చిరంజీవి మెగా కోరిక

  ఇన్నాళ్ళు రామచంద్రయ్య తన భజన చేస్తుంటే కాదనలేని చిరంజీవి, డిల్లీలో అమ్మగారి ఆశీసులు అందుకున్నారో మరేమో గానీ డిల్లీలో ఒక ఇంగ్లిష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యులో పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి పదవి చెప్పడ్డానికి సైతం తాను సిద్ధమేనని ప్రకటించి కిరణ్ కుమార్ రెడ్డి గుండెల్లో చల్లగా బాంబులు పేల్చారు. అంటే, ఆయనలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనే తపన ఇంకా సజీవంగానే ఉందని అర్ధం అవుతోంది. అధిష్టానం కూడా తనకు సానుకూలంగా ఉండటంతో, కాంగ్రెస్ నీటిని బాగా వంట బట్టించుకొన్నఆయన పార్టీ సంప్రదాయాల ప్రకారం తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని అప్పుడప్పుడు మీడియా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.   నిన్నగాక మొన్న రాజకీయాలలోకి, కాంగ్రెస్ పార్టీలో దూకిన ఆయన పార్టీలో తనకంటే చాలామంది సీనియర్లు ముఖ్యమంత్రి కుర్చీ కోసం క్యూలో చాలా ఏళ్లుగా నిలుచొని ఉన్నారని తెలిసి కూడా ఇటువంటి కోరిక వెళ్ళబుచ్చడం, ఆయనలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది. అటువంటి కీలక పదవులు ఆశించేవారు ముందుగా ప్రజలలో, పార్టీలో తమ ఆలోచలను వ్యాపింపజేయడం ద్వారా, కొంత సానుకూల వాతావరణం సృష్టించుకొంటుంటారు. తద్వారా అవకాశం వచ్చినప్పుడు కొత్తగా బరిలో దిగినట్లుకాక పార్టీలో తాము కూడా పాత ‘కాపు’లేనని, ఆ కుర్చీలో కూర్చోవడానికి తమకీ అర్హత, అవసరం రెండూ ఉన్నాయని గట్టిగా వాదించవచ్చును. ప్రస్తుతం చిరంజీవి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు గనుక 2014లో కాకపోయినా మరో ఒకట్రొండు సంవత్సరాలలో అయినా కుర్చీకి సరిపోయేలా ముదురుతారని చెప్పవచ్చును.

బంగారు తల్లి పై అసంతృప్తి

        ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో 27 అంశాలకు కేబినేట్‌లో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘బంగారు తల్లి’ పథకానికి చట్ట బద్దత కల్పించే విషయంలో కేబినెట్‌లో ఏకాభిప్రాయం కుదరలేదు. బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత కల్పించే విషయమై కేబినెట్ సబ్ కమిటీకి బదలాయించడం జరిగింది. బంగారు తల్లి పథకంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జానారెడ్డిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా కేబినెట్‌లో చర్చించి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ పథకం అమలులో లోపాలు ఉండకూడదని వారు సూచించారు. దీనిపై స్పందించిన సీఎం కిరణ్ ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తానని, పథకం అమలుపై సూచనలు చేయాలని చెప్పారు. అయినా బంగారు తల్లి పథకంపై ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవైపు మంత్రుల ప్రశ్నలకు సీఎం స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారని సమాచారం. కాగా ఈ సమావేశంలో మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేసిన డిఎల్ రవీంద్రారెడ్డి అంశం ప్రస్తావనకు రాకుండా ముఖ్యమంత్రి బంగారు తల్లి పథకంపై చర్చకు అవకాశం ఇచ్చారు. దీనిపై కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్లో స్పెయిన్ బుల్

        ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ సెమీస్‌లో మూడో సీడ్ నడాల్ 6-4, 3-6, 6-1, 6-7(3), 9-7తో టాప్ సీడ్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌పై పోరాడి గెలిచాడు. వరుసగా ఎనిమిదో సారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. మట్టి కోర్ట్ లో కొదమసింహల్లా పోరాడి టెన్నిస్ అభిమానులను కనువిందు చేశారు. 4 గంటల 37 నిముషాలు సాగిన ఈ మ్యాచ్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్ ల్లో ఒకటిగా నిలిచింది.   ఆదివారం జరిగే ఫైనల్లో నడాల్.. స్పెయిన్‌కే చెందిన డేవిడ్ ఫెర్రర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. గాయం నుంచి కోలుకున్నాక తొలి టోర్నీలో ఆడుతున్న నడాల్ ఆత్మవిశ్వాసంతో పోరాటపటిమ కనబరిచాడు. తొలిసెట్లో నడాల్, రెండో సెట్లో జొకోవిచ్ హవా సాగింది. మూడో సెట్లో స్పెయిన్ బుల్ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అసలైన పోరు మొదలైంది. నాలుగో సెట్లో పుంజుకున్న నొవాక్ టైబ్రేకర్‌లో నెగ్గి విజయావకాశాల్ని సజీవంగా ఉంచుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్లో 82 నిమిషాల పాటు హోరీహోరీగా పోరాడారు. చివరకు నడాల్ ఉత్కంఠ విజయం సాధించాడు. జొకోవిచ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

జెసికి ముందే తెలుసా!

