ఏ ఎండాకా గొడుగు పట్టాలి మరి

  మంత్రి పదవి ఇవ్వనంత వరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని దుమ్మెత్తిపోసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దద్దమ్మ ప్రభుత్వంగా వర్ణించి, కొల్లేరు సమస్య పట్టుకొని కాంగ్రెస్ కొంప కొల్లేరు చేస్తానని బెదిరించి, సమైక్యాంధ్ర కోసం అవసరమయితే ఒక కొత్త పార్టీ పెట్టయినా కాంగ్రెస్ భరతం పడతానని ప్రగల్భాలు పోయిన ఏలూరు యంపీ కావూరి సాంబశివరావు, ఇప్పుడు తను కోరుకొన్నట్లుగానే కేంద్రంలో మంత్రి పదవి దక్కగానే, స్వరం మార్చి కొత్త పల్లవి అందుకొన్నారు.   నిన్న డిల్లీ నుండి హైదరాబాదుకి తిరిగి వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక తెలంగాణ విషయంలో రాజీ పడక తప్పదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పైగా జీవితమంటేనే అనేక రాజీలు పడటం అని, అందులో ఇదీ ఒకటని మెట్ట వేదాంతం కూడా జోడించారు. అయితే రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయంలో తేడా లేదని, తన అభిప్రాయలు అధిష్టానానికి స్పష్టంగా తెలియజేసానని, కానీ, కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటానని చెప్పారు."   ఒకవైపు కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెపుతూనే మరో వైపు మంత్రి పదవుల కోసం కక్కుర్తిపడి తానూ మాట మార్చే వ్యక్తిని కాదని చెప్పడం విశేషం. తెలంగాణ విషయంలో రాజీ ధోరణి అంటే దాని అర్ధం తెలంగాణకు అనుకూలమని కాదని వివరించారు. కేంద్ర మంత్రిగా ఉన్న తను ఇప్పుడు సమైక్య సమావేశాలు, సభలకు హాజరుకాకపోవచ్చునని కూడా చెప్పారు. తానెన్నడూ కొత్త పార్టీ పెడతానని అనలేదని, అదంతా మీడియా ఊహాగానాలేనని” ఆయన అన్నారు.   కావూరి తన రాజకీయ అనుభవం అంతా రంగరించి తికమక సమాధానాలు చెప్పి అటు తెలంగాణా, ఇటు సమైక్యాంధ్ర నేతలని ఇద్దరినీ మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఆయన మాటల ప్రకారం చూస్తే, ఆయన తెలంగాణా ఏర్పాటుని స్పష్టంగా వ్యతిరేఖిస్తున్నారని అర్ధం అవుతోంది. కానీ, కేంద్ర మంత్రి పదవి దక్కినందువల్ల, అధిష్టానానికి విభజనపై తన అభ్యంతరాలు చెప్పి, అంతిమ నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానానికే వదిలేసినట్లు అర్ధం అవుతోంది.

ఉప్పల్ వైఎస్ఆర్ ఆత్మహత్య

      ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజారెడ్డి మనవడు, కాంగ్రెస్ నేత యంజాల శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య ఉప్పల్ లో సంచలనం రేపుతోంది. రామాంతపూర్ కార్పోరేటర్ జగదీశ్వర్ రెడ్డి మీద హత్యాయత్నం కేసులో అరెస్టయిన ఆయన ఇటీవలె బెయిలు మీద విడుదలయ్యారు. తనను హత్యాయత్నం కేసులో అక్రమంగా ఇరికించి అవమానించారన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. తన సూసైడ్ నోట్ లో ఉప్పల్ ఏసీపీ హత్యాయత్నం కేసు నుండి తప్పించడానికి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొనడం కలకలం రేపుతోంది. రాష్ట్ర మాజీ హోంమంత్రికి ఆయన అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ హయాంలో ఉప్పల్ వైఎస్ఆర్ గా శ్రీధర్ రెడ్డి అందరికీ సుపరిచితుడు.

కర్మ యోగి దార్శనికుడు పీవీ నరసింహ రావు జయంతి !

