను కాపాడినా.. ఇంకా దాదాపు 50 వేలకు పైగా ప్రజలు అక్కడే చిక్కుకొని ఉన్నారు.. అయితే ఇంత వరకు రవాణా మార్గాలు సరిచేయలేకపోవడం.. వాతవరణ పరిస్థితులు కూడా సహకరించకపోవటంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది..   ఇప్పటి వరకు మరణించిన వారిలో సంగ మంది అలల తాకిడికి మరణించగా అంతే మంది ఆకలి దప్పులతో మరణించారు.. అయితే  ఇప్పటికీ చాలా మంది మార్గమధ్యంలోనే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.. ముఖ్యంగా యాత్రకు వెళ్లిన వారిలో వృద్దులు మహిళలే ఎక్కవుగా ఉండటంతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.. ప్రభుత్వంతో పాటు పలు స్వఛ్చంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అవి బాధితులకు అందటం చాలా కష్టమవుతుంది..

తమిళ పురచ్చితలవై జయమ్మ కరుణ

.....గోపి చిల్లకూరు.డల్లాస్ టెక్సాస్       భారత్ లో మీరు  ఏ పట్టణం లో సెటిల్ అవ్వాలను  కొంటున్నారో ఇంకా నిర్ణయం తిసుకొలేదా ! ఎందుకు ఆలస్యం తమిళనాడు మద్రాసు నగరంలోకి మకాం మార్చేయండి. ఆదాయంతో పనిలేకుండా బహు భేషుగ్గా బతికేయచ్చు, శెభాష్ జయలలితమ్మ, నమస్కారం, వణక్కం అంటూ !  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారు వరుసగా ప్రకటిస్తున్న అమ్మటిఫిన్, అమ్మలంచ్, అమ్మమినరల్ వాటర్, అమ్మ వెజిటబుల్ అవుట్ లెట్స్  పథకాలు చూస్తుంటే !  1) బ్రేక్ ఫాస్ట్  1-3 రూపాయల లోపు(ఇడ్లి, దోస, పొంగలు, పూరి ..etc )నచ్చిన టిఫిన్స్      లంచ్       5-8 రూపాయలలోపు     డిన్నర్    5 -8రూపాయలలోపు     మినరల్ వాటర్ సగం ధరకే !     రోజుకు 12 రూపాయలతో ఒక మనిషి బ్రతికేయచ్చు !   మీకు పై అమ్మ హోటల్ లో రోజూ తినలేకపోతే వారానికి ఒకసారి అమ్మ Vegetables outlet   స్టోర్స్ లో సగం ధరకే కూరగాయలు.    1)  బియ్యం ఎలాగు కేజీ 2 రూపాయలు మంచిగా బిరియాని వండుకొని పండుగ చేసుకోవచ్చు !  2) ప్రతి ఫామిలీకి ఇచ్చే ఉచిత టీవితో జయటీవీ  సీరియళ్ళు అన్ని ఫ్రీగా చుసేయవచ్చు 3) మీ పిల్లలకిచ్చే ఉచిత laptopతో చాటింగ్ లేదా సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ లు  చేసేయవచ్చు ! 4) ఓటు మాత్రం జయలలిత అమ్మకే వేసేయండి ! ఈసారి మనకు వంటకు గ్యాస్ కూడా ఫ్రీగా వస్తుంది.   అమ్మ ఇంకొంచెం కరుణ చూపిస్తే   ప్రతి రోజూ వండిన వెజిటేరియన్  భోజనం మూడు పూటల మన  ఇంటికి వస్తుంది.   అమ్మ దయతలిస్తే  ఆదివారం  చికెన్ లేదా  మటన్  భోజనం కూడా  వస్తుంది. పేద ప్రజలకు భోజనం సరసమైన ధరలకు అందిచడం మంచిదే కాని వారిని ఎన్నికల దృష్టితో  మరీ  సోమరిపోతులను చేయడం తగదు అన్నది రచయత భావన. అదే విధముగా ఈ పథ కాల  ద్వార రాష్ట్ర ఖజానాకు నష్టం రాకుండా చేస్తే అత్యంత ఉపయోగమైన పథకములు అవుతాయీ !.  ప్రతి చోట అమ్మ హోటల్స్ పెట్టి  ఇడ్లిబండిలు , చిన్న హోటల్స్, చిరు అంగడిలు నడిపే వారు అందరు నష్టపోయే అవకాశం వుంది.  ఇప్పటికే తమిళనాడు గత సంవత్సరం లోటుబడ్జెట్  దాదాపు 23వేల  కోట్లు. ఈ సంవత్సరం ఇప్పటికే  భోజన పథకం ఖర్చు 5000 కోట్లు.   లోక్ సభ ఎన్నికలు త్వరలో  వస్తున్నాయని ఇన్ని పథకాలు ఇలాగే పెడితే రాష్ట్రం దివాలా తీయడం ఖాయం.  చైనాలో ఒక  పాత  సామెత "ఒక మనిషికి చేపలు వండి ఒక పూట భోజనం  పెట్టడం కంటే అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే  ఆ వృత్తి  అతనికి  జీవితాంతం తిండి పెడుతుంది" అన్న సామెత ప్రభుత్వాది నేతలు గుర్తు పెట్టుకొంటే మంచిది.   (“Give a man a fish and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime.)

