రాం చరణ్ వి అన్నీఅబద్దాలేనట
posted on Jun 25, 2013 @ 1:52PM
మొన్నామధ్య మన మగధీరుడు-రాం చరణ్ తేజ్ తన కారుకి అడ్డొచ్చిన పాపానికి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకి తన మెగాతండ్రిగారి సెక్యురిటీ సిబ్బందితో నడిరోడ్డు మీద ఉతికేయించిన తరువాత, పాపం! వారి ఉద్యోగాలు పోతాయని జాలిపడి వారి మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా వదిలేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అతని దయార్ద హృదయం అర్ధం చేసుకోలేని మీడియా మాత్రం, సెక్యురిటీ గార్డులు, ఆ ఇద్దరు పిలకాయలను నడిరోడ్డు మీదే చితకకొట్టిన్నట్లుగాను, ఆ కొట్టుడు కార్యక్రమాన్ని మన మగధీరుడు పక్కన నిలబడి చూసి ఆనందిస్తునట్లుగాను, జరగనిది జరిగినట్లుగా వార్తలు గీకిపడేసి, లేనిదీ ఉన్నట్లుగా ఫోటోలను మార్ప్ఫింగ్ చేసి, ఆయనను అప్రదిష్ట పాలుచేసే ప్రయత్నం చేసాయి. అయినప్పటికీ, చరణ్ బాబు మళ్ళీ రచ్చచేయకుండా కేవలం చిన్న ఖండనతో సరిపెట్టేసి, వారిని కూడా వదిలిపెట్టేసి మరో మారు తన విశాల హృదయాన్ని ఈ కుత్సిత ప్రపంచానికి చాటి చెప్పాడు.
అయితే, కాకుల వంటి లోకులు నోళ్ళు మూయించడం చాలా కష్టమని ఆయనకి అర్ధమవడంతో, ఇక పీడకల వంటి స్ట్రీట్ ఫైట్ ని ఫ్లాష్ బ్యాక్ లోపడేసి నన్నెదిరించే మొనగాడు ఎవడు అంటూ బిజీ అయిపోయాడు. అయితే లోకంలో అందరూ ఆయనంత ఉదార హృదయులు, మంచి వారే కాకుండా ‘సలీం’ వంటి దుర్మార్గ న్యాయవాదులు కూడా ఉంటారు. కందకు లేని దురద కత్తి పీట కెందుకన్నట్లు, రాం చరణ్ జాలితో వదిలేసిన కేసుని, రాం చరణ్ పక్కా నిర్దోషి అని పక్కా జడ్జిమెంట్ ఇచ్చేసిన పోలీసులని కాదని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమవల్ల కాదని ముగించిన అధ్యాయాన్ని, పుచ్చుకొని మానవహక్కుల సంఘం(మా.హ.సం.)లో కేసువేశారు.
ఆ ఇద్దరు సాఫ్ట్ వేర్ పిలకాయలను అటు రాం చరణ్ వాయించి వదిలిపెడితే, కనీసం అతని మీద కేసయినా నమోదు చేయలేదు, పిలకాయలని ఆసుపత్రికి తీసుకుపోయి వైద్య పరీక్షలయినా చేయించలేదు, అసలు ఎవరు దోషో ఎవరు నిర్దోషో జడ్జిమెంటు ఇవ్వడానికి పోలీసులెవరు? అంటూ తన బుర్రకి తోచిన తిక్కతిక్క ప్రశ్నలు అన్నీ వేయడంతో, పాపం! మా.హ.సం.వారు కూడా “నిజమే! ఇదీ పాయింటే స్మీ! అని ఆయన మాటలు పట్టుకొని ఆ వ్యవహారం మీద దర్యాప్తు జరిపి నివేదిక ఇమ్మని నగర పోలీసు కమీషనరుకి హుకుం జారీ చేసారు.
ఒక పక్క రోజూ సరికొత్త హాట్ టాపిక్స్ కుప్పలు కుప్పలుగా వచ్చిపడిపోతుంటే, ఈ పాత శోదంతా అందరూ మరిచిపోయినా, మన దేశంలో చట్టం తన పని తానూ చేసుకుపోయే రూలోకటి ఉంది గనుక, మా.హ.సం. నుండి తాఖీదులు అందుకొన్న నగర పోలీసు కమీషనరు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక మా.హ.సం. చేతిలో నిన్ననే పెట్టారు.
అయితే, లోకంలో చెడ్డవారు అన్ని చోట్లా ఉంటారన్నట్లు ఆయన కూడా మన చరణ్ బాబుదే తప్పన్ని, ఆయన అన్నీ అబద్దాలే చెప్పాడని, మీడియాలో ప్రచురించిన ఫోటోలు అన్నీ నిజమయినవేనని, సెక్యురిటీ వాళ్ళు పిలకాయాలని రోడ్డు మీద పీకడం నిజమేనని, పోలీసులు కేసు నమోదు చేయలేదని, జరిగినది జరిగినట్లుగా అంతా పూస గుచ్చినట్లు వివరించి చెప్పేసాడా పెద్దాయన. అయితే, ఎందుకయినా మంచిదని ఆ సాఫ్ట్ వేర్ పిలకాయలు, చరణ్ బాబు ముగ్గురూ కూడా తెలుగులో, ఇంగ్లీషులో బూతులు తిట్టుకొన్నాకనే ఈ సీన్లనీ జరిగాయంటూ చిన్న కవరింగ్ ఇచ్చాడు.
ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదని అంటారు గానీ ఇలా పోలీసుల నోటిలో కూడా నానదని వినడం ఇదే మొదటిసారి. చట్టం తన పని తానూ మరీ ఇంత నిక్కచ్చిగా చేసుకుపోగలదని మనమేమైనా కలగన్నామా? అయితే ఈ కధ ఇంతటితో ముగిసిపోయిందో లేదో మ.హ.సంఘం వారే చెప్పాలి.