గోపి చిల్లకూరు.డల్లాస్ టెక్సాస్       భారత దేశం ఆర్దిక పునర్నిర్మాణంలో బాగంగా దేశానికీ తనదైన శైలిలో సేవచేసిన అపర చాణక్యుడు, లోపలి మనిషి, కర్మ యోగి పీవీ నరసింహరావు ను అయన జయంతి సందర్బముగా అందరు తలచుకోవలసిందే !.   1991 లో రాజీవ్ గాంధీ శ్రీ పెరంబుదూర్ లో దుర్మరణం అయిన కూడా ,ఆ సానుభూతి పవనాల్లో కూడా కాంగ్రెస్ కి తగిన సీట్లు రాలేని పరిస్తితుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్వంత పార్టీ లోని ప్రముఖులు అయన పై అసమ్మతి లేపి ప్రతి దినము ఆయనను ఇరుకున పెడుతున్నా కాని ,ఇండియా ఆర్దిక పరిస్థితి ఘోరంగా ఉండి చివరకు భారత దేశం బంగారు ను ప్రపంచ విపణి లో కుదువ బెట్టాల్సి వచ్చిన కష్ట సమయములో తన చాణక్య నీతిని ప్రదర్శించి మెజారిటీ లేని ప్రభుత్వానికి ప్రధాన మంత్రిగా ఉంటూ ,ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కొన్ని తప్పులు విధి లేక చేయాల్సి వచ్చిన కూడా దేశంను సరళీకృత ఆర్దిక సంస్కరణల ద్వార అప్పుల వూబి నుంచి బయట పడవేయడం లో అయన సామర్ద్యం అమోఘ మయినది !.   1) పంజాబ్ లోని తీవ్ర వాదాన్ని ఉక్కు పాదముతో అణచివేశారు,ఖలిస్తానుఉద్యమాన్ని తోక్కేసారు.terrorism దాడిలో ఒక కాలు పోగొట్టు కున్న జాతీయ వాది బిట్టా (Maninderjeet Singh Bitta )ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నిలబెట్టి పంజాబ్ ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు ! .ఇప్పుడు ఆ బిట్టా ను సోనియా కాంగ్రెస్ తొక్కేసింది .http://en.wikipedia.org/wiki/Maninderjeet_Singh_Bitta)   2)   మన్మోహన్ సింగ్ ను ఆర్దిక మంత్రిగా అవకాశం ఇచ్చి,తను వెనుక నుండి నడిపిన  సరళీకృత ఆర్దిక సంస్కరణ లు   దేశాన్ని గాడి లో పెట్టగలిగారు ! . ఇప్పుడు ఇదే మన్మోహనుడు అత్యంత విపలమయిన ప్రధానిగా పేరు తెచ్చుకొన్నారు .   3) ప్రతి పక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయీ గారిని తన గురువు గా ప్రకటించి అయన ద్వార తానూ ఎంతో ఉత్తేజం పొందానని పార్ల మెంటు సమక్షములో ఒప్పుకొని వాజ్ పాయి గారికి బెస్ట్ పార్ల మెంటు అవార్డు ఇచ్చినది మనకందరికీ తెలిసిందే !         4) కాంగ్రెస్ లోని అర్జున్ సింగ్ ,ఎన్ డీ తివారి,ముపనార్  లాంటి నాయకులను తట్టుకొని వాళ్ళను దమ్మిలు చేయగలిగారు !      5) ఆయన విపరీతమైన ఆందోళనకు గురి అయినప్పుడు పాత తెలుగు సినిమాలు చూస్తూ ,ముక్యముగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హాస్యపు మూవీ లు చూసి రిలాక్స్ అయ్యే వారని ఆయనే స్వయముగా ప్రకటించారు.        6) గోవధ పై నిషేధం ఇవ్వాలని BJP  పోరాడుతున్నప్పుడు  కాంగ్రెస్ ప్రముఖులు ఒట్టిపోయిన  ,వయసు అయిపోయిన పశువులను పశువుల వధ శాలకు పంపాల్సిందే అని అంటే అప్పుడు  ఆ ఉద్యమం లో పోరాడుతున్న BJP సన్యాసిని సాద్విరితంబర గారు పీవీ నరసింహరావు గారు కూడా ముసలి వారు అయ్యారు కాబట్టి ఆయనను కూడా వధశాలకు పంపాల్సిందే అని అంటే అ కర్మ యోగి నిజమే కదా అని ఎంతో నవ్వుకొన్నారట .        