నవ్విపోదురుగాక మాకేల సిగ్గు

  గట్టిగా నెల రోజులు కూడా శాసనసభను నడపలేని ప్రభుత్వం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రూ.ఒకటిన్నర కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి, ఒక్కోటి రూ 47, ౦౦౦ ఖరీదు చేసే టాబ్లెట్ పీసీలను, గిఫ్ట్ వోచార్లను, ఇతర కానుకలను బహుమతిగా అందిస్తే, సభను ఒక్కరోజు కూడా సవ్యంగా జరగనీయకుండా అడ్డుపడిన మన శాసన సభ్యులు, నవ్వితే నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అనుకొంటూ ప్రభుత్వం అందించిన ఆ బహుమతులను ఆనందంగా స్వీకరించారు. అందుకు ప్రభుత్వంపై తమకున్నవ్యతిరేఖత కానీ, పార్టీ సిద్దాంతాలు గానీ, తెలంగాణావాదం గానీ ఏవీ అడ్డు రాలేదు. బహుమతులు అందుకోవడం తమ జన్మ హక్కు అన్నట్లు చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ నిన్నటి వరకు ఎవరిని సభలో తిట్టిపోసారో వారి నుండే అందుకొని ఎంచక్కా ఇళ్ళకు వెళ్ళిపోయారు.   ఇక, గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల కోసం ఏమి చేస్తోందో చెప్పలేకపోయినా, ఒక్కో శాసన సభ్యుడికి రూ.7,500 విలువయిన గిఫ్ట్ వోచర్లు పంచిపెట్టింది. అదేవిధంగా పరిశ్రమల శాఖ రాష్ట్రoలో కరెంటు కోతలతో అల్లాడిపోయిన పరిశ్రమలకు చేసిన మేలేమి లేకపోయినా, శాసన సభ్యులకు ఎంతో ఉదారంగా విలువయిన బహుమానాలు పంచిపెట్టింది.   అయితే, క్రిందటిసారి బడ్జెట్ సమావేశాల అనంతరం ఇచ్చిన లాప్ టాపులు, ప్రింటర్లు, స్కానర్లు, సెల్ ఫోనులు, ఐ పాడ్ వగైరా కానుకలతో పోలిస్తే ఈ సారి ప్రభుత్వం మొక్కుబడి బహుమతులతో సరిపెట్టేసిందని కొందరు సభ్యులు సణిగినప్పటికీ, ప్రజలమీద మరింత భారం మోపడం సబబు కాదనుకొంది ప్రభుత్వం.   సాధారణంగా కార్యాలయాలలో, కర్మాగారాలలో ఎవరయినా సరిగ్గా పనిచేయకాపోతే అటువంటివారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అసెంబ్లీని సజావుగా సాగనీయకుండా అడ్డుపడినందుకు శాసనసభ్యులకు ప్రభుత్వం బహుమానాలు పంచిపెట్టడం మాత్రం నిజంగా విడ్డూరమే. అందుకు ప్రజాధనం ఖర్చు చేయడం జవాబు దారితనం లేకపోవడమే కారణం.