        కాంగ్రెస్ మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎవరూ విమర్శలు చేసిన డీఎల్ పై తీసుకున్న విధంగానే చర్యలు వుంటాయని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎల్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం తాను ముందే ఊహించిన విషయం అని ఆయన తేల్చిచెప్పారు. తన సొంత జిల్లా రాజకీయాల గురించి కూడా జేసీ అంత ఆసక్తికరంగా స్పందించలేదు. ఆయనకు మంత్రి పదవి దక్కకుండా రఘువీరా,ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న ప్రయత్నం గురించి ఆయన లైట్ తీసుకున్నట్టుగా మాట్లాడారు. తాను మంత్రి పదవి కోసం ఏనాడూ పాకులాడలేదని జేసీ అంటున్నారు. మరి ముఖ్యమంత్రి అనుకూలంగా లేని రోజుల్లో పాకులాడలేదంటే అర్థం ఉంది. మరి కిరణ్ అయినా జేసీకి తగిన సత్కారం అందజేస్తాడో లేదో!

ఆయన క్కూడా బలుపెక్కువేనట

  చిత్ర సీమలో అత్యంత సీనియర్ అయిన దాసరి నారాయణ రావు ఏ కార్యక్రమానికి హాజరయినా ఏదో ఒక అంశం మీదనో లేక పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తుల మీదనో తనదయిన శైలిలో విమర్శలు చేస్తుంటారు. ఆయన ఇప్పుడు అటువంటి విమర్శలకి స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. అందువల్ల ఆయన కార్యక్రమాలలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఆ కారణం వల్ల కూడా కొందరు నిర్వాహకులు ఆయనను తమ కార్యక్రమాలకి ఆహ్వానిస్తుంటారు.   ఇటీవల రవి తేజ నటించిన బలుపు సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నిర్మాతల చేతిలో దర్శకులు నటులు ఉంటే, ఇప్పుడు దర్శకులు, నటుల చేతిలో నిర్మాతలు కీలు బొమ్మలుగా మిగిలిపోతున్నారన్నారు. సినీ రంగంలో కొందరు వాపును చూసి బలుపని భ్రమిస్తుంటారని, కానీ తనకున్నంత బలుపు మరెవ్వరికి లేదని అన్నారు. అది సినీ రంగాన్ని శాసిస్తున్నకొందరు పెద్ద హీరోల కొడుకులు మరియు పెద్ద నిర్మాతలు దర్శకులను ఉద్దేశించి అన్నవే. అయితే, ఇటువంటి డైలాగులు పేల్చడం వల్ల ఆయనకి కానీ, చిత్ర సీమకి గానీ ఒరిగేదేమీ లేకపోగా ఆయన కోరుండి తన చుట్టూ శత్రువులను సృష్టించుకొంటున్నారు. అయితే, చిత్ర సీమలో మారినపరిస్థితులకి, ప్రజల అభిరుచిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇప్పటి తరం దర్శకులు, నటులు, నిర్మతలతో పోటీ పడుతూ విజయవంతమయిన సినిమాలు తీయలేనప్పుడు ఆయన ప్రస్తుతం ఇంతకంటే చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.

మహారాష్ట్ర కు సిబిఐ లక్ష్మినారాయణ బదిలీ

        సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఇక్కడ ఆయన నిర్వహించిన బాధ్యతలను ఇక నుండి చెన్నై సిబిఐ జాయింట్ డైరెక్టర్ అరుణాచలంకు అప్పగిస్తారు. ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచలం మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారు. లక్ష్మీనారాయణ డిప్యూటేషన్ కాలం ముగిసింది. ఆయన ఇక తన సొంత కేడర్ మహారాష్ట్ర వెళతారు. ఆయన మహారాష్ట్ర పోలీసు శాఖకు బదిలీ అయ్యారని సమాచారం. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గనుల తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సీబీఐ కేసలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విచారణ అధికారిగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ బదిలీ కావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకు ముందు కేంద్రంలో బొగ్గు స్కాం విచారణ అధికారిగా ఉన్న వ్యక్తిని కేంద్రం బదిలీ చేయడంతో సుప్రీంకోర్టు ఆక్షేపించి అదే స్థానంలో నియమించాలని ఆదేశించింది. జేడీ లక్ష్మీనారాయణ మాత్రం బదిలీ అయిపోవడం చర్చకు దారితీస్తోంది.

