సుబ్బిరామిరెడ్డి వెనక్కి తగ్గినట్లేనా?

  రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన మీద లేనిపోని అభాండాలు వేసినందుకు రూ.5కోట్లకి పరువు నష్టం దావావేస్తానంటూ శివ తాండవం చేశారు. ఆ ప్రోగ్రాం తరువాత ఆయనకి లీగల్ నోటీసులు కూడా పంపడం జరిగింది. అయితే, ఆయన ఊహించినట్లు వెంకటేశ్వర రావు భయపడి క్షమాపణలు చెప్పకపోగా, సుబ్బిరామి రెడ్డి కోర్టుకి వెళ్ళదలిస్తే తనకేమి అభ్యంతరం లేదని, దాని వల్ల ఆయన గురించి మరిన్నినిజాలు బయటకి వస్తాయంటూ చెప్పడంతో రెడ్డి గారు గతుక్కుమన్నారు. కానీ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, సాటి కాంగ్రెస్ సభ్యుడు గనుక వెంకటేశ్వర రావుకి మరో పదిరోజులు గడువు ఇస్తున్నాంటూ తనకి క్షమాపణలు చెప్పడానికి గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇటీవలే ముగిసినప్పటికీ, రెడ్డిగారు పరువు నష్టం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. అసలే ఇది ఎన్నికల సీజను. పరువు నష్టమని కోర్టుకి వెళితే ఉన్న పరువు కూడా పోతుందని మరి వెనక్కి తగ్గారో ఏమో?

విజయమ్మకు షాకిచ్చిన తెలంగాణవాదులు

      తెలంగాణాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు తెలంగాణావాదులు షాకిచ్చారు. ఈ నెల 25 నుంచి విజయమ్మ తెలంగాణాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పర్యటనలో బాగంగా శుక్రవారం తెలంగాణ జిల్లాలకు వెళ్ళడానికి బయలుదేరారు. ఈ సమయంలో ఉప్పల్ బస్సు డిపో వద్ద తెలంగాణావాదులు ఆమె కాన్వాయి ని అడ్డుకొని తెలంగాణ నినాదాలు చేశారు. విజయమ్మ వ్యక్తిగత గత సిబ్బంది వాళ్ళను తప్పించేందుకు ప్రయత్నించగా, అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విజయమ్మ భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.

వరద బాధితుల బాధ వర్ణనాతీతం: చంద్రబాబు

      ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల బాధలు మాటల్లో చెప్పలేమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. వరద బాధితులను అదుకోవడానికి ఉత్తరాఖండ్ వెళ్ళిన చంద్రబాబు వారిని పరామర్శించారు. బాధితుల అనుభవాలను బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మీడియా తో మట్లాడుతూ...వరద బాధితులకు చాలా భయంకరమైన అనుభవాలు ఎదురైనాయని అన్నారు. పద్మా అనే మహిలా తన కళ్లముందే కుటుంబ సభ్యులు ఐదుగురు వరదలో కొట్టుకుపోతుంటే ఒంటరిగా మిగిలిన ఆమె బాధ వర్ణనాతీతం అని, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.   ఉత్తరాఖండ్‌లో ఒక చోట బాధితులు తిండి నీళ్లు లేక, బాతకాలి కాబట్టి తాము కట్టుకున్న బట్టలతో శవాలు పడిఉన్న నీటిలో బట్ట తడిపి ఆ నీటినే తాగామని తెలిపారని బాబు అన్నారు. మరో మహిళ తన కళ్లముందే తన కుమార్తె వరదలో కొట్టుకుపోయిందని వాపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఏపీ భవన్‌కు చేరుకున్న బాధితులకు అక్కడి అధికారులు సరైన సదుపాయాలు కల్పించలేదని, కనీసం స్నాన, భోజన వసతులు కూడా కల్పించలేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.  