కాపలా కుక్కల్లా కాదు..గుంట నక్కల్లా

      టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలనే దోచుకుంటున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ పట్ల గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని, వాళ్ళ శవాల మీద పునాదులు నిర్మించుకున్నారని ఆరోపించారు. భూవివాదంలో కేటీఆర్ కు భాగస్వామ్యం లేకపోతే, అసెంబ్లీలో నిన్న టీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ తమ అసలు రంగు ఎక్కడ బయటపడుతుందోనని టీడీపీపై ఎదురుదాడికి దిగిందని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టే ప్రజలు మిమ్మల్ని భరిస్తున్నారని, లేకపోతే తరిమికొట్టేవారన్నారు. భూవివాద వ్యవహరంలో భువనేశ్వర్ జైల్లో సతీష్‌రెడ్డి ఉన్నమాట నిజం కాదా, కిడ్నాప్‌పై శ్రీనివాస్‌రావు కుమార్తెల ఆరోపణలు నిజం కాదా?, సతీష్‌రెడ్డిని పట్టించుకోవడం లేదని అతని సోదరులు చెప్పిన మాట నిజం కాదా అని రేవంత్ ప్రశ్నించారు.

దగ్గుబాటి క్షమాపణ చెప్పాలి

      కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతె రూ.5 కోట్ల క్రిమినల్ దావా వేస్తానని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి హెచ్చరించారు. దగ్గుబాటికి తాను ఇప్పటికే లీగల్ నోటీసులను పంపించానని, ఇప్పటికైనా ఆయన క్షమాపణలు చెప్పాలని టీఎస్సార్ సూచించారు. పురందేశ్వరి పై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రభుత్వ పతకాలను విశాఖ ప్రజలను పూర్తి స్థాయిలో అందించడమే నా దేయమని అన్నారు. విశాఖ లోకసభ సీటుపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు, టి.సుబ్బిరామి రెడ్డిల మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దగ్గుబాటి టిఎస్సార్ పైన తీవ్ర విమర్శలు చేశారు.

టిడిపి ఎమ్మెల్యేలు హరీష్ తో టచ్ లో ఉన్నారా?

      టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు టిడిపిని ఇబ్బంది పెడుతున్నాయి. టిడిపి, టీఆర్ఎస్ ల మద్య మాటల యుద్ధం నడుస్తుండడంతో, తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు టిడిపి ని టెన్షన్ పెడుతున్నాయి. టిడిపి కి చెందిన ఎమ్మెల్యే లు ఎనిమిది మంది తనకు టచ్ లో ఉన్నారని చెప్పారు. టిడిపి పార్టీ ఖాళీ అవుతుందనే భయంతో ఆపార్టీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. టిడిపి నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, తమపై అసత్య ప్రచారం చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నిజంగానే టిడిపి ఎమ్మెల్యే లు హరీష్ తో టచ్ లో వున్నారా? కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా!

'నేనింతే' అన్న మహీధర్ రెడ్డి

      కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది తనకు వ్యతిరేఖంగా సంతకాలు సేకరణ చేపట్టిన అంశంపై ఆ పార్టీ మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలకు సొంత పనులు చేయలేదనె తనను తొలగించాలని కోరుతున్నారని మహీధర్ రెడ్డి విమర్శించారు. అయిన తాను తన పద్దతి మార్చుకోనని, తాను ఇలాగె ఉంటానని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని సంతకాలు పెట్టుకున్న అభ్యంతరం లేదని చెప్పారు. మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డికి అండగా మంత్రి దానం నాగేందర్ నిలబడ్డారు. మహీధర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.

బాబు..మగాడివైతే నువ్వు రా

      టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కు, ఆంధ్రజ్యోతి పత్రికకు తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. తనపై కుట్రతోనే ఆంధ్రజ్యోతి పత్రిక భూదందా వార్తలను ప్రచురించిందని, ఆ పత్రిక పై సోమవారం పరువు నష్టం పిటిషన్ వేస్తానని అన్నారు. తాను ఎలాంటి విచారణకైన సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. చంద్రబాబు, కెసిఆర్ ఆస్తులపై విచారణకు సిద్దంగా ఉన్నామని 'దమ్ముంటే, మగాడివైతే నువ్వు రా.. చంద్రబాబు, కెసిఆర్ పుట్టినప్పటి నుంచి విచారణ జరిపిద్దామా? ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్దమని తమ పార్టీ నేతలు ఎప్పుడో చెప్పారని కెటిఆర్ అన్నారు. లాగు తడుపుకుంటూ పారిపోయే వ్యక్తి చంద్రబాబు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను తప్పు చేసినట్లు తేలితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ చెప్పారు.

జగన్ కోసం 'క్యాంపు ఆఫీస్ దందా'

      వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు వైఎస్ జగన్ ని కోట్లకు అధిపతిని చేయడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. సెక్రెటేరియట్ లెవల్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు..తన పర్సనల్ క్యాంపు ఆఫీస్ అడ్డాగా చేసేసుకొని ముఖ్యమంత్రి వైఎస్, ఆయన సన్నిహిత మిత్రుడు కేవీపీ రాంచంద్రరావు, ఏపీఐఐసీ చైర్మన్ బీపీ ఆచార్య, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ లు ఓ పెద్ద వ్యవహారం చక్కబెట్టేశారు. కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సంస్థకు అప్పనంగా ఎలాంటి ఒప్పందపత్రం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4700 ఎకరాలు నెల్లూరు జిల్లాలో కట్టబెట్టేశారు. వైఎస్ కు సన్నిహితంగా ఉండే కృష్ణపట్నం పోర్టు గ్రూపు అధినేత విశ్వేశ్వరరావు కుమారులు శ్రీధర్, శశిధర్ లు కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ కు డైరెక్టర్లు. ఆ తరువాత వైఎస్ హయాంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఆగస్టులో పదవీ విరమణ పొంది 2009 అక్టోబర్ 14న అంటే పదవీ విరమణ చేసిన రెండు నెలలకే అందులో ఎండీగా చేరిపోయారు.2005లో ఈ సంస్థ నమోదుకాగా 2008 మేలో డైరెక్టర్లు శ్రీధర్, శశిధర్ లు తప్పుకున్నారు. వారి స్థానంలో జగన్ సన్నిహితులు సజ్జల దివాకర్ రెడ్డి, నర్రెడ్డి గంగిరెడ్డిలు వచ్చారు. ఆ తరువాత జులై 25న హరీష్ సి కామర్తి, జెజె రెడ్డి అనే మరో ఇద్దరు జగన్ సన్నిహితులు చేరారు. ఇక 2009 సెప్టెంబర్ 2న వైఎస్ అనుకోని ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ అభిమానులు ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ఇది ఒకవైపు జరుగుతున్న సంఘటన అయితే వైఎస్ చనిపోయిన నెల 17 రోజులకు అంటే అక్టోబరు 19న వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మెజారిటీ షేర్లు కొనుగోలు చేసి ఈ సంస్థకు యజమాని అయిపోయారు. మరి ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారం పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

త్వరలో మరో ‘టీ’ పార్టీ

  తెరాస మరియు దాని అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులపై తరచూ ఎన్ని ఆరోపణలు వస్తున్నపటికీ, తెలంగాణా పోరాటానికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా చలామణి అవుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.   ఇటీవల అటువంటి ఆరోపణలతోనే ఆ పార్టీ నుండి బహిష్కరింపబడిన రఘునందన్ రావు, తిరిగి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేయడం, ఆ తరువాత వారిరువురూ సవాళ్లు ప్రతిసవాళ్ళు చేసుకోవడం, రఘునందనుడు నేరుగా సీబీఐకి వెళ్లి ఏవో కాగితాలు సమర్పించడం, పరువు నష్టం దావాలంటూ హరీష్ రావు రంకెలేయడం వగైరా ఎపిసోడ్స్ అన్నీ చకచకా జరిగిపోయిన తరువాత, అమాయక ప్రజలకి ఈ సీరియల్లో అసలు హీరో ఎవరో, విలన్ ఎవరో తెలుసుకోక ముందే సీరియల్ ఏవో చెప్పలేని అనివార్య కారణాల వల్ల అర్ధంతరంగా ముగిసిపోయింది. కనీసం తరువాత ఎపిసోడ్ లోనయినా ఆ సస్పెన్స్ వీడుతుందో లేదో అని సీరియల్ జీవితానికి అలవాటుపడిన జనాలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.   అయితే, మీడియా ముందు గుక్క తిప్పుకోకుండా మాట్లాడే రఘునందనుడు, ఏ కోర్టు గడప దగ్గరో లేక ఏ మీడియా గుమ్మంలోనో ఎదురయి మిగిలిన సీరియల్ కంప్లీట్ చేస్తాడని ఆశిస్తున్న ప్రజలు ఆశలు అడియాసలు చేస్తూ, ఆయన అనుచరులు అకస్మాత్తుగా డిల్లీలో ఎలెక్షన్ కమీషన్ ముందు ప్రత్యక్షమయినట్లు సమాచారం. త్వరలో ఆయన కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టుకొని, కేసీఆర్ లాగే ఉద్యమాలు చేసుకొందామని డిసైడ్ అయినట్లు సమాచారం.   కానీ, కేసీఆర్ పద్దతి కంటే ‘గుర్ఖాల్యాండ్’ తరహాలో ఉద్యమాలు చేసుకోవడం మంచిదని ఆయన డిసైడ్ అయినట్లు, అందువల్ల తన కొత్త పార్టీకి అదే స్టయిల్లో ‘తెలంగాణా ముక్తి మోర్చా’ అని పేరు ఖాయం చేసుకొనట్లు సమాచారం.కానయితే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ డిల్లీలో మళ్ళీ పెద్దల మేళా పెట్టుకొని ఇక నేదో రేపో తెలంగాణా ప్యాకేజి ఇచ్చేస్తోందని అందరూ చెప్పుకొంటున్న ఈ తరుణంలో ఆయన పార్టీ లాంచింగ్ వల్ల ఏమయినా లాభం ఉంటుందా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి.