సీబీఐ కోర్టు వద్ద జగన్ భార్య ఓవరాక్షన్

        వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి భార్య భారతి నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద ఓవరాక్షన్ చేశారు. కోర్టు వద్దకు ర్యాలీగా వస్తున్న భారతితో సహ ఆమె అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆగ్రహించిన భారతి ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. కాగా కోర్టులో జగన్ అనుచరులు తీరుపై న్యాయవాదులు మండిపడ్డారు. లాయర్లను జగన్ అనుచరులు తోసివేయడంపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   మరోవైపు ఆరునెలల తరువాత జైలుగోడలు దాటి కోర్టుకు హాజరయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో హుషారుగా నవ్వుతూ కనిపించారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటిసారి కోర్టుకు హాజరయి ఎంతో ముభావంగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటే ఆమెను నవ్వుతూ జగన్ పలకరించారు. ఆరు నెలల తరువాత జైలునుండి కోర్టుకు వచ్చిన కొడుకును చూసిన విజయమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంటే జగన్ ఆమెను ఓదార్చారు. జగన్ అలింగనం చేసుకుని ఆవేదన చెందింది విజయమ్మ.

6 నెలల తరువాత బయటకి వచ్చిన జగన్

        అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరు నెలలుగా బయట ప్రపంచాన్ని లోపలే ఉండి నడిపిస్తున్న ఆ జగన్నాయకుడు ఈ రోజు జైలు బయట కాలుపెట్టాడు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరయ్యారు. అయితే ఇవాళ దాల్మియా సిమెంట్స్ విషయంలో దాఖలైన ఛార్జిషీట్ పై విచారణ కొనసాగుతుంది. జగన్‌ ను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్‌ వాహనంలో కోర్టుకు తరలించారు. ఇదే కేసులో కోర్టుకు హాజరైన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కూడా కోర్టుకు వచ్చారు. వాళ్లిద్జరూ కోర్టులో పక్కపక్కనే కూర్చోవడం విశేషం. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతకుముందు జగన్ ను కోర్టు బయట అతని తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ కంటతడి పెట్టారు. విజయమ్మను జగన్‌తో పాటు.. వైకాపా ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయమూర్తికి జగన్ విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు అంగీకరించింది. గంటపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చని పేర్కొంది. కోర్టు ఆవరణలో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరోవైపు కోర్టు బయట ఆయన పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో హడావుడి ఏర్పడింది.

స్పాట్‌ ఫిక్సింగ్‌ లో శిల్పాశెట్టి భర్త

    ఐపీఎల్ క్రికెట్ టీమ్ ఓనర్ల అసలు రూపాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో బడాబాబుల పేర్లు..ఇప్పుడు బయటకు వస్తున్నాయి. శ్రీశాంత్ రూపంలో ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని కూపీ లాగిన పోలీసులు ఇప్పుడు పెద్ద తలలనే బయటకు తీస్తున్నారు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ అల్లుడు స్పాట్ ఫిక్సింగ్ లో భాగస్వామి అని తేలితే ఇప్పుడు రాజస్థాని టీమ్ ఓనర్లలో ఒకరైన రాజ్ కుంద్రా కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యాడని తేలింది.   రాజ్ కుంద్రాకు బెట్టింగ్ ముఠాతో సంబంధం ఉందని పోలీసులు నిర్ధారించారు. బెట్టింగ్ వ్యవహారంలో విచారిస్తున్న ముంబై పోలీసులకు అసలు విషయాన్ని రాజ్‌కుంద్రా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన సొంత జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పైనే బెట్టింగ్‌లు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో చెప్పారు. శిల్పాశెట్టి కూడా బెట్టింగ్ లకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్రపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు.        మరోవైపు స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో అరెస్టైన వారికి బెయిల్ దొరకకుండా వారిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాన్ని పెడుతున్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. బెయిల్ ను అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు ఎ మాత్రం లేదని, నేరం తీవ్రతను బట్టే (మెకా) వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్ శాడిస్ట్ గా మారిపోయారు!

        టీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ శాడిస్ట్ గా మారిపోయారా! సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను శాడిస్ట్ గా అభివర్ణిస్తున్నారు. అదేంటీ.. ఇంత సడన్ గా కేసీఆర్ శాడిస్ట్ గా ఎలా మారిపోయారు! కరీంనగర్ జిల్లాలో గురువారం జిరిగిన శిబిరానికి కేసీఆర్ హాజరయ్యారు. నాగరాజు అనే నాయకుడు పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. టీఆర్ఎస్ ఇన్‌చార్జి రాంరెడ్డి వర్గీయులు ఆయనను అడ్డుకోవడంతో... కేసీఆర్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్పాలడ్డారు. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో, అక్కడ ఉన్న పొలీసులు నాగరాజును అసుపత్రికి తరలించారు. కానీ నాగరాజు మరణించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. కానీ కేసీఆర్ మాత్రం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. నాగరాజు కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించకపోవడం పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ శాడిస్ట్ లా మారిపోయాడని అనుకుంటున్నారట. నాగరాజు మృతికి సంతాపంగా ఆయన వర్గానికి చెందిన టీఆర్ఎస్ శ్రేణులు.. పేదలకు టీఆర్ఎస్‌లో స్థానం లేదని ఆరోపిస్తూ టీడీపీ, వైసీపీ మంథని బంద్‌కు పిలుపునిచ్చాయి. 

జగన్నాటక సూత్రదారి నిజ దర్శనం నేడే

    అధికారంలో ఉండి ముఖ్యమంత్రి సైతం చేయలేని పనిని ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అవలీలగా సాధించి చూపాడు. అనేక మంది మంత్రులను, ఐఏయస్ అధికారులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామిక వేత్తలను అందరికీ కూడా చంచల్ గూడా జైలు భోజనం రుచి చూపించిన ఘనుడు జగన్. ఆ విధంగా అంతమందికి జైలులో ట్రీట్ ఇవ్వడం ఎవరికీ సాద్యం కాదని ఒప్పుకోక తప్పదు.   విజయమ్మ చెప్పినట్లు ఆయన ఏనాడు ప్రభుత్వ కార్యాలయంలో అడుగుపెట్టకపోయినా, ఎన్నడూ ఎవరినీ కలువకపోయినా, ఎవరికీ క్విడ్ ప్రో చేయమని ఆదేశాలు ఇవ్వకపోయినా, సీబీఐ, కోర్టులు, మీడియా, రాజకీయ పార్టీలు అన్నీ ఆయన ఉన్నతిని చూసి ఓర్వలేక కళ్ళలో నిప్పులు పోసుకొని అన్యాయంగా జైలు పాలు చేసాయని మనందరికీ తెలుసు.అయినప్పటికీ, ఆయన విశాల హృదయంతో లోపలున్నవాళ్ళకే కాకుండా, బయట ఉండిపోయిన మరి కొంతమంది మంత్రులకు కూడా జైల్లో ట్రీట్ ఇచ్చేందుకు సిద్దంగానే ఉన్నారు. కానీ, ఆ ట్రీట్ స్వీకరించడానికి మొహమాటపడుతూ కొందరు మంత్రులు, అధికారులు అనవసర భేషజాలకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారందరూ కూడా పాత సినిమాలలో క్లయిమాక్స్ సీనులో కుటుంబ సభ్యులందరూ విలన్ డెన్ దగ్గిర కలుసుకొన్నట్లు, ఈ రోజు సీబీఐ కోర్టు వద్ద కలుసుకోబోతున్నారు. వారిలో మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వంటి ప్రముఖులున్నారు. ఇంత కాలం ఆయనతో నేరుగా మాట్లాడే భాగ్యానికి నోచుకోకపోయినా, ఎవరి కంటికీ ఆయన కనిపించకపోయినా వారందరి తల రాతలు ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ఆ జగన్నాటక సూత్రధారి జగన్ మోహన్ రెడ్డిని వారు ఈ రోజు ప్రత్యక్షంగా కనులారా దర్శించుకోబోతున్నారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీలు వగైరా వచ్చిపడిన తరువాత అటువంటి గొప్ప వ్యక్తుల నిజరూప దర్శనం బొత్తిగా కరువయిపోయిందని బాధపడే జనాలకి ఊరట కలిగించడానికే, కోర్టు కూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రత్యేకదర్శనం ఏర్పాట్లు చేస్తుందేమో మరి తెలియదు. సీబీఐ వారందరిపై నమోదు చేసిన 5వ చార్జ్ షీటును ఈరోజు సీబీఐ కోర్టు విచారణకి స్వీకరిస్తున్నందున వారందరికీ సపరివార సమన్లు జారీ చేసి కోర్టుకి ఆహ్వానించింది.   దాదాపు ఆరు నెలలుగా బయట ప్రపంచాన్ని లోపలే ఉండి నడిపిస్తున్నఆ జగన్నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ రోజు జైలు బయట కాలుపెట్టబోతున్నాడు కనుక, ఆయన నిజరూప దర్శనం కోసం భారీగా జనాలు తరలివస్తున్నందున పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.   తాజా వార్తా: ఆయన, ఆయన అనుచరులు అందరూ తిరిగి తమ గూటికి (చంచల్ గూడా జైలుకి) ఇప్పుడే చేరుకొన్నారు. వారందరికీ కోర్టు ఈ నెల 21వరకు రిమాండ్ విదించింది.

డిప్యూటీ కే హోం!

      ఒక్కొక్కటిగా కాంగ్రెస్‌ పంచాయితీలు కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది.. సబిత రాజీనామతో కాలీ అయిన హోం శాఖ కోసం నిన్నటి వరకు భారీ పోటి నేలకొంది.. అయితే ఇదే సమయంలో డియల్‌ బర్తరఫ్‌తో ఆంద్రా నాయకులంతా డిల్లీ చేరి అన్ని అంశాలపై భారీ లాభీయింగ్‌నే నడిపారు.. దీంతో ఇప్పుడు హోం శాఖ కేటాయింపుపై స్పష్టత వచ్చినట్టుగానే కనిపిస్తుంది.. సభిత రాజీనామా తరువాత చాలా మంది రాష్ట్ర నాయకులు హోంశాఖ పై ఆశపడ్డారు. వీరిలో జానా రెడ్డి, శ్రీదర్‌బాబు,దామోదర రాజనరసింహ, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి లాంటి వారు ఉన్నారు.. అయితే జానా.. తనకు ఇంతకు ముందు హోం శాఖ నిర్వర్తించిన అనుభవం కూడా ఉండటంతో మరోసారి తనకే అవకాశం దక్కుతుందని భావించారు..         వీరితో పాటు తెలంగాణ సెంటిమెంట్‌తో డిప్యూటి సియం దామోదర రాజనరసింహ, వివాద రహితుడినని శ్రీదర్‌బాబు, మహిళ కోటాలో డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డిలు హోం శాఖ కోసం గట్టిగానే ప్రయత్నించారు.. కాని గత వారం రోజులుగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయసమీకరణాలతో హోం శాఖ డిప్యూటినే వరించినట్టుగా తెలుస్తుంది..         తన సొంతం నిర్ణాయాలతో సియం పార్టీకి నష్టం చేస్తున్నాడన్న వాదన బలంగా వినిపిస్తున్న రాజనరసింహకు ఈ హోం ఇవ్వడంతో సియంకు కూడా అధిష్టానం ఓ హెచ్చరిక చేయాలనుకుంటుంది అంటున్నారు విశ్లేషకులు.. ఇప్పటి వరకు ఇవన్ని ఊహాగానాలే అయినా దాదాపు దామోదర రాజనరసింహకే హోం శాఖ పగ్గాలు అప్పచెపుతారంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు..

డీయల్ పై ముఖ్యమంత్రి అనుచరుల కుట్ర

  కిరణ్ కుమార్ దెబ్బకు మంత్రిపదవి పోగొట్టుకొన్న రవీంద్రారెడ్డి, ముఖ్యమంత్రి అనుచరులు త్వరలో తాను పార్టీ వీడి వైకాపాలో జేరబోతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ తనను ఇప్పుడు పార్టీ నుండి కూడా బయటకి పంపేందుకే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనపటికీ తానూ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన మళ్ళీ మరో మారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన్న పథకాలను తీవ్రంగా విమర్శించారు. వాటి ప్రచారంపై ఉన్న శ్రద్ధ అమలులో చూపించాకపోవాదాన్ని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రి తన స్వంత ఇమేజ్ పెంచుకోనేందుకే టా పధకాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తానూ పదవుల కోసం ఏనాడు వెంపర్లాడలేదని, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే భిక్ష తనకి అవసరం లేదన్నారు.

కాంగ్రెస్ లోనే కొనసాగుతా, కిరణ్ కుమార్ కి ఎసరు పెడతా!

  మాజీ మంత్రి డీయల్ రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తానూ ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. త్వరలో మొదలవనున్న శాసన సభ బడ్జెట్ సమావేశాల తరువాత తానూ తన నియోజక వర్గంలో పర్యటించి, పార్టీ కార్యకర్తలకి ప్రజలకీ జరిగిన విషయాలన్నీ వివరిస్తానని అన్నారు. ఆయన శాసనసభ సమావేశాల తరువాత తన పర్యటనకి ముహూర్తం పెట్టుకోవడం గమనిస్తే ఈసారి ఆయన శాసన సభ సాక్షిగానే ముఖ్యమంత్రిపై తీవ్రంగా దాడిచేయబోతున్నారని అర్ధం అవుతోంది.   సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలలో లోటుపాట్లను, వాటి అమలులో జరుగుతున్న లోపాలను, ముఖ్యమంత్రి ప్రచారాడంబరత, దానిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించి ఆయన ప్రస్తావించి ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చును. సభలో ఆయన ప్రవర్తించిన తీరును బట్టి ఆయనను పార్టీలో కొనసాగించాల లేక బహిష్కరించాలా అనే విషయంపై ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి రావచ్చును.   డీయల్ తానూ పార్టీ నుండి బయటకి వెళ్ళిపోయే ఆలోచన గానీ, ఉంటే ఈ సమావేశాలలో ముఖ్యమంత్రికి నరకం చూపించే అవకాశం ఉంది. పాలక పక్ష సభ్యుడయిన ఆయనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం వలన ప్రతిపక్షాలకు మరిన్ని ఆయుధాలు అందించినట్లవుతుంది. మరి ఆయనను ముఖ్యమంత్రి ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.

మంత్రి వర్గ విస్తరణకి గంట కొట్టిన శ్రీనివాసరావు

  మంత్రి డీయల్ బర్త్ రఫ్, టీ-కాంగ్రెస్ నేతలు పార్టీ విడిచిపోవడం వంటి అంశాలతో అల్లకల్లోలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో వేడిని చల్లార్చేందుకు మంత్రి గంట శ్రీనివాసరావు త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగబోతోందని ప్రకటించారు. ఈ నెల 10నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ చల్లటి మాటతో కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ అసమ్మతివాదుల గొడవ వదిలిపెట్టి మంత్రి పదవులు దక్కించుకోనేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తారు. ఈ ప్రయత్నంలో అందరూ ఒక్కసారిగా ముఖ్యమంత్రికి అనుకూలంగా మారే అవకాశం ఉంది గనుక అప్పుడు వారు డీయల్ రవీంద్ర రెడ్డి, దామోదర రాజానరసింహ, రామచంద్రయ్య వంటి వారి స్వరాలను వినబడకుండా చేసే అవకాశం ఉంది.   ఈ నెల పదిన జరగనున్న మంత్రివర్గ సమావేశం నాటికి ఈ విషయంలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి ఖాళీ చేసిన హోం మంత్రి పదవికోసం పార్టీలో చాల మందే పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ, బొత్స సత్యనారాయణ ముందున్నారు. అయితే ముఖ్యమంత్రి వారిరువురికీ కూడా ఆ పదవి ఇవ్వకుండా మోకాలు అడ్డుపెడుతూ, తనకి విదేయులయిన మంత్రులలో ఎవరో ఒకరికి ఆ పదవి కట్ట బెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణతో బాటు, మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంది. రామచంద్రయ్య వంటి వారిని మరింత అప్రదాన్యమయిన పదవులలోకి పంపించి, దానిలో తనకు విదేయులయిన వారిని నియమించుకొనే అవకాశం ఉంది.

డిఎల్‌ దారెటూ..?

మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయటంతో ఇప్పుడు అందరి దృష్టి డిఎల్‌ రవీంద్రారెడ్డి నెక్ట్స్‌ స్టెప్‌ మీదే ఉంది.. చాలా కాలంగా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చెవిలో జోరిగగా తయారైన డిఎల్‌ రవీంద్రారెడ్డిని కిరణ్‌ అధిష్టానం అండదండలతో చావు దెబ్బ కొట్టాడు.. దీంతో ఇప్పుడు డిఎల్‌ భవిష్యత్తు డైలమాలో పడింది..     అయితే డిస్‌మిస్‌కు గురైన డిఎల్‌ కాంగ్రెస్‌ నేతల నుంచి మంచి మద్దత్తు అందుతుంది.. ముఖ్యంగా కిరణ్‌ వ్యతిరేఖ వర్గంతో పాటు పిసిసి చీఫ్‌ బొత్సాతో పాటు చిరంజీవిలాంటి నాయకులు బహిరంగంగానే డిఎల్‌కు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ సందర్భంలో డిఎల్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగాలా లేక పార్టీని వీడాలన్న విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు..   అయితే ఇప్పటికే డిఎల్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్టుగా ప్రచారం మొదలైంది.. మొదట వైఎస్సార్‌ ప్రాణ స్నేహితుడిగా ముద్రపడ్డ  డిఎల్‌ తరువాత జగన్‌ రాజకీయ ప్రవేశంతో ఆయనకు దూరం అయ్యారు.. 2009 ఎలక్షన్స్‌ తరువాత ఆ అంతరం మరింత పెరిగింది అయితే  తాజా పరిణామాలతో మరోసారి డిఎల్‌ వైయస్‌ కుటుంబానికి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తుంది..   అందుకు తగ్గట్టుగానే డిఎల్‌ ఇటీవల ఓ బహిరంగ సభలో ‘కాంగ్రెస్‌ పెద్దలు నా ప్రాణ స్నేహితుడి కుమారిడి మీద నన్ను పోటి చేయించారు’ అంటూ కాంగ్రెస్‌ నేతలపై విరుచుపడ్డారు.. ప్రస్తుతం అమలవుతున్నవన్ని వై యస్‌ పథాకాలే అంటూ రాజశేఖర్‌ రెడ్డిని కీర్తించారు.. ఈ పరిణామాలన్నీ డిఎల్‌ అడుగులు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపే అన్నట్టుగా ఉన్నాయి..     అయితే కొంతమంది డిఎల్‌ తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే కడప జిల్లా నుంచి వైయస్‌ కుటుంబంతో పాటు మైసూరా రెడ్డి కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌లో ఉండటంతో తాను అదే పార్టీలో చేరితే సముచిత స్థానం దక్కకపోవచ్చని భావిస్తున్నాడట.. అదే సమయంలో టిడిపి పార్టీలో మైసూరా వెళ్లిపోవడంతో కడప జిల్లాలో నాయకత్వం లేమి ఏర్పడటంతో ఆ గ్యాప్‌ డిఎల్‌ భర్తి చేయాలని భావిస్తున్నాడని అంటున్నారు..    డిఎల్‌ రవీంద్రా రెడ్డి మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాల తరువాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానంటున్నాడు..

