తెలంగాణా కబుర్లు
posted on Jun 26, 2013 @ 2:02PM
రాజకీయ వర్గాలలోను, మీడియాలోనూ తెలంగాణా అంశం ఇక క్లైమాక్స్ వచ్చేసినట్లు చాలా హడావుడి జరుగుతోంది. డిల్లీ నుండి రోజూ కొత్త కొత్త కాంబినేషన్లతో ప్యాకేజీలు వెలువడుతుంటే, దానిపై రాష్ట్రంలో మేధావులు బుర్రలు బ్రద్దలుకొట్టుకొని దానిలో పరమార్ధం కనిపెట్టేపనిలో పడ్డారు.
ఈ రోజు, తాజాగా విడుదలయిన ప్యాకేజీలో హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఏర్పాటు చేసేసి, తెరాస నేతలు సలహా ఇచ్చినట్లు ఆ ప్యాకేజీ ఏదో సీమంద్రాకే ఇచ్చేస్తే ఎలా ఉంటుందని? అని ఒక సరికొత్త ఐడియా కాంగ్రెస్ పెద్దల బుర్రలో వెలిగినట్లు మీడియా కనిపెట్టేసింది.
ఇక, ఆవిధంగా చేసేసి, ఆడిన మాట తప్పని సత్య హరిశ్చంద్రుడి వంటి కేసిఆర్, తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తాడా లేదా అనే ధర్మ సందేహం కలగడంతో, ఇటువంటి బాక్ డోర్ సంప్రదింపులకు తెరాస ఇన్-చార్జ్ గా బాధ్యతలు చెప్పటిన కేశవ్ రావుని కాంగ్రెస్ పెద్దలు కాంటాక్ట్ చేసారుట! అదే బెటరని ఆయన కేసీఆర్ కి నచ్చజెప్పబోతే, ఎప్పుడో ఏడాది క్రిందట పండుగ సందర్భంగా ఇచ్చిన బంపర్ ఆఫర్ ను కాదన్న వాళ్ళు,మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు దగ్గిరపడిన తరువాత అడిగితే కుదరదని, కావాలనుకొంటే ఎన్నికల పొత్తులలకి తమని కాంటాక్ట్ చేసుకోమని కేసీఆరే స్వయంగా హాట్ లైన్లో సోనియమ్మకు తెగేసి చెప్పేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్ మాటలని నమ్మి అంత రిస్క్ తీసుకొనే సాహసం చేయలేకపోతున్నారుట. ఇచ్చేస్తే ఇక్కడ తెరాస, అక్కడ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ కొంప కొల్లేరు చేసేస్తారని చిలకల సమాచారం. అందువల్ల తెలంగాణా కాంగ్రెస్ నేతలను నమ్ముకొని తెలంగాణా ఇచ్చేస్తే వారు గనుక కేసీఆర్ ధాటికి తట్టుకోలేక, సరిగ్గా ఎన్నికల సమయంలో హ్యాండ్స్-అప్ చేసేస్తే కాంగ్రెస్-పుట్టి మునిగిపోతుందని ఆందోళన చెందుతూ, ఏమి చేయాలో పాలుపోక, మళ్ళీ కోరు కమిటీ రూములోకి వెళ్లిపోయి తలుపులు వేసుకొని మరో కొత్త ఐడియా కోసం బుర్రలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు...ట!