గవర్నర్ పై మండిపడ్డ కేకే

    తెలంగాణ ప్యాకేజీలకు సంబంధించి గవర్నర్ నరసింహన్ కేంద్రంలో మాట్లాడారన్న ప్రచారం నేపధ్యంలో మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నేత కే కేశవరావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే కీలకమని, గవర్నర్‌ కేవలం రాష్ట్రపతి ఏజెంట్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాలను అణగతొక్కాలను కోవడం రాజ్యాంగానికి విరుద్ధమని గవర్నర్ పై కేకే విమర్శలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప..ప్యాకేజీలకు అంగీకరించేది లేదు అని కేకే స్పష్టం చేశారు. అధిష్టానం ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకోకుంటే… తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెంటనే బయటకు రావాలి అని కేకే పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో పదవి విషయంలో నాకు ఎలాంటి అసంతృప్తి లేదు అని కేకే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

టీఆర్ఎస్ తేలుకుట్టిన దొంగలా ఎందుకుంది!

      టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశాంతంగా కూర్చోవడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణపై తీర్మానం అంటూ నిన్నటి వరకు రాద్దాంతం చేసి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా కూర్చున్నారని మోత్కుపల్లి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే. తారక రామారావు సెటిల్‌మెంట్ దందాపై కథనం రావడంతో టీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. కెటిఆర్ కోసం తెలంగాణవాదాన్ని పక్కన పెట్టారన్నారు.కెసిఆర్ కుటుంబం మరో నిజాంను తలపిస్తోందన్నారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు మరోసారి బయటపడిందన్నారు.చరిత్రలో ఏ ఉద్యమకారుడు అయినా ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్నారని, కెసిఆర్ మాత్రం ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు.

సోనియా తలుచుకుంటే తెలంగాణ: జానా రెడ్డి

      కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలుచుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికయినా ఇవ్వకతప్పదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతల సంతకాలు తీసుకున్నమని.. సంతకాలు పెట్టని వారి పేర్లు ఈ నెల 30న జరిగే నిజాం కళాశాల బహిరంగసభలో వెల్లడిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మూడున్నర కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే మూడున్నర కోట్ల జనం ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెంచాలని అధిష్టానాన్ని కోరామని అని తెలిపారు.

కేసీఆర్ ఆస్తులపై విచారణ జరపాలి: ఎర్రబెల్లి

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరిపించాలి. తెలంగాణ ప్రజలను రాజకీయ నేతలు మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు పెరిగిపోతున్నాయి” అని తెలంగాణ తెలుగుదేశం పోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, నేతల భూకబ్జాలు, సెటిల్ మెంట్లను వ్యతిరేకిస్తు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ రోజు గన్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సెటిల్ మెంట్లు చేస్తున్నాడని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ ధర్నా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆంధ్రజ్యోతి టిడిపి మానసపుత్రిక

        ఆంధ్రజ్యోతి తెలుగుదేశం మానసపుత్రిక అని, చంద్రబాబు కు ఆంధ్రజ్యోతి ఎంపీ వేమూరి రాధాకృష్ణ బినామీ అని, ఆయన అధికారంలోకి రావాలని రాధాకృష్ణ టీఆర్ఎస్ మీద బురద జల్లుతున్నారని, కనీసం కేటీఆర్ వివరణ తీసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనం ప్రసారం చేయడం జర్నలిజం విలువలకు వ్యతిరేకం అని టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆంధ్రజ్యోతి కథనం మీద ప్రభుత్వం స్పందించాలని, రాధకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన మీద ప్రసారం చేసిన కథనాలకు ఆధారాలు చూపాలని, లేదా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులలో టీడీపీ ధర్నా చేయడం విశేషం.

