ఇప్పుడు ఆత్మీయయాత్ర ఎందుకో
తెరాస బాకా పత్రిక ‘నమస్తే తెలంగాణా’ కి రాష్ట్ర విభజనని వ్యతిరేఖిస్తున్న అంధ్రాప్రాంత ప్రజలకి తెలంగాణా విభజన పట్ల కలిగే లాభాలను వివరించాలని అకస్మాత్తుగా బుద్ది పుట్టింది. అనుకొందే తడవుగా ‘ఆత్మీయయాత్ర’ అనే పేరు తగిలించుకొని అంధ్రాప్రాంతంలో పర్యటన మొదలుపెట్టేసింది కూడా. రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామని ప్రజలకి నచ్చజెప్పడం దాని మరో ఉద్దేశ్యం.
ఆంధ్ర ప్రాంత ప్రజలను నోటికి వచ్చినట్లు తిడుతూ, ఇంత కాలంగా అన్నదమ్ములవలె కలిసి న్నరెండు ప్రాంతాల ప్రజల మద్య పెట్టవలసిన చిచ్చుఅంతాపెట్టిన తరువాత,ఇప్పుడు ఆ పుండు మీద కారం చల్లడానికన్నట్లు, మొదలుపెట్టిన ఈ ‘ఆత్మీయయాత్ర’కి ఎటువంటి స్పందన వస్తుందో తెలియకనే ఈ యాత్ర మొదలుపెట్టలేదు.
మొన్న రఘునందన్ రావు హరీష్ రావుపై చేసిన వసూళ్ళ ఆరోపణలతో, నిన్నఆంధ్రజ్యోతి పత్రికలో కేటీఆర్ మీద సెటిల్మెంటు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ కుటుంబం మీద, ఇటీవల హైదరాబాదులోని ఒక సాధారణ ఆటో డ్రైవర్ లక్ష్మి నారాయణ అనే యువకుడు తెలంగాణా కోసం ఆత్మహత్య చేసుకొంటూ వ్రాసిన లేఖలో కేసీఆర్ , అతని కుటుంబ సభ్యులు ఉద్యమాలు పక్కన బెట్టి, ఎన్నికలు పేరుతో డబ్బు సంపాదన కోసం అర్రులు చాస్తునారంటూ చేసిన ఆరోపణలు, తన చావుకి కేసీఆరే కారణమని స్పష్టంగా వ్రాయడంతో ప్రజలకి సమాధానం చెప్పలేక కేసీఆర్, అతని కుటుంబ సభ్యులు నానాఅవస్థలు పడుతున్నారు. బహుశః వీటన్నిటి నుండి బయటపడేందుకే, కేసీఆర్ తన చేతిలో ఉన్న ‘నమస్తే పత్రిక’ని ఈ యాత్రకి పంపించి ఉండవచ్చును.
దాని పర్యవసానం ఎలాఉంటుందో తెలియని అజ్ఞాని కాదు అతను. ఊహించినట్లే, నమస్తే పత్రికపై కొందరు దాడి చేయడం వెన్వెంటనే తెలంగాణాలో నిరసనలు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలూ, దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు అంతా ఖచ్చితంగా జరిగిపోయాయి. ఇప్పటికే, రెండు ప్రాంతాల మధ్య ప్రజల మద్య చిచ్చుపెట్టిన కేసీఆర్ కుటుంబం, తనను తాను రక్షించుకొనేందుకు, ఇప్పుడు మీడియాకు కూడా ఆజాడ్యం అట్టించాలని ప్రయత్నిస్తునట్లు కనబడుతోంది.
ఇక,ఒక సాదారణ ఆటో డ్రైవర్ కూడా కేసీఆర్ తెలంగాణా ఉద్యమాలలో నిబద్దత లేదని గుర్తించి ఎత్తిచూపినపుడు, అక్కడి ప్రజలకి ఈ విషయం తెలియదని, వారు గ్రహించలేరని కేసీఆర్ కి తెలియకపోదు. తన పదేళ్ళ తెలంగాణా అంశాన్ని ఎన్నికలు దగ్గిరపడుతున్న సమయంలో ఆఖరి నిమిషంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి ఎత్తుకుపోవాలని చూస్తుండగా, మరో వైపు వసూళ్లు, సెటిల్మెంటులు, కిడ్నాపులు ఆరోపణలలో చిక్కుకోవడం, కేసీఆర్ కే కాదు ఆపరిస్థితుల్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడయినా ఎలాగయినా బయటపడి, పరిస్థితులను మళ్ళీ తన అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా బహుశః అదే చేసాడని చెప్పవచ్చును.
కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తులను ఎదుర్కోవడానికి, పనిలోపనిగా తమమీద వస్తున్న ఆరోపణల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ ఆత్మీయయాత్ర మొదలుపెట్టించి ఉండవచ్చును. ఎన్నికల కోసం తెలంగాణా ఉద్యమాలను పక్కన పