'ఛలో అసెంబ్లీ' ఎందుకు విఫలమయింది?
- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
"ఛలో అసెంబ్లీ'' నినాదంతో, తెలంగాణా పేరిట, 'ప్రత్యేక రాష్ట్రం' నినాదం చాటున ప్రాంతంలోని కొందరు రాజకీయ నిరుద్యోగులు రెండు మూడు పార్టీల పేరిట ఒకటి రెండు సంస్థల మాటున తలపెట్టిన [14-06-2013] ప్రదర్శనలు, ఆ మరునాడు "పోలీసుల జులుం''కు నిరసనగా "తెలంగాణా బంద్'' కోసం యిచ్చిన పిలుపూ పదవీవ్యామోహపరులయిన నాయకుల రాజకీయ 'వాపు' తప్ప మరేమీ కాదని మరోసారి రుజువయింది! ప్రజల కోరికలు వేరు, నాయకుల 'ఆబ' వేరనీ ఇంకోసారి వెల్లడయింది. ఇందుకు నిదర్శనం "బంద్'' [15-06-2013] అనంతరం వివిధ పత్రికలూ మోసుకొచ్చిన వార్తలే!
ఉదాహరణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ, అటు తెలంగాణా జిల్లాలోనూ [గ్రామసీమలు సహా] 'బంద్'కు సరైన స్పందన కరువయిందని పత్రికలూ పేర్కొన్నాయి. కొన్ని పత్రికలూ, కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రానున్న జనరల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్త్రంలోని మిగతా రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం మృగ్యమని భావించి, కనీసం తెలంగాణా లోనయినా "కాంగ్రెస్ ను బతికించుకునే లక్ష్యంతో'' తెలంగాణా రాష్ట్రాన్ని ప్రకటించవచ్చనేమోనన్న అనుమానంతో కూడిన ఒక ఊహను ప్రచారంలో పెట్టగా, మరికొన్ని పత్రికలూ 'రాష్ట్ర విభజన జరగబోదనీ, మూడు ప్రాంతాలలోని వెనుకబడిన ప్రాంతాలకు సమానస్థాయిలో ప్రత్యేక అభివృద్ధి పథకాలతో ప్యాకేజీలను పకడ్బందీగా ప్రకటించి, అమలు జరిపే వ్యూహంతో అధిష్ఠానం ఉందనీ ప్రత్యేక వార్తలు [16-06-2013] ప్రకటించాయి! అంతేగాదు, "ఛలో అసెంబ్లీ'' కార్యక్రమంలోనే నేతలు మాత్రమే పాల్గొన్నారని సామాన్యప్రజలు స్పందించనే లేదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారని ఒక పత్రిక రాసింది!
ఒక ప్రసిద్ధ ఆంగ్లదినపత్రిక "హిందూ'' కూడా "మూడు ప్రాంతాలవారితో చర్చల ద్వారా ఒక అంగీకారానికి వచ్చిన తరువాతనే'' సమస్యకు పరిష్కారం సాధ్యమని యిప్పటికీ కేంద్రం భావిస్తోందని చెబుతూ, "బంద్'' పిలుపుకు మాత్రం ఇటు హైదరాబాద్ లోనూ, అటు తెలంగాణా జిల్లాలలోనూ ప్రజలనుంచి "స్పందన చాలా పేలవంగా'' ["poor response''] ఉందని రాసింది. రాజధాని హైదరాబాద్ లో దాదాపు విఫలమైనదనీ ["almost flopped"] వెల్లడించింది. బస్సులుహాయిగా తిరిగాయి. అక్కడక్కడా కొన్ని షాపులు మూయడం మినహా అంతటా షాపులూ, వాణిజ్య సంస్థలూ యథాతథంగానే పనిచేశాయి. ఆటోరిక్షాలూ, ఎంఎంటిఎస్ రైళ్ళూ అన్ని రూట్లలోనూ నడిచాయి. చివరికి రాజకీయ నిరుద్యోగుల బలవంతపు జోక్యాలవల్ల అల్లకల్లోలాలకు ఇటీవల కాలంలో కేంద్రంగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కూడా [అరెస్టయిన కొందరు విద్యార్థుల్ని విడుదల చేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు చేసిన ప్రదర్శన మినహాయిస్తే] 15వ తేదీన ప్రశాంతత నెలకొన్నదని అదే పత్రిక రాసింది!