కాగితకు తప్పిన ప్రమాదం

      ఇంటింటా టిడిపి కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లిలో పాదయాత్ర చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాగిత వెంకట్రావు నీరసంతో కుప్పకూలిపోయారు. ఉదయం నుంచి హుషారుగా ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరించి సమస్యలు తెలుసుకున్న ఆయన ఎండా వేడిమికి నీరసపడ్డారు. చెక్కెర మోతాదు తగ్గిపోవడంతో పాటు రక్తపోటు అధికమవడంతో నడుస్తూనే బంటుమిల్లి జూనియర్ కళాశాల వద్ద రోడ్డుపై పడిపోయారు. పక్కనే ఉన్నవారు ఆయనకు నేలదెబ్బ తగలకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స చేశారు. ఆయన కోలుకున్న తరువాత మెరుగైన వైద్య చికిత్స కోసం మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రి కి తీసుకెళ్ళారు. ఆయన ఆరోగ్యం కుడుతపడే వరకూ ఆసుపత్రి లో ఉండాలని వైద్యులు సూచించారు. బంటుమిల్లిలో పాదయాత్ర చేస్తున్న కాగిత వెంకట్రావు దృష్టికి ప్రజలు అనేక సమస్యలు తీసుకొని వచ్చారు. తాగు నీటి సమస్య మీద ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు, డ్రైనేజీలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాది హామీ తదితదర అంశాలలో పిర్యాదులు అందాయి.

దేవినేని నెహ్రు ముందస్తు వ్యూహాలు

      2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటి చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రు). ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు డివిజన్ సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన ప్రజల వద్దకు నేరుగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు, రాజకీయవారసుడైన దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా బాద్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని అవినాష్, ఈరోజు ఇంటింటికీ కాంగ్రెస్ పథకాల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 18 డివిజన్లలో అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ''కృష్ణలంకలోని గంగానమ్మగుడి వద్ద నుంచి ఇంటింటికీ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుందని, శుక్రవారం నుంచి రోజు సాయంత్రం అయిదు నుంచి తొమ్మిది వరకూ ఆయా డివిజన్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని, మద్యలో తన తండ్రిని కలుస్తానని '' దేవినేని అవినాష్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ విషయంమై ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే గా వున్న యలమంచిలి రవి, మాజీ మంత్రి దేవినేని నెహ్రు మధ్య తీవ్ర పోటి నెలకొనివుంది. దీంతో టిక్కెట్ దక్కించుకోవడానికి దేవినేని నెహ్రు ముందస్తు వ్యూహాలు మొదలుపెట్టారు.

నిన్నహరీష్ రావు, నేడు కేటీఆర్!

  తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు పారిశ్రామిక వేత్తలనీ, వ్యాపారులని, సినిమా పరిశ్రమని బెదిరించి కోట్లు పోగేసుకొంటునట్లు ఇప్పటికే చాల కధనాలు విన్నాము. తెరాస నేత హరీష్ రావు పద్మాలయా స్టూడియో యాజమాన్యం నుండి రూ.80 లక్షలు వసూలు చేసాడని ఆ పార్టీనుండి బహిష్కరింపబడిన రఘునందన్ రావు ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు కే.తారక రామరావు పేరు ఇద్దరు ఆంధ్రా రియల్టర్ ల మధ్య సెటిల్మెంట్ వ్యవహారంలోబయటకి పొక్కింది.   ఈ కధ హైదరాబాదులో మొదలయ్యి ఒరిస్సా వరకు సాగి విశాఖలో ముగిసింది. ఆ కధ క్లుప్తంగా ఇలా సాగింది:   ఆంధ్రా ప్రాంతానికి చెందిన యన్.శ్రీనివాసరావు జూబిలీ హిల్స్ లో ఉన్న తన 1200గజాల స్థలాన్ని డెవెలప్ మెంటు కోసం సుబ్బారెడ్డి అనే మరో రియల్టర్ తో ఒప్పందం చేసుకొని రూ.5కోట్లు అడ్వాన్స్ పుచ్చుకొన్నాడు. అయితే, పీకలోతు అప్పులోకి కూరుకుపోయున్న శ్రీనివాస రావు ఆ స్థలాన్ని అంతకు ముందే మరొకరికి తాక్కట్టు పెట్టి దానిపై అప్పు తీసుకొన్నాడు. కానీ, ఈ విషయాన్నీ దాచిపెట్టి సుబ్బారెడ్డికి దానిని అంటగట్టడంతో సమస్య మొదలయింది.   శ్రీనివాసరావు రూ.5 కోట్లు వాపసు చేయలేనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంతో, సుబ్బారెడ్డి తనకు బాగా పరిచయమున్న కేటీఆర్ ను ఆశ్రయించాడు. కేటీఆర్ తనకు నమ్మిన బంటయిన సతీష్ రెడ్డిని పంపి శ్రీనివాసరావుని తన దగ్గిరకు రప్పించుకొన్నాడు. (డబ్బు వసూలు చేసేందుకు వారు తనను చితక బాదినట్లు శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.)   అయితే, శ్రీనివాసరావు దగ్గర డబ్బులేదనే సంగతి కెటీఆర్ కి కూడా అర్ధమయిన తరువాత, అప్పుడు శ్రీనివాసరావే వారికి ఒక బ్రహ్మాండమయిన ఆఫర్ ఇచ్చాడు. తాను ఒరిస్సాలో సుభాష్ అగర్వాల్ అనే కాంట్రాక్టర్ వద్ద సబ్ కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ రోడ్డు నిర్మాణం చేసానని, అందుకు గాను అతను తనకి రూ.100 కోట్లు బాకీ ఉన్నాడని, అది గనుక తనకి తిరిగి ఇప్పించగలిగితే, సుబ్బారెడ్డి దగ్గిర తీసుకొన్న రూ.5కోట్లే కాకుండా, భారీ కమీషన్ కూడా ఇస్తానని హామీ ఈయడంతో కేటీఆర్ కి ఆశపుట్టింది.   ఈ భారీ వంద కోట్ల వ్యవహారం తేల్చేందుకు తన అనుచరుడు సతీష్ రెడ్డిని, అతని అనుచరులను ఒరిస్సాకి పంపాడు. ఒరిస్సా వెళ్ళిన సతీష్ రెడ్డి అతని అనుచరులు సుభాష్ అగర్వాల్ ని శ్రీనివాసరావుకి ఈయవలసిన డబ్బుకోసం బెదిరించారు. అయితే ఆయన లొంగకపోవడంతో, ఆయనని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేసారు. కానీ, ఇది తెలుసుకొన్న ఒరిస్సా పోలీసులు వారిని జీపులలో వెంబడించి పట్టుకొన్నపటికీ, సుభాష్ అగర్వాల్ ఉన్న వ్యాన్ని మాత్రం పట్టుకోలేకపోయారు. అయితే వారు ఇచ్చిన సమాచారం ప్రకారం విశాఖ పోలీసులు, నగర శివారు ప్రాంతమయిన పెందుర్తి వద్ద వారిని వెంబడించి పట్టుకోగలిగారు. ఈ కధంతా జరిగి రెండు నెలలు పైనే అయింది.   అప్పటి నుండి శ్రీనివాసరావు, సతీష్ రెడ్డి, అతని అనుచరులు, అందరూ కూడా ఒరిస్సా పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. అయితే, కధ ఈవిధంగా అడ్డం తిరగడంతో కేటీఆర్ చల్లగా పక్కకు తప్పుకోవడంతో సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ విషయం బయట పెట్టారు.   ఈ కధనంతా బయట పెట్టిన ఆంధ్రజ్యోతి మీద, దాని యజమాని రాధాకృష్ణ మీద ఇప్పుడు తెరాసా నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్ పై జరుగుతున్న దాడి తెలంగాణా ఉద్యమంపై జరుగుతున్న దాడిగా వారు అభివర్ణిస్తున్నారు. తమపై చేసిన ఆరోపణలు కనుక ఋజువు చేయకపోతే రాధాకృష్ణను, ఆంధ్రజ్యోతిని కోర్టుకీడుస్తామని హెచ్చరించారు.