రేవంత్ రెడ్డి కొత్త ఆరోపణలు

  కాంగ్రెస్ పార్టీతో తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కయరని వైకాపా నేతలు ఆరోపిస్తుంటే, తల్లీపిల్ల కాంగ్రెస్ పార్టీలు ఒకదానినొకటి రక్షించుకొంటున్నాయని తెదేపా ఆరోపిస్తోంది. కానీ, వారి మద్యలో వేలు పెట్టేందుకు కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ ప్రయత్నం చేయకపోవడం విశేషం. దానిని బట్టి కాంగ్రెస్ లోపాయికారిగా ఆ రెండు పార్టీలతో కూడా రహస్యంగా పొత్తులు పెట్టుకొని వాటితో డబుల్ గేం ఆడుతోందా అనే అనుమానం కలుగుతోంది.   వైకాపాతో ఆ పార్టీకి జగన్ అక్రమాస్తుల కేసులో అవినావ భావ సంబంధం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ రెండు పార్టీలను వేరు చేస్తూ వాటి మద్య ఉన్నఓ సన్నటి గీత జగన్ కేసులతో చెరిగిపోవడంతో ఇక్కడ తుంటి మీద కొడితే అక్కడ పళ్ళు రాలుతాయన్నట్లు తయారయింది ఆ రెండు పార్టీల పరిస్థితి.   ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ తెదేపా దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందనేది వైకాపా ఆరోపణ. తెదేపా తలుచుకొంటే అవిశ్వాసం పెట్టి కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని చిటికలో కూల్చగలదని, కానీ జగన్ను జైలు నుండి బయటకి రానీయకుండా ఉండేందుకే అవిశ్వాసానికి వెనకాడుతోందని వైకాపా ఆరోపణలు.   వీరి ఆరోపణ ప్రత్యారోపణలతో ప్రజలలో ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ, ఆ రెండు పార్టీలు మాత్రం రాజకీయ చదరంగం సాగిస్తూనే ఉన్నాయి.   జగన్ అక్రమాస్తుల కేసులో మొన్న విజయసాయి రెడ్డిని కూడా జగన్ ఉన్న చంచల్ గూడా జైలుకే తరలించడంతో వారినందరినీ, ఒకే జైలులో ఎందుకు పెడుతున్నారని తెదేపా నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నీ ప్రశ్నించారు. జగన్‌ కోరిక మేరకు వారినందరినీ ఒకే జైలులో పెట్టి వారికి ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సునీల్‌ రెడ్డిని కూడా అదే జైలులో కొనసాగిస్తూ,జగన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నందునే ఆయన బెయిల్‌ పిటిషన్‌ కూడా ఇంతవరకు వేయకపోవడం చూస్తే, ఈ వ్యవహాల వెనుక కిరణ్ కుమార్ రెడ్డి పరోక్ష సహాయసహకారలున్నాయని అర్ధం అవుతోందని ఆయన ఆరోపించారు.ఇప్పటికయినా ప్రభుత్వం వారందరినీ వేర్వేరు జైళ్ళలో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేసారు.   అదేవిధంగా జగన్ కి వ్యతిరేఖంగా మాట్లాడుతున్న డీయల్, శంకర్ రావు, బొత్స, దామోదర రాజానరసింహ వంటివారినందరినీ కూడా ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ మరో కొత్త ఆరోపణ కూడా చేసారు. తద్వారా వారిలో ముఖ్యమంత్రి పట్ల మరింత వ్యతిరేఖత పెంచాలని ప్రయత్నించినట్లు అర్ధం అవుతోంది.అయితే, సీబీఐ కోర్టు విజయసాయి రెడ్డికి రిమాండ్ విదిస్తే, దానికి ముఖ్యమంత్రే కారణమన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం విచిత్రం.