కావూరిని హెచ్చరించిన సమైక్యాంధ్ర జెఎసి

      కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఈ రోజు తెలంగాణ పై చేసిన వ్యాఖల మీద సమైక్యాంధ్ర విద్యార్ధి జెఎసి నేతలు మండిపడుతున్నారు. కావూరి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. కావూరి వైఖరి మార్చుకోకపోతే అడుగడుగా నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే నెలలో సమైకాంద్ర కోసం ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసి పర్యటిస్తామని తెలిపారు.   మరోవైపు ఈరోజు ఉదయం తెలంగాణ అంశంపై అధిష్టాం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలలో రాజీపడక తప్పదన్నారు. కేంద్ర మంత్రిని అయ్యాక ఇంకా గ్రామ సర్పంచ్ స్థాయిలో ఆలోచించలేమని ఆయన తెలిపారు. పార్టీ నాయకత్వం బలపడాల్సిన అవసరం ఉందని కావూరి సాంబశివరావు పేర్కొన్నారు.

వైయస్సార్ సెంటిమెంటుతో తెలంగాణాలో విజయం సాధ్యమేనా

    తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నతెలంగాణా జిల్లాలలో, తెలంగాణా ప్రసక్తి ఎత్తలేని వైయస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అక్కడ నిలదొక్కుకోవడానికి వైయస్సార్ సెంటిమెంటుపైనే ముఖ్యంగా ఆధారపడి ఉంది. ఆయితే, దానిని కూడా చిరకాలం కొనసాగించడం కష్టమే. ఒకవైపు తెరాస అధినేత కేసీఆర్, వైయస్సార్ తమని ఏవిధంగా మోసం చేసింది ప్రజలకి విడమరిచి చెపుతుంటే, వైయస్సార్ చాలా మంచోడని వారికి నచ్చజెప్పడం అంత తేలికయిన విషయం కాదు. అయితే, త్వరలో జరగనున్న పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో గెలవాలంటే ప్రజలకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పుకోక తప్పదు.   ప్రస్తుతం తెలంగాణాలోపర్యటిస్తున్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైయస్సార్ పేరు ప్రస్తావిస్తూనే, జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా జైలులో పెట్టిందని, వచ్చే సాధారణ ఎన్నికలు కూడా పూర్తయ్యేవరకు జగన్నిఇంకా జైలులోనే ఉంచాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. తద్వారా, ఆమె ఇప్పుడు సానుభూతి సెంటిమెంటుని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తునట్లున్నారు.ఇక, ఆ తరువాత వరుసగా చంద్రబాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడంతో ఆమె ప్రసంగాలు ముగుస్తుంటాయి.   ప్రజలు ఆమె నుండి తెలంగాణ అంశంపై పార్టీ అభిప్రాయం ఆశిస్తుంటే, ఆమె చనిపోయిన తన భర్త గురించి, జైల్లో మ్రగ్గుతున్న తన కొడుకు గురించి మాత్రమే మాట్లాడుతుండటంతో, ఆమె సభలలో కొత్తగా చెప్పేదేమీ లేదనే సంగతి ప్రజలకి అర్ధం అయ్యింది. దానివల్ల నేతల ప్రోదబలంతో, జన సమీకరణ వల్ల వచ్చే ప్రజలే తప్ప స్వచ్చందంగా ఆమె సభలకి వచ్చే ప్రజలు కరువయ్యారు. అయినప్పటికీ, విజయమ్మ యధాశక్తిన తన పార్టీ నేతలని ఉత్సాహపరుస్తూ, పంచాయితీ ఎన్నికలలో విజయం సాధించాలని నూరిపోస్తున్నారు.   పార్టీ తరపున ప్రజలకి చెప్పుకోవడానికి బలమయిన పాయింటు ఒక్కటి కూడా లేకపోవడంతో, నేతలు మీడియా ముందు పడికట్టు పదాలను పేర్చుకొని ఉపన్యాసాలు చేస్తూ ఎలాగో నెగ్గుకొస్తున్నా, అంతిమంగా ఫలితాలు మాత్రం సానుకూలంగా రాకపోవచ్చునని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