7)  ఎన్ టీ రామరావుగారు తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని పోటి పెట్టకుండా పీవీ నరసింహ రావును పార్లమెంట్లో అత్యదిక మెజారిటీ తో గెలిపించి పంపితే, మళ్ళీఅదే పీవీ గారు తన ప్రభుత్వం పడి పోయే సమయం లో తెలుగు దేశం ఎంపీ లను చీల్చి ప్రభుత్వాన్ని కాపాడుకొన్నారు .          8) హర్షద్ మొహతా కోటి రూపాయలు సూట్ కేసు విషయంలో, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను కొనడంలో ఎన్నో విమర్శలకు గురి అయినప్పటికీ అన్ని కూడా రాజ్యాన్ని కాపాడుకోడానికే చేసాడు కాని అయన స్వంతానికి ఏమి వాడు కోలేదు .          9) పీవీ  స్వయానా AICC ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన సీతారం కేసరి సోనియా గాంధి కోటరితో పీవీ నరసింహ రావు గారికి ఎంతో వ్యతిరేకముగా పని చేసి చివరికి పీవీకి ఎన్నికలలో టికెట్ కూడా రాకుండా చేసారు. ఆ తరువాత అవమాన పరిస్థితుల్లో కేసరి అదే సోనియా గాంధి కోటరి దెబ్బకు హీనంగా AICC నుంచి గెంటి వేయబడ్డాడు !          10) శ్రీ రామ తీర్తుల వారి రచనలు ద్వార ఉత్తేజం పొందిన పీవీ ,స్వతంత్ర సమరయోదుడుగా ఉస్మానియా యూనివేర్సిటి లో అప్పట్లో నిచేదించిన వందేమాతరం  ఆలకించి యూనివెర్సిటీ నుంచి సస్పెండ్ అయినారు . ఎన్నో భాషలతో మమేకం అయ్యారు . పీవీ అయన చరిత్రను "లోపలి మనిషి " (the Insider )అని పుస్తకము వ్రాసారు.విశ్వనాధ సత్యనారాయణ గారి  వేయి పడగలు అనే పుస్తకాన్ని sahasraphan అని హిందీ లోకి అనువదించారు .              11)అబ్దుల్ కలాం గారు పీవీ గురించి మాట్లాడుతూ "గొప్ప రాజనీతిజ్ఞుడు అయన రాజకీయ వ్యవస్థ కంటే   కూడా దేశం అన్నిటికన్నా గొప్పది అని నమ్మి ఆచరించిన వారు అంటారు.     12) పీ వీ ఆర్దిక సంస్కరణలను ప్రతి పక్షములో వున్న BJP వ్యతిరేకించినా కాని ఆ తరువాత వాజ్ పేయీ గారి ప్రభుత్వం వాటిని అలాగే కొనసాగించడం విశేషం !     13) ఎన్నోసార్లు లోక్ సభలో మెజారిటీ నిరూపించు కోవాల్చి వచ్చినపుడు ఒక్కొక్క సారి ఒక్కొక్క పార్టీ ని చీల్చడం ద్వార కాపాడుకొన్నారు . చాలా సందర్భాల్లో BJP కూడా ఎన్నో సార్లు పార్లమెంట్లో వోటు ను బహిష్కరించి పీవీ ప్రభుత్వాన్ని indirect గా  కాపాడిందని అంటారు.          14) కాంగ్రెస్ ప్రభుత్వాలలో దేశాన్ని పాలించిన  లాల్ బహదూర్ శాస్రి గారి తరువాత గొప్ప ప్రధానిగా ,Father of Indian Economic Reforms గా పేరు తెచ్చుకొన్నారు .          15) ఎన్నో ప్రభుత్వాలలో ముఖ్య పదవుల్లో పనిచేసినా గాని అయన చివరి రోజుల్లో కోర్టు కేసులలో విముక్తి పొందినా గాని వాదించిన లాయర్లకు డబ్బులు ఇవ్వలేక అయన స్వంత ఇంటిని అమ్మి వారి బకాయిలు తీర్చారని ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన IAS PVRK ప్రసాద్ గారు ప్రకటించారు .          16) అయన ఢిల్లీ లో మరణించినపుడు కాంగ్రెస్ పార్టీ కి ,AICC లో ఎన్నో సేవలు చేసినప్పటికి, సోనియా గాంధీ కోటరి ఆయన పార్ధీవ దేహాన్ని ఢిల్లీ AICC ఆఫీసులోకి  అనుమతించకుండా అవమానించింది. హైదరబాద్ పంపేసింది .              తెలుగు తేజం  స్వర్గీయ ఎన్ టీ రామారావు గారి విగ్రహం కాంగ్రెస్ హయాం లో ఏర్పాటు అయినట్లు  మరొక తెలుగు దార్శనికుడు ,కర్మయోగి పీ వీ నరసింహ రావు గారి విగ్రహం బీ జే పీ హయం లో ఏర్పాటు అవుతుందేమో అని ఆశిస్తున్నా !   