అయితే, గతంలో మాదిరే, 'బంద్' రోజున బండారు శ్రీనివాస్ అనే ఉస్మానియా ఇంజనీరింగ్ విద్యార్థి "తెల్లవారు జామున'' ఆత్మహత్య చేసుకున్నాడనీ, అయితే అతనే రాశాడని చెబుతున్న రెండు చీటీలు, ఒక మొబైలు ఫోను, 200 రూపాయలు అతని దుస్తుల్లో ఉన్నట్టు కనుగొన్నారు. ఉస్మానియా ప్రధానగ్రంథాలయం సమీపంలో ఒక చెట్టుకు వేలాడుతున్న అతని శరీరాన్ని చూసిన మార్నింగ్ వాకర్స్ పోలీసులకు చెప్పగా, గాంధీ ఆసుపత్రి శవాల గదికి తరలించారు. అయితే బంద్ పాక్షికంగానే విజయం పొంది, ఉస్మానియాలో ప్రశాంత పరిస్థితి నెలకొంటున్న సమయంలో శ్రీనివాస్ "ఆత్మహత్య''వార్త మళ్ళీ కొంత ఆందోళన కారణం కావటం, శ్రీనివాస్ ది "హత్యా, ఆత్మహత్యా'' అన్న అనుమానాలు విద్యార్థిల్లోనే వ్యాపించాయి.
ఎందుకంటే, శ్రీనివాస్ తెల్లవారు జామున ఎవరూ చూడకుండా చెట్టుకు ఉరివేసుకుని చావవలసిన అవసరం - అందునా "చలో అసెంబ్లీ'' నిర్వహణ తర్వాత ఎందుకు వచ్చిందన్న ప్రశ్న విద్యార్థుల్లో బాగా నలుగుతోంది. ఎందుకంటే, నిరుద్యోగ రాజకీయ చేతబడులకు అలవాటు పడిన టి.ఆర్.ఎస్. నాయకులు పదవీకాంక్ష కొద్దీ చేస్తున్న పని - యువతలో మనోనిబ్బరాన్ని చెడగొట్టడం ద్వారా తాను నేరవేర్చలేని ఆశలను వారిలో రేకెత్తించి, అవి తాను నెరవేర్చలేక యువతను ఆత్మహత్యల వైపునకు నెట్టే దుర్మార్గపు 'చిట్కా'ను ఆశ్రయించటం!
కాని తెలుగువారిని తెలుగువారి పైకే ఉసికొల్పడమైతే, ఉసికొల్పాడు. కాని ఆ క్రమంలో 'ఆత్మహత్య' అనే ఆదర్శాన్ని తానుగాని తన కుటుంబీకుల చేతగాని పాటించకుండా 'ఫామ్ హౌస్'లో (విలాసగృహం) కూర్చుని ఆత్మహత్యలకూ, బంద్ లకూ, ధర్నాలకూ అజ్ఞాత ఆదేశాలతో సరిపెట్టుకుంటున్నాడు! ఈ మొత్తం బాగోతం, తెలంగాణాలో తమ వర్గం కోల్పోయిన ఒకనాటి రాజకీయ ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని తిరిగి పొందటం కోసం కెసిఆర్ చేస్తున్న 'రాజకీయ' యాగం రాజేకీయ చేతబడులు తప్ప మరేమీ కాదని కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసిపోయింది. చివరికి "భస్మాసురహస్తం''లాగా ఈ ఆత్మహత్యల పర్వం సొంత స్థానిక పార్టీ టి.ఆర్.ఎస్.లోకే చొరబడిపోయి, నిన్నగాక మొన్ననే ఒక జిల్లానాయకుడిని బలిగొన్నది! అలాగే "ఛలో అసెంబ్లీ'' సందర్భంగా ఉన్న ఆ పార్టీ శాసనసభాపక్షం కార్యాలయం గోడలపైకి ఎక్కి సొంతపార్టీ శాసనసభ్యులు ఇద్దరు హుందాతనం కోల్పోయి నల్లజెండాలు చేతబూని, అక్కడనుంచి "దూకేస్తాం'' అంటూ పోలీసుల్ని, ఇతర శాసనసభ్యుల్ని బెదిరించి, తమ మానసిక దౌర్భాల్యాన్ని ప్రదర్శించారు.