ముంబై జైళ్లో అబూ సలేంపై కాల్పులు

      ముంబయి బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, గ్యాంగ్ స్టర్ అయిన అబూ సలెం మీద తోటి ఖైదీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అబూ సలెం చేతికి తీవ్ర గాయం అయింది. అబూ సలెం ప్రస్తుతం నవీ ముంబయిలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు. ఓ న్యాయవాది హత్య కేసులో ఉన్న నిందితుడుగా ఉన్న దేవేంద్ర జగ్ తప్ అనే ఖైదీ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. నిన్నరాత్రి 8.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. పోర్చుగల్ తో భారత్ కు ఉన్న ఒప్పందం మేరకు అక్కడ ఉన్న అబూ సలెంను 2005 లో భారత్ కు తీసుకువచ్చారు. 2010లో అబూ సలెం అర్ధర్ రోడ్ జైలులో ఉన్నప్పుడు కూడా తోటి ఖైదీ చేతిలో గాయపడ్డాడు. ఇప్పుడు రెండో సారి మళ్లీ దాడి జరిగింది. అసలు దేవేంద్రకు తుపాకి ఎలా చేరింది అన్నది విచారణ జరుగుతుంది.

సీడబ్ల్యూసీ నుంచి కావూరి తప్పుకోవడానికి కారణ౦?

      కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి హోదా నుంచి తప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశగా మారింది. సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితుని హోదా నుంచి తనను తప్పించాలని స్వయంగా కావూరే అభ్యర్థించారని, ఆయన అభ్యర్థనను అధినేత్రి సోనియాగాంధీ ఆమోదించారని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు.   కావూరి స్థానంలో వెంటనే షిండేను నియమించడం చూస్తే.. అధిష్ఠానమే ఆయనకు ఈ మేరకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యుసీలో ఒక తెలుగు నేతకు అవకాశం దొరికిందన్న సంతోషం చల్లారకముందే ఆయనను తప్పించడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణపై వర్కింగ్ కమిటీ తర్జన భర్జన పడే అవకాశమున్నందువల్లనే కావూరిని కొనసాగించడం సరైంది కాదని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. అయితే కావూరిని తొలుత సీడబ్ల్యుసీలోనే చేర్చుకోవాలని భావించారని, అనంతర పరిణామాల్లో ఆయనకు మంత్రిపదవి లభించడం వల్ల సీడబ్ల్యుసీ నుంచి తప్పించడమే సరైందని అనుకున్నారని, అందుకు ఆయన కూడా అంగీకరించారని విశ్లేషకులు చెబుతున్నారు.

తూచ్! మోడీ బాగానే పని చేసాడు

  పౌరుషానికి పోయేవాడు రాజకీయాలకి పనికిరాడు. ఛీ కొట్టిన వారిని కడుపు రగిలిపోతున్నా చిరునవ్వుతో కాగలించుకోగలగాలి, దోస్తీలను అవసరం తీరగానే కత్తిరించుకోగలగాలి.   ప్రధాని కావాలని కలలు కంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జాతీయ దృక్పధం కనబరచకుండా, ఉత్తరాఖండ్ బాధితులలో కేవలం గుజరాతీలనే ఆదుకొని తన సంకుచిత మనస్తత్వం ప్రదర్శించుకొన్నాడని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే, తన పార్టీ పత్రిక ‘సామ్నా’లో రెండు రోజుల క్రితమే మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మోడీ మాత్రమే ఒక్కరోజులో 15,000 మంది గుజరాతీలను రాష్ట్రానికి తరలించాడని ఆయన వందిమాగాదులు చేసిన ప్రచారాన్నికూడా ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు.   అయితే, ఇది జరిగిన రెండు రోజులకే మోడీ మహారాష్ట్ర పర్యటనకు రావడం, తనని ప్రసన్నం చేసుకొనేందుకు ఆయనే స్వయంగా ముంబైలో తన ‘మాతోశ్రీ’ కి వచ్చి కలవడంతో, ఉద్దావ్ థాకరే అభిప్రాయలు ఒక్కసారిగా మారిపోయాయి. తానూ మోడీని విమర్శించలేదని, ఆయన చేపడుతున్న సహాయ చర్యల గురించి, జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే ఖండిస్తూ వ్రాయడం జరిగిందని ఆయన సంజాయిషీ ఇచ్చుకొన్నారు. ఇక, మోడీ కూడా తనను తూర్పారబట్టిన ఉద్దవ్ థాకరే మద్దతు తన కలలు సాకారం చేసుకోవడానికి ఎంతయినా అవసరమని గ్రహించడం చేత, మొహమాటపడకుండా వెళ్లి ఉద్దవ్ ధాకరేని కలిసి వచ్చారు. ప్రస్తుతానికి ఇద్దరూ గుజరాతీ, మరాటీ భాయి భాయి అనుకొంటూ ఒకరినొకరు బాగానే కాగలించుకొన్నపటికీ ఆ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందో చూడాలి.