శాసన సభలో తెలంగాణపై బిల్లు కోసం సీమాంధ్ర సభ్యుల ఆలోచన

  నేడో రేపో తెలంగాణా అంటూ రాష్ట్ర రాజధానిలో మొదలయిన హడావుడిని చూసి మళ్ళీ సమైక్య నేతలు నిద్రలేచి, దానిని నిలువరించేందుకు సమావేశాలు మొదలుపెట్టేసారు. ముందుగా రేపు రాష్ట్ర పర్యటనకి వస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ వినతిపత్రం ఈయడంతో తమ కార్యక్రమాలు మొదలు పెట్టి, తెలంగాణాను అడ్డుకొనేందుకు క్రమంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వారు నిశ్చయించుకొన్నారు. రాయల తెలంగాణాను వ్యతిరేఖిస్తూ కర్నూలు లేదా అనంతపురం జిల్లాలలో ఒక బహిరంగ సభను నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. అయితే దీని ప్రధానోదేశ్యం రాయల తెలంగాణాను వ్యతిరేఖించడమే కాక, అసలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖించడమే.   ఇక, ఇటునుంచి వీలుకాకపోతే అటు నుంచి నరుక్కు రావాలని సీమాంధ్ర నేతలు ఆలోచిస్తున్నారు. ఇంత వరకు తెరాస నేతలు శాసన సభలో తెలంగాణపై బిల్లు పెట్టమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తుండటం, దానిని ప్రభుత్వం తిరస్కరిస్తుండటం జరుగుతోంది. అయితే ఈసారి తామే తెలంగాణా బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని సీమంద్రా నేతలు భావిస్తున్నారు. తద్వారా సభలో దాదాపు సగంపైగా ఉన్న సీమంధ్ర సభ్యులు బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేసి, తెలంగాణావాదానికి చట్ట సభలో కానీ, రాష్ట్రంలో గానీ పూర్తి మద్దతు లేదని తెలియజెప్పాలనుకొంటున్నారు. అయితే, ఇది వారు ఊహిస్తున్నంత తేలిక కాదు. సభలో సీమంద్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు 175 మంది సభ్యులున్నపటికీ, ఒకసారి బిల్లు ప్రవేశపెడితే, అప్పుడు తెరాస కూడా ఇదే అదునుగా చేసుకొని కాంగ్రెస్, వైకాపా, తెదేపా అధినేతలకు ‘తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేఖమో తేల్చుకోమంటూ మరో మారు అగ్నిపరీక్ష పెట్టక మానదు. అటువంటి పరిస్థితులను చేజేతులా ఏ పార్టీ ఆహ్వానించుకోదు గనుక, దీనిని తెరాస తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేఖించవచ్చును.

కాంగ్రెస్ పార్టీకి మిత్ర లాభం

  మూడు నెలల క్రితం వరుసపెట్టి వెలుగు చూసిన కుంభ కోణాలతో, మంత్రులపై అవినీతి ఆరోపణలతో, సుప్రీంకోర్టు మొట్టికాయలతో పీకలలోతు కష్టాలలోకి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ మొన్న కర్ణాటకలో అధికారంలోకి రాగలిగింది. ఇక, మోడీ కారణంగా బీజేపీకి రాం రాం చెప్పేసిన నితీష్ కుమార్ కి శాసనసభలో బల నిరూపణ సమయంలో మద్దతు ప్రకటించి, జేడీ(యు) తో స్నేహ సంబంధాలు చిగురింపజేసుకోగలిగింది. అదే సమయంలో మోడీ కారణంగానే, అద్వానీ పార్టీపై అలిగి రాజీనామా చేయడంతో, ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కసారిగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగిపోయింది. మున్ముందు మోడీ కారణంగానే ఆ పార్టీకి తన చేతిలో ఓటమి తప్పదని కాంగ్రెస్ బలంగా నమ్ముతోందిపుడు.   ఇక, నిన్న తమిళనాడులో ఆరు రాజ్యసభ సీట్లకి జరిగిన ఎన్నికలలో, కాంగ్రెస్ తెలివిగా వ్యవహరించి, కొద్ది నెలల క్రితం తనకు కటీఫ్ చెప్పి వెళ్ళిపోయిన కరుణానిధి కుమార్తె కనిమోలికి తమ 5 వోట్లు వేసి ఆమెకు మళ్ళీ రాజ్యసభ యోగం కల్పించడం ద్వారా పెద్దాయనను మంచి చేసుకొనగలిగింది. తద్వారా, మళ్ళీ తమ రెండు పార్టీల మద్య సంబంధాలు సరిచేసుకొని రానున్న ఎన్నికల పొత్తులకి ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకొంది.   తరువాత, తెలంగాణా అంశంపై ఆ పార్టీ ప్రస్తుతం ఏదో పెద్ద ఉపాయమే ఆలోచిస్తున్నట్లు అర్ధం అవుతోంది. తద్వారా ఆంద్రప్రదేశ్ లో కూడా విజయపతాకం ఎగురవేయాలని ఉవ్విళ్ళూరుతోంది.