టి.ఆర్.ఎస్. సభ్యులే గతంలో కూడా గవర్నర్ పోడియం వద్దకు దూసుకువెళ్ళి ఆయన చేతిలోని పత్రాలను దౌర్జన్యంగా లాగేసి, చించేసి, బాజాలు మనుషుల్లా వ్యవహరించిన సంగతిని తెలంగాణా ప్రజలు యింకా మరువలేదు! నిజానికి నేడు వేర్పాటువాదం పేరిట మన తెలంగాణాలో జరుగుతున్న పని - 'దొరల'స్వామ్యానికీ, రెడ్ల స్వామ్యానికి మధ్య అధికారం కోసం సాగుతున్న పెనుగులాట పోరు తప్ప, తెలంగాణా బడుగు, బలహీనవర్గాల ప్రజాబాహుళ్యం వకాలిన సమస్యల (తిండి, బట్ట, వసతి, అక్షరాస్యత) పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటం కాదు. "వేర్పాటు వాదం'' చాటున ఈ సమస్యలను, సీమాంధ్రనుంచి తెలంగాణాకు వలసవచ్చి స్వార్థం కోసం కుంపటి పెట్టిన "బొబ్బిలిదొర'' ఎలా పక్కకు తప్పించి వేస్తూ వచ్చాడో ప్రజలు గుర్తించారు.
అందుకే కాంగ్రెస్ గొడుగుకిందకు చేరడం ద్వారా తనను తాను కాపాడుకోడానికి కాంగ్రెస్ లో కూడా చీలికలు తెచ్చి, వివేక, కె.కె.లాంటి బలహీనుల్ని దగ్గరకు చేరదీసుకున్నాడు. ఈ తంతును తెలంగాణాలో అసంఖ్యాకులయిన ఎస్.సి., ఎస్.టి., బి.సి. వర్గాల ప్రజలు పసికట్టి, కె.సి.ఆర్. స్వార్థపూరిత ఉద్యమం నుంచి క్రమంగా దూరమవుతూ, పల్లెపల్లెకూ కె.సి.ఆర్.కు వ్యతిరేకంగా సందేశాన్ని అందజేస్తున్నారు. తెలంగాణాలో 'దొర'ళ, జాగిర్థార్ల దోపిడీ పెత్తనాల కింద నలిగిపోయిన దళిత, బహుజనులంతా ఏకంకావడానికికారణం అదే! అలాగే కె.సి.ఆర్. వొంటెత్తు పోకడకు నిరసనగానే బిజెపి, కమ్యూనిస్టుపార్టీలు "బంద్''ను బహిష్కరించడం జరిగింది.
మొన్నటివరకూ కెసిఆర్ నెలకొల్పిన సంయుక్త కార్యాచరణ సంఘంతో యునైటెడ్ ఫ్రెంట్ రాష్ట్రశాఖ సహధ్యక్షురాలు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలయిన విమల ఒక ప్రకటన చేస్తూ కోదండరామ రెడ్డి నాయకత్వాన ఉన్న "సంయుక్త కార్యాచరణ సంఘం'' కెసిఆర్ పార్టీ అయిన "టి.ఆర్.ఎస్.కు తోకలా'' గా పనిచేస్తోందని విమర్శించాల్సి వచ్చింది! అందుకే తానిప్పుడు "పులిమీద కూర్చుని ప్రయాణిస్తున్నాన''ని కెసిఆర్ కు పూర్తిగా తెలుసు. కనుకనే "పులిమీద నుంచి కిందికి దిగామా'' తనకు ప్రాణం దక్కదని భావిస్తున్నాడు. భావించడమేమిటి? అలా అని అనేక సందర్భాల్లో ప్రకటనలూ చేశాడు! ఒకవేళ ఆపద్ధర్మంగా కాంగ్రెస్ ను కౌగిలించుకుని కూర్చున్నా కెసిఆర్ ను తాను ఎక్కి ప్రయాణిస్తున్న "పులి'' [తెలంగాణా] అయినా మింగేస్తుంది, లేదా కాంగ్రెస్ అధిష్ఠానమయినా మింగేస్తుంది. రేపు మనం వినబోయే వార్త అదే కావచ్చు!