చిరంజీవి..నేను కాంగ్రెస్ నేతల౦: రామచంద్రయ్య

      మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి, తాను కాంగ్రెస్ పార్టీ నేతలమని..తమకంటూ సొంత అభిప్రాయాలు ఉండవని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. రాయల తెలంగాణ వాదన అర్థం పర్థం లేనిదిగా ఆయన కొట్టిపారేశారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. మరో వైపు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పిసిసి అద్యక్షుడు బొత్స ఉత్తరాఖండ్ వెళుతున్నారు. అక్కడ వరదబాదితులకు అవసరమైన సహాయ, సహకారాలపై వారు సమీక్ష చేయనున్నారు. తెలుగువారిని ఆదుకునే విషయంలో ఉత్తరాఖండ్ లో వివక్ష చూపుతున్నారని కేంద్ర హోం మంత్రి షిండే కి చిరంజీవి ఫిర్యాదు చేశారు. కొందరు టూర్ ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని,అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  

రాయల తెలంగాణ: మండిపడుతున్న నేతలు

      అధిష్టానం రాయల తెలంగాణ ఆలోచన చేస్తుందనే విషయం తెలియడంతో నేతలు అందరు ఒక్కటిగా భగ్గుమంటున్నారు. రాయల తెలంగాణ అంటే తాము నిరవధిక ఆందోళన చేస్తామని, తెలంగాణ ఇవ్వకుండే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణపై సోనియా మభ్యపెడుతున్నారని, ప్యాకేజీలు, రాయల తెలంగాణతో మోసం చేయాలని చూస్తే తరిమి కొడతారన్నారు. పంచాయతీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకే ఈ జిమ్మిక్కులు అన్నారు. తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెసు నేతలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తాము రాయల తెలంగాణకు వ్యతిరేకమని, ఈ ప్రతిపాదన తమ పార్టీని దెబ్బతీసేందుకేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగి రెడ్డి అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ తో సాధ్యం: జానా

      కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసం తనకు వుందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, అవసరమైతే కటిన నిర్ణయాలకు తీసుకొనేందుకు సిద్దమవుతామని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగసభ ఉద్దేశమని జానారెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానానికి తెలంగాణపై ఎన్నో విజ్ఞప్తులు చేశామని ఆయన చెప్పారు. పార్లమెంటులోనూ శానససభలోనూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేశామని ఆయన అన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, కాంగ్రెసు ద్వారానే తెలంగాణ సాధ్యమని చాటాలని ఆయన అన్నారు. రాయల తెలంగాణ, తెలంగాణ ప్యాకేజీలపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.

రుషికేష్ కి వెళ్ళిన వైకాపా నేతలు

    ఉత్తరాఖండ్ లో వరద రాజకీయాల్లో ఇప్పుడు జగన్ పార్టీ నేతలు కూడా పాలుపంచుకుంటున్నారు. వరద బారిన పడిన తెలుగువారిని పరామర్శించడానికి వైకాపా నేతలు డెహ్రాడూన్, రుషికేష్ కి వెళ్ళారు. రుషికేష్ వద్ద హిమాలయన్‌ ఆస్పత్రిలో చికిత్స తెలుగు వారిని జగన్ పార్టీ నేతలు ఎమ్.వి.మైసూరారెడ్డి గొల్లబాబురావులు పరామర్శించారు. ఉత్తరాఖండ్ లో వైకాపా వైద్య విభాగం సేవలు అందిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ వరద లో చిక్కుకుని, బతుకు జీవుడా అని సైన్యంతో రక్షింపబడి.. సొంతూర్లకు వెళ్ళాల్సిన వరద బాధితుల్ని తమ విమానాల్లో ఎక్కించేందుకు టిడిపి, కాంగ్రెస్ నేతలు పోటిపడుతున్నారు.