సుబ్బిరామిరెడ్డి వెనక్కి తగ్గినట్లేనా?

  రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన మీద లేనిపోని అభాండాలు వేసినందుకు రూ.5కోట్లకి పరువు నష్టం దావావేస్తానంటూ శివ తాండవం చేశారు. ఆ ప్రోగ్రాం తరువాత ఆయనకి లీగల్ నోటీసులు కూడా పంపడం జరిగింది. అయితే, ఆయన ఊహించినట్లు వెంకటేశ్వర రావు భయపడి క్షమాపణలు చెప్పకపోగా, సుబ్బిరామి రెడ్డి కోర్టుకి వెళ్ళదలిస్తే తనకేమి అభ్యంతరం లేదని, దాని వల్ల ఆయన గురించి మరిన్నినిజాలు బయటకి వస్తాయంటూ చెప్పడంతో రెడ్డి గారు గతుక్కుమన్నారు. కానీ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, సాటి కాంగ్రెస్ సభ్యుడు గనుక వెంకటేశ్వర రావుకి మరో పదిరోజులు గడువు ఇస్తున్నాంటూ తనకి క్షమాపణలు చెప్పడానికి గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇటీవలే ముగిసినప్పటికీ, రెడ్డిగారు పరువు నష్టం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. అసలే ఇది ఎన్నికల సీజను. పరువు నష్టమని కోర్టుకి వెళితే ఉన్న పరువు కూడా పోతుందని మరి వెనక్కి తగ్గారో ఏమో?

విజయమ్మకు షాకిచ్చిన తెలంగాణవాదులు

      తెలంగాణాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు తెలంగాణావాదులు షాకిచ్చారు. ఈ నెల 25 నుంచి విజయమ్మ తెలంగాణాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పర్యటనలో బాగంగా శుక్రవారం తెలంగాణ జిల్లాలకు వెళ్ళడానికి బయలుదేరారు. ఈ సమయంలో ఉప్పల్ బస్సు డిపో వద్ద తెలంగాణావాదులు ఆమె కాన్వాయి ని అడ్డుకొని తెలంగాణ నినాదాలు చేశారు. విజయమ్మ వ్యక్తిగత గత సిబ్బంది వాళ్ళను తప్పించేందుకు ప్రయత్నించగా, అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విజయమ్మ భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.

వరద బాధితుల బాధ వర్ణనాతీతం: చంద్రబాబు

      ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల బాధలు మాటల్లో చెప్పలేమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. వరద బాధితులను అదుకోవడానికి ఉత్తరాఖండ్ వెళ్ళిన చంద్రబాబు వారిని పరామర్శించారు. బాధితుల అనుభవాలను బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మీడియా తో మట్లాడుతూ...వరద బాధితులకు చాలా భయంకరమైన అనుభవాలు ఎదురైనాయని అన్నారు. పద్మా అనే మహిలా తన కళ్లముందే కుటుంబ సభ్యులు ఐదుగురు వరదలో కొట్టుకుపోతుంటే ఒంటరిగా మిగిలిన ఆమె బాధ వర్ణనాతీతం అని, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.   ఉత్తరాఖండ్‌లో ఒక చోట బాధితులు తిండి నీళ్లు లేక, బాతకాలి కాబట్టి తాము కట్టుకున్న బట్టలతో శవాలు పడిఉన్న నీటిలో బట్ట తడిపి ఆ నీటినే తాగామని తెలిపారని బాబు అన్నారు. మరో మహిళ తన కళ్లముందే తన కుమార్తె వరదలో కొట్టుకుపోయిందని వాపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఏపీ భవన్‌కు చేరుకున్న బాధితులకు అక్కడి అధికారులు సరైన సదుపాయాలు కల్పించలేదని, కనీసం స్నాన, భోజన వసతులు కూడా కల్పించలేదని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.  

కావూరిని హెచ్చరించిన సమైక్యాంధ్ర జెఎసి

      కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఈ రోజు తెలంగాణ పై చేసిన వ్యాఖల మీద సమైక్యాంధ్ర విద్యార్ధి జెఎసి నేతలు మండిపడుతున్నారు. కావూరి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్ధి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. కావూరి వైఖరి మార్చుకోకపోతే అడుగడుగా నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వచ్చే నెలలో సమైకాంద్ర కోసం ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేసి పర్యటిస్తామని తెలిపారు.   మరోవైపు ఈరోజు ఉదయం తెలంగాణ అంశంపై అధిష్టాం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలలో రాజీపడక తప్పదన్నారు. కేంద్ర మంత్రిని అయ్యాక ఇంకా గ్రామ సర్పంచ్ స్థాయిలో ఆలోచించలేమని ఆయన తెలిపారు. పార్టీ నాయకత్వం బలపడాల్సిన అవసరం ఉందని కావూరి సాంబశివరావు పేర్కొన్నారు.

