టీ-కాంగ్రెస్ నేతల సభ ఏమి సాధిస్తుంది
posted on Jun 25, 2013 @ 9:17PM
కాంగ్రెస్ అధిష్టానంతో తెలంగాణా అంశంపై రెండు రోజులు తీవ్ర మంతనాలు జరిపి నగరానికి తిరిగి వచ్చిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్, పార్టీ అధిష్టానం తెలంగాణా ఇస్తుందో లేదో, అసలు తెలంగాణపై పార్టీ ఆలోచనలు ఏమిటో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని చెపుతూనే, మరో వైపు తమ పార్టీ తెలంగాణా ఇస్తుందని ఆశిస్తున్నట్లు కూడా చెప్పడం విశేషం. పైగా, ఆయన రేపు 30వ తేదీన జరిగే టీ-కాంగ్రెస్ నేతల సభ విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నట్లు చెపుతూ, తానూ కూడా ఆ సభలో పాల్గొంటానని చెప్పారు.
డీ.యస్. మాటలను బట్టి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ తెలంగాణా అంశంపై నాన్పుడు ధోరణి అవలంభించేందుకే మొగ్గు చూపుతున్నట్లు అర్ధం అవుతోంది. అదే జరిగితే, తాము రాజకీయాలలో కొనసాగడం కష్టమని సున్నితంగా ఆయన తన మనసులో మాటను తెలియజేసారు.
రేపు 30వ తేదీన జరిగే టీ-కాంగ్రెస్ నేతల సభ వల్ల అసలు ఏమయినా ప్రయోజనం ఉంటుందా అంటే అనుమానమే. ఎందుకంటే, పార్టీ యంపీలు పార్లమెంటు మెట్ల మీద రెండు రోజులు పడిగాపులు కాసినప్పటికీ, ముగ్గురు నేతలు పార్టీ వీడి తెరాసలో చేరినప్పటికీ పట్టించుకోని అధిష్టానం ఇప్పుడు ఈ తాటాకు చప్పుళ్ళకి బెదరదని ఖచ్చితంగా చెప్పవచ్చును.
టీ-కాంగ్రెస్ నేతలకు పదవీ లాలస, టికెట్స్ యావ ఉన్నంత కాలం వారు తన పెరట్లో కుందేళ్ళ వంటి వారని కాంగ్రెస్ అధిష్టానం నిశ్చితాభిప్రాయం. అదే మాటను తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల, టీ-కాంగ్రెస్ నేతలు తమ ఈ బలహీనతలను పక్కన బెట్టి తెలంగాణా కోరినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం కూడా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ, పార్టీ గనుక తెలంగాణా ప్రకటన చేయకపోతే, టీ-కాంగ్రెస్ నేతలందరూ కూడా రానున్న ఎన్నికలలో పోటీ చేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తే బాగుంటుందని చేసిన ప్రతిపాదనకు, అది ఆచరణలో అమలు చేయడం అసాధ్యమని, అందువల్ల ఈవిషయంలో ఎవరికీ వారు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవలసిందేనంటూ మంత్రి జానారెడ్డి వెంటనే టకీమని జవాబు చెప్పడం గమనిస్తే, వారి బలహీనతలు అర్ధం అవుతుంది.
ఇటువంటి పరిస్థితిలో వారు పెట్టుకొనే సభలు సమావేశాలు, ప్రజలను మభ్య పెడుతూ ఎన్నికలదాకా కాలక్షేపం చేయడానికి, తెరాస దాడుల నుండి తమను తాము కాపాడుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనం కొరకు కాదని చెప్పవచ్చును. ఇక, కాంగ్రెస్ అధిష్టానం కూడా వారి నుండి సరిగ్గా ఇటువంటి టైం పాస్ ఆలోచనలనే కోరుకొంటోందని చెప్పవచ్చును.