బ్రాహ్మణి భూములు ప్రభుత్వ స్వాదీనం

  బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు గత ప్రభుత్వం కేటాయించిన భూములను స్వాదీనం చేసుకొంతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ రోజు ఆ కార్యక్రమం మొదలయింది. కడప జిల్లా జమ్మలమడుగులో బ్రహ్మణికి కేటాయించిన 10,600 ఎకరాల భూమి కొలతలు తీసుకొనేందుకు జిల్లా కలెక్టర్‌ అనుమతి ఈయడంతో ఆర్డీవో రఘునాధ్‌రెడ్డి తన రెవెన్యూ సిబ్బందితో కలిసి కొలతలు తీసుకోవడం ప్రారంభించారు. త్వరలో ఆ పని పూర్తిచేసి నివేదికను తన పై అధికారులకు పంపుతానని ఆయన తెలిపారు. ఈ విషయంపై వైకాపానేతలు కానీ, గాలి జనార్ధన్ రెడ్డికి సంబందించిన వ్యక్తులు గానీ మీడియాతో మాట్లాడే పరిస్థితిలో లేరు. అందువల్ల రెవెన్యు సిబ్బంది పని కొంచెం తేలికయింది.

కొరివితో తల గోక్కొంటున్న శంకరావు

  ఊరికే కూర్చొన్నోడు ఊసుపోక పేడ తీసి వాసన చూసినట్లు, మంత్రి పదవి ఊడగొట్టున్నశంకర్ రావు ఊసిపోక ముఖ్యమంత్రి మీద, డీజీపీ దినేష్ రెడ్డి మీద అధిష్టానానికి లేనిపోని చాడీలు వ్రాయడం మొదలుపెట్టారు. గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారంలో అరెస్టు తరువాత ఆయన తన పరిస్థితిని అర్ధం చేసుకొని తగ్గకపోగా, తన నోటికి మరింత పదును పెట్టారు. ఆయన దినేష్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడా బెట్టాడని ఆరోపణలు చేయడమే కాకుండా, దానిపై సీబీఐ విచారణ కూడా జరిపించాలని డిమాండ్ చేసారు.   ఆయన నోటి దురదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది. ఒకవైపు గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం భూతంలా వెంటాడుతుంటే దానిని నుండి బయటపడక ముందే, తన ఆరోపణలతో మరో కొత్త కేసులో ఇర్రుకొన్నారు. నిన్న సైఫాబాద్ పోలీసులు ఆయనని దాదాపు ఆరు గంటలు ప్రశ్నించారు. గత అనుభవం దృష్టిలో ఉంచుకొని, పోలీసులు వైద్యులను ఒక అంబులెన్స్ ను కూడా సిద్ధంగా పెట్టుకొని, ముందుగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతనే ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలీసులు తనని బాధిస్తున్నందుకు నిరసనగా శంకరావు మూతికి నల్లగుడ్డ కట్టుకొని విచారణకు హాజరయ్యారు. అయితే ఆ విచారణలో ఆయన దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఎటువంటి ఋజువులు చూపించలేకపోయారని ఇన్స్పెక్టర్ వీ.ఉమేందర్ స్పష్టం చేసారు. అందువల్ల పోలీసులు ఈ రోజు కూడా మళ్ళీ విచారణకు హాజరవవలసిందిగా ఆయనను ఆదేశించారు.   కానీ, శంకరరావు తనకలవాటయిన ఎత్తుగడ వేసారు. నిన్న సాయంత్రమే ఆయన కేర్ ఆసుపత్రిలో చేరిపోయి, ‘తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తానూ విచారణకు హాజరు కాలేనని, అవసరమయితే పోలీసులే వైద్యుల సమక్షంలో ఆసుపత్రిలో విచారణ చేసుకోవచ్చునని’ ఆయన తన కుమార్తె సుష్మిత చేత ఒక లేఖ వ్రాయించారు. ఇప్పుడు ఆయన పోలీసుల నుండి తప్పించుకోవాలంటే కేర్ ఆసుపత్రే శరణ్యం అవుతోంది. వృద్దాప్యం మీద పడిన తరువాతయినా నోటిని అదుపులో పెట్టుకొని ఉండి ఉంటే ఆయనకు ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉండేవి కావు.