వైయస్సార్ సెంటిమెంటుతో తెలంగాణాలో విజయం సాధ్యమేనా

    తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నతెలంగాణా జిల్లాలలో, తెలంగాణా ప్రసక్తి ఎత్తలేని వైయస్సార్ కాంగ్రెస్స్ పార్టీ అక్కడ నిలదొక్కుకోవడానికి వైయస్సార్ సెంటిమెంటుపైనే ముఖ్యంగా ఆధారపడి ఉంది. ఆయితే, దానిని కూడా చిరకాలం కొనసాగించడం కష్టమే. ఒకవైపు తెరాస అధినేత కేసీఆర్, వైయస్సార్ తమని ఏవిధంగా మోసం చేసింది ప్రజలకి విడమరిచి చెపుతుంటే, వైయస్సార్ చాలా మంచోడని వారికి నచ్చజెప్పడం అంత తేలికయిన విషయం కాదు. అయితే, త్వరలో జరగనున్న పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో గెలవాలంటే ప్రజలకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పుకోక తప్పదు.   ప్రస్తుతం తెలంగాణాలోపర్యటిస్తున్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, వైయస్సార్ పేరు ప్రస్తావిస్తూనే, జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా జైలులో పెట్టిందని, వచ్చే సాధారణ ఎన్నికలు కూడా పూర్తయ్యేవరకు జగన్నిఇంకా జైలులోనే ఉంచాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. తద్వారా, ఆమె ఇప్పుడు సానుభూతి సెంటిమెంటుని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తునట్లున్నారు.ఇక, ఆ తరువాత వరుసగా చంద్రబాబుని, కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడంతో ఆమె ప్రసంగాలు ముగుస్తుంటాయి.   ప్రజలు ఆమె నుండి తెలంగాణ అంశంపై పార్టీ అభిప్రాయం ఆశిస్తుంటే, ఆమె చనిపోయిన తన భర్త గురించి, జైల్లో మ్రగ్గుతున్న తన కొడుకు గురించి మాత్రమే మాట్లాడుతుండటంతో, ఆమె సభలలో కొత్తగా చెప్పేదేమీ లేదనే సంగతి ప్రజలకి అర్ధం అయ్యింది. దానివల్ల నేతల ప్రోదబలంతో, జన సమీకరణ వల్ల వచ్చే ప్రజలే తప్ప స్వచ్చందంగా ఆమె సభలకి వచ్చే ప్రజలు కరువయ్యారు. అయినప్పటికీ, విజయమ్మ యధాశక్తిన తన పార్టీ నేతలని ఉత్సాహపరుస్తూ, పంచాయితీ ఎన్నికలలో విజయం సాధించాలని నూరిపోస్తున్నారు.   పార్టీ తరపున ప్రజలకి చెప్పుకోవడానికి బలమయిన పాయింటు ఒక్కటి కూడా లేకపోవడంతో, నేతలు మీడియా ముందు పడికట్టు పదాలను పేర్చుకొని ఉపన్యాసాలు చేస్తూ ఎలాగో నెగ్గుకొస్తున్నా, అంతిమంగా ఫలితాలు మాత్రం సానుకూలంగా రాకపోవచ్చునని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

ముంబై జైళ్లో అబూ సలేంపై కాల్పులు

      ముంబయి బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, గ్యాంగ్ స్టర్ అయిన అబూ సలెం మీద తోటి ఖైదీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అబూ సలెం చేతికి తీవ్ర గాయం అయింది. అబూ సలెం ప్రస్తుతం నవీ ముంబయిలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు. ఓ న్యాయవాది హత్య కేసులో ఉన్న నిందితుడుగా ఉన్న దేవేంద్ర జగ్ తప్ అనే ఖైదీ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. నిన్నరాత్రి 8.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. పోర్చుగల్ తో భారత్ కు ఉన్న ఒప్పందం మేరకు అక్కడ ఉన్న అబూ సలెంను 2005 లో భారత్ కు తీసుకువచ్చారు. 2010లో అబూ సలెం అర్ధర్ రోడ్ జైలులో ఉన్నప్పుడు కూడా తోటి ఖైదీ చేతిలో గాయపడ్డాడు. ఇప్పుడు రెండో సారి మళ్లీ దాడి జరిగింది. అసలు దేవేంద్రకు తుపాకి ఎలా చేరింది అన్నది విచారణ జరుగుతుంది.