విద్యార్థులపై భారం మోపుతున్న ఆర్టీసీ

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) విద్యార్థులపై భారం మోపడానికి సిద్ధపడింది. ప్రస్తుతం వున్న నగరాలలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు రూ.85 నుండి రూ.130, గ్రామీణ ప్రాంతాల్లో 85 నుండి రూ.170 అలాగే రూట్ జనరల్ బస్ పాస్ ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి పంపగా రవాణాశాఖ మంత్రి, అధికారులు సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ ఉత్తర్వులు ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. 1994 లో బస్ పాస్ ధరలను పెంచిన తరువాత ఇప్పటివరకు పెంచలేదు. దీంతో రాయితీలతో కూడిన బస్ పాస్ వల్ల ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోందని కాబట్టి విద్యార్థుల బస్ పాస్ లపై ధరలు పెంచవలసిన అవసరం ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. 

ముఖ్యమంత్రి మార్పుకి రంగం సిద్దం అవుతోందా

  బహుశః ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన ఏ ముఖ్యమంత్రీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఎదుర్కొంటున్నంత అసమ్మతి ఎదుర్కోలేదేమో. అందుకు ప్రధాన కారణం ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎవరినీ లెక్క చేయకపోవడమేనని మీడియాతో సహా అందరూ విడమరిచి చెపుతున్నపటికీ, ఆయన మాత్రం తన పద్దతీ మార్చుకోలేదు, తన దూకుడు తగ్గించుకోలేదు. బహుశః ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నుండి ప్రేరణ పొంది, ఆవిధంగా ప్రవర్తిస్తున్నారనుకొన్నా, ఆయనలాగా అందరినీ కలుపుకుపోయే స్వభావం మాత్రం అలవరుచుకోలేక పోవడంతో అభాసుపాలవుతున్నారు. తత్ఫలితమే పార్టీలో నేడు ఈ అసమ్మతి, ఈ ముటా కుమ్ములాటలు.   డీయల్ రవీంద్ర రెడ్డిని పదవి నుండి అవమానకరంగా తొలగించడం, తెలంగాణా నేతలు పార్టీని వీడినప్పుడు వారిపట్ల చులకనగా మాట్లాడటం, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అనేక అంశాలు పార్టీలో ఆయనకు వ్యతిరేఖ వర్గాన్ని తయారు చేసాయి. రాష్ట్ర పాలన సంగతి ఎలా ఉన్నా, ముందు డిల్లీలో ఈ పంచాయితీలకి హాజరవడానికే ఆయనకి సరిపోతోందిపుడు.   ఆయన డిల్లీ నుండి తిరిగి హైదరాబాద్ చేరుకోనేసరికి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ డిల్లీ చేరుకొని, ఇప్పటికే అక్కడ తిష్ట వేసిన బొత్ససత్యనారాయణ, చిరంజీవి తదితరులతో కలిసి పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి పై పిర్యాదు చేయనున్నారు. ఈ అగ్నికి ఆజ్యం పోస్తునట్లు, మాజీ మంత్రి శంకర్రావు చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై, దానిలో ముఖ్యమంత్రి సోదరుడి పాత్రను వివరిస్తూ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు ఒక లేఖ వ్రాసారు. దీనిపై పార్టీ వెంటనే దృష్టిసారించకపోతే, ఆ తరువాత ఇదే 2జి కుంభకోణం వలె తయారయ్యి రాష్ట్రంలో పార్టీని బలి తీసుకొంటుందని ఆయన హెచ్చరించారు.   వీరందరూ ముఖ్యమంత్రి ని వ్యతిరేఖించడానికి ఎవరి కారణాలు వారికున్నపటికీ అందరు కలిసి ఆయన కుర్చీకి ఎసరు తెచ్చే అవకాశాలున్నాయి. అయితే, అధిష్టానం అండతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా తన పద్దతిలోనే ముందుకు సాగుతుండటం విశేషం. సాదారణంగా కాంగ్రెస్ పార్టీలో చిన్నగా మొదలయ్యే ఇటువంటి అసమ్మతి వ్యవహారాలే చివరికి ముఖ్యమంత్రి మార్పుకు దారి తీస్తాయని చరిత్ర చెపుతోంది. మరి ముఖ్యమంత్రి చేజేతులా పరిస్థితిని అంతవరకు తెచ్చుకొంటారా లేక పద్ధతి మార్చుకొని అందరితో కలిసి ముందుకు సాగుతారో చూడాలి.