చెక్ బౌన్స్ కేసులో జీవిత రాజశేఖర్

      జీవిత, రాజశేఖర్ దంపతులు చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నారు. ఈ మేరకు సెప్టెంబరు 20వ తేదీని కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు వారిద్దరికి ఆదేశాలు జారీచేసింది. పరంధామ రెడ్డి అనే వ్యక్తి వద్ద సినీ నటి జీవిత రూ.34 లక్షలు అప్పుగా తీసుకుంది. ఈ మేరకు ప్రామిసరి నోటుతో పాటు రెండు చెక్కులు కూడా ఇచ్చింది. ఈ మొత్తం చెల్లించకపోవడంతో రెండు చెక్కులను పరంధామ రెడ్డి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అందులో డబ్బులు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. ఫిర్యాదును పరిశీలించిన 7వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్టేట్ చెల్లని చెక్కు కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని జీవితా రాజశేఖర్‌ను ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీ చేసింది.

దిగ్విజయ్ అలా ఎందుకన్నారు?

      ఒక వైపు రాయల తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వడం ఖాయం అని జోరుగా ప్రచారం జరుగుతోన్న నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ మాత్రం తెలంగాణ పై నిర్ణయం ఎప్పుడు అనేది చెప్పలేనని అంటున్నారు. అయితే తెలంగాణ పై ఎప్పటికి నిర్ణయం తీసుకుంటామనేది చెప్పలేమని ఆయన అనడం ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణపై అనేక డెడ్‌లైన్లు పెట్టామని, తాను కూడా అలా డెడ్ లైన్ పెట్దదలచుకోలేదని ఆయన స్పష్టం చేయడం ఆసక్తికరంగా ఉంది. తెలంగాణపై తమకంతా తెలుసని, అయితే, నిర్ణయం ఎప్పుడొచ్చేదీ తాను చెప్పలేనన్నారు. ఎప్పుడు నిర్ణయం వస్తుందో చెప్పలేననడం ద్వారా దిగ్విజయ్ సింగ్ ఇప్పటికిప్పుడు తేలదని చెబుతున్నారా?

తెలంగాణ జేఏసి ప్రజాకోర్టు

      ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో కీలక చర్చలు జరుతున్నాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలంగాణ జేఏసి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 29న మాసబ్‌ట్యాంక్‌లో ప్రజా కోర్టును నిర్వహించనున్నామని కోదండరామ్‌ చెప్పారు. జూలై 4, 5 తేదిల్లో ఢిల్లీలో జాతీయ పార్టీలతో కలిసి తెలంగాణపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు కూడా ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని రకాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీల ఆశ చూపి తెలంగాణ రాష్ట్ర ఏర్పా టును పక్కకు పెట్టాలని చూస్తోందని, ఎటువంటి ప్యాకేజీలకు ఒప్పు కొనేది ప్రశ్నే లేదని, హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణకు మాత్రమే తాము అంగీకరిస్తామని, రాయల తెలంగాణకో, ప్రత్యేక ప్యాకేజీలకో ఒప్పుకునే సమస్యలేదని స్పష్టంచేశారు.

శాస్త్రం ఒప్పుకోదు మరి, అయినా తప్పలా ఆ జీవికి

  సాధారణంగా మన తెలుగువారు ఎవరయినా చనిపోయిన వారింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి నేరుగా మళ్ళీ తమ ఇంటికే వెళ్లి శుద్ధిస్నానం చేసిన తరువాత గానీ మరెవరి ఇళ్ళకు వెళ్లరు. అయితే, ఈ సాంప్రదాయం మరి అధికారిక కార్యక్రమాలకు కూడా వర్తిస్తుందో లేదో మన చట్టాలలో వ్రాయడం మరిచిపోయారు మన రాజ్యాంగనిర్మాతలు. ప్రత్యేక విమానం వేసుకొని, నేలమీద ఎక్కడా కాలుపెట్టకుండా ఆకాశంలో గిరగిరా తిరిగేస్తూ, దేశ సేవలో, ప్రజాసేవలో నిమగ్నమయిపోయిన మన కేంద్రమంత్రి గారు చిరంజీవిగారు, ఉత్తరాఖండ్ వరదలలో చిక్కుకొని చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఓదార్పు కార్యక్రమాన్ని తన డైరీలో చూసుకొన్న వెంటనే, ఒక ప్రత్యేక విమానం వేసుకొని హడావుడిగా గన్నవరం విమానశ్రయంలో వాలిపోయారు.   వారిని ఒదార్చేసిన తరువాత, వెంటనే గుంటూరు వెళ్లి అక్కడ వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఒక శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన అమృత హస్తలతోనే చేయవలసి ఉంది. అయితే, ఇక్కడే ఆయన ఓదార్పు యాత్రకి శాస్త్రం అడ్డుపడింది. అటువంటి కార్యక్రమాలకి హాజరయిన తరువాత, ఎంత పట్టుపంచె కట్టుకొని, ఉత్తరీయం కప్పుకొని వెళ్ళినా శుభమా అంటూ వెళ్లి కొబ్బరి కాయలు కొట్టవచ్చునా? అనే ధర్మసందేహం మంత్రి కన్నావారికి కలగడంతో, ఆయన అదే విషయాన్నిచిరు చెవిలో ఊదేసరికి, మరో ఆలోచన చేయకుండా అయితే ‘ప్రోగ్రాం క్యాన్సిల్!’ అనేసి మళ్ళీ ప్లేను ఎక్కేయబోయారు. కానీ, ఆయన ఓదార్పుకోసం అక్కడ బాధితులు అందరూ కడుపులోదుఃఖము ఉగ్గబట్టుకొని ఎదురు చూస్తున్నారని, ఆయన వెళ్ళకపోతే వారు ఇంకా చాలా దుఃఖపడిపోతారని విజయవాడ శాసన సభ్యుడు మల్లాది విష్ణు చెప్పడంతో, పెదమంత్రిగారి మనసు చెరువయిపోయింది.   అయితే శాస్త్రం ఒప్పుకోక పోవడంతో దానిలో ఏమయినా యమండ్మెంట్స్ ఉన్నాయోమో అని అందరూ కొంత సేపు తర్జనబర్జనలు పడ్డారు. అయితే, కలియుగంలో ఒకానొక పెదమంత్రిగారికి ఇటువంటి సమస్య తలెత్తుతుందని మన పెద్దలు ముందే ఊహించలేకపోవడంతో, పర్టిక్యులర్ గా అటువంటి క్లాజులు ఏమి వ్రాసిపెట్టలేదు.   శాస్త్రం లోతుపాతులు తెలియకపోయినా సంప్రదాయంలో ఉన్న వెసులు బాటు గుర్తుకు వచ్చిన చిన మంత్రిగారు, ఒక లాజిక్ చెప్పారు. “పోయినవారందరూ చనిపోయినవాళ్ళు కాదు. వారు కనబడకుండా పోయారంతే!” అధికారులు చెప్పిన ఆ పాయింటు వరకే మనం స్వీకరించినట్లయితే మనకిక ఏ శాస్త్రం అడ్డుతగలదని భేషయిన ఆలోచన చెప్పడంతో, పెదమంత్రిగారి కంట ఉత్తరాఖండ్ వరద నీటిలా కన్నీళ్లు పొంగుకొచ్చేసాయి. అంతే! ఒక ఉదుటన మూడు మెట్ల చొప్పున ప్లేను లోంచి దూకేసి మళ్ళీ ఓదార్పుయాత్రకి సిద్దమయిపోయారు.   మనవి: మంత్రిగారి ఈ ఓదార్పుయాత్రని, జగన్ మోహన్ రెడ్డి ఓదార్పుయాత్రతో ముడిపెట్టి, ‘జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి కుమ్మక్కు’ అని నీలపనిందలువేయవద్దని తెదేపా సభ్యులకు మనవి.