సీడబ్ల్యూసీ నుంచి కావూరి తప్పుకోవడానికి కారణ౦?

      కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి హోదా నుంచి తప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశగా మారింది. సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితుని హోదా నుంచి తనను తప్పించాలని స్వయంగా కావూరే అభ్యర్థించారని, ఆయన అభ్యర్థనను అధినేత్రి సోనియాగాంధీ ఆమోదించారని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు.   కావూరి స్థానంలో వెంటనే షిండేను నియమించడం చూస్తే.. అధిష్ఠానమే ఆయనకు ఈ మేరకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యుసీలో ఒక తెలుగు నేతకు అవకాశం దొరికిందన్న సంతోషం చల్లారకముందే ఆయనను తప్పించడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణపై వర్కింగ్ కమిటీ తర్జన భర్జన పడే అవకాశమున్నందువల్లనే కావూరిని కొనసాగించడం సరైంది కాదని అధిష్ఠానం భావించినట్లు తెలుస్తోంది. అయితే కావూరిని తొలుత సీడబ్ల్యుసీలోనే చేర్చుకోవాలని భావించారని, అనంతర పరిణామాల్లో ఆయనకు మంత్రిపదవి లభించడం వల్ల సీడబ్ల్యుసీ నుంచి తప్పించడమే సరైందని అనుకున్నారని, అందుకు ఆయన కూడా అంగీకరించారని విశ్లేషకులు చెబుతున్నారు.

తూచ్! మోడీ బాగానే పని చేసాడు

  పౌరుషానికి పోయేవాడు రాజకీయాలకి పనికిరాడు. ఛీ కొట్టిన వారిని కడుపు రగిలిపోతున్నా చిరునవ్వుతో కాగలించుకోగలగాలి, దోస్తీలను అవసరం తీరగానే కత్తిరించుకోగలగాలి.   ప్రధాని కావాలని కలలు కంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జాతీయ దృక్పధం కనబరచకుండా, ఉత్తరాఖండ్ బాధితులలో కేవలం గుజరాతీలనే ఆదుకొని తన సంకుచిత మనస్తత్వం ప్రదర్శించుకొన్నాడని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే, తన పార్టీ పత్రిక ‘సామ్నా’లో రెండు రోజుల క్రితమే మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మోడీ మాత్రమే ఒక్కరోజులో 15,000 మంది గుజరాతీలను రాష్ట్రానికి తరలించాడని ఆయన వందిమాగాదులు చేసిన ప్రచారాన్నికూడా ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు.   అయితే, ఇది జరిగిన రెండు రోజులకే మోడీ మహారాష్ట్ర పర్యటనకు రావడం, తనని ప్రసన్నం చేసుకొనేందుకు ఆయనే స్వయంగా ముంబైలో తన ‘మాతోశ్రీ’ కి వచ్చి కలవడంతో, ఉద్దావ్ థాకరే అభిప్రాయలు ఒక్కసారిగా మారిపోయాయి. తానూ మోడీని విమర్శించలేదని, ఆయన చేపడుతున్న సహాయ చర్యల గురించి, జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే ఖండిస్తూ వ్రాయడం జరిగిందని ఆయన సంజాయిషీ ఇచ్చుకొన్నారు. ఇక, మోడీ కూడా తనను తూర్పారబట్టిన ఉద్దవ్ థాకరే మద్దతు తన కలలు సాకారం చేసుకోవడానికి ఎంతయినా అవసరమని గ్రహించడం చేత, మొహమాటపడకుండా వెళ్లి ఉద్దవ్ ధాకరేని కలిసి వచ్చారు. ప్రస్తుతానికి ఇద్దరూ గుజరాతీ, మరాటీ భాయి భాయి అనుకొంటూ ఒకరినొకరు బాగానే కాగలించుకొన్నపటికీ ఆ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందో చూడాలి.

చిరంజీవి..నేను కాంగ్రెస్ నేతల౦: రామచంద్రయ్య

      మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవి, తాను కాంగ్రెస్ పార్టీ నేతలమని..తమకంటూ సొంత అభిప్రాయాలు ఉండవని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. రాయల తెలంగాణ వాదన అర్థం పర్థం లేనిదిగా ఆయన కొట్టిపారేశారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. మరో వైపు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పిసిసి అద్యక్షుడు బొత్స ఉత్తరాఖండ్ వెళుతున్నారు. అక్కడ వరదబాదితులకు అవసరమైన సహాయ, సహకారాలపై వారు సమీక్ష చేయనున్నారు. తెలుగువారిని ఆదుకునే విషయంలో ఉత్తరాఖండ్ లో వివక్ష చూపుతున్నారని కేంద్ర హోం మంత్రి షిండే కి చిరంజీవి ఫిర్యాదు చేశారు. కొందరు టూర్ ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని,అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  

రాయల తెలంగాణ: మండిపడుతున్న నేతలు

      అధిష్టానం రాయల తెలంగాణ ఆలోచన చేస్తుందనే విషయం తెలియడంతో నేతలు అందరు ఒక్కటిగా భగ్గుమంటున్నారు. రాయల తెలంగాణ అంటే తాము నిరవధిక ఆందోళన చేస్తామని, తెలంగాణ ఇవ్వకుండే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెసు పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణపై సోనియా మభ్యపెడుతున్నారని, ప్యాకేజీలు, రాయల తెలంగాణతో మోసం చేయాలని చూస్తే తరిమి కొడతారన్నారు. పంచాయతీ ఎన్నికలలో లబ్ధి పొందేందుకే ఈ జిమ్మిక్కులు అన్నారు. తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెసు నేతలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తాము రాయల తెలంగాణకు వ్యతిరేకమని, ఈ ప్రతిపాదన తమ పార్టీని దెబ్బతీసేందుకేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగి రెడ్డి అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ తో సాధ్యం: జానా

      కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ ఇస్తుందన్న విశ్వాసం తనకు వుందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో పదవులకు రాజీనామాలు చేశామని, అవసరమైతే కటిన నిర్ణయాలకు తీసుకొనేందుకు సిద్దమవుతామని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడమే నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగసభ ఉద్దేశమని జానారెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానానికి తెలంగాణపై ఎన్నో విజ్ఞప్తులు చేశామని ఆయన చెప్పారు. పార్లమెంటులోనూ శానససభలోనూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేశామని ఆయన అన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, కాంగ్రెసు ద్వారానే తెలంగాణ సాధ్యమని చాటాలని ఆయన అన్నారు. రాయల తెలంగాణ, తెలంగాణ ప్యాకేజీలపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.

రుషికేష్ కి వెళ్ళిన వైకాపా నేతలు

    ఉత్తరాఖండ్ లో వరద రాజకీయాల్లో ఇప్పుడు జగన్ పార్టీ నేతలు కూడా పాలుపంచుకుంటున్నారు. వరద బారిన పడిన తెలుగువారిని పరామర్శించడానికి వైకాపా నేతలు డెహ్రాడూన్, రుషికేష్ కి వెళ్ళారు. రుషికేష్ వద్ద హిమాలయన్‌ ఆస్పత్రిలో చికిత్స తెలుగు వారిని జగన్ పార్టీ నేతలు ఎమ్.వి.మైసూరారెడ్డి గొల్లబాబురావులు పరామర్శించారు. ఉత్తరాఖండ్ లో వైకాపా వైద్య విభాగం సేవలు అందిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ వరద లో చిక్కుకుని, బతుకు జీవుడా అని సైన్యంతో రక్షింపబడి.. సొంతూర్లకు వెళ్ళాల్సిన వరద బాధితుల్ని తమ విమానాల్లో ఎక్కించేందుకు టిడిపి, కాంగ్రెస్ నేతలు పోటిపడుతున్నారు.

బ్రాహ్మణి భూములు ప్రభుత్వ స్వాదీనం

  బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు గత ప్రభుత్వం కేటాయించిన భూములను స్వాదీనం చేసుకొంతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ రోజు ఆ కార్యక్రమం మొదలయింది. కడప జిల్లా జమ్మలమడుగులో బ్రహ్మణికి కేటాయించిన 10,600 ఎకరాల భూమి కొలతలు తీసుకొనేందుకు జిల్లా కలెక్టర్‌ అనుమతి ఈయడంతో ఆర్డీవో రఘునాధ్‌రెడ్డి తన రెవెన్యూ సిబ్బందితో కలిసి కొలతలు తీసుకోవడం ప్రారంభించారు. త్వరలో ఆ పని పూర్తిచేసి నివేదికను తన పై అధికారులకు పంపుతానని ఆయన తెలిపారు. ఈ విషయంపై వైకాపానేతలు కానీ, గాలి జనార్ధన్ రెడ్డికి సంబందించిన వ్యక్తులు గానీ మీడియాతో మాట్లాడే పరిస్థితిలో లేరు. అందువల్ల రెవెన్యు సిబ్బంది పని కొంచెం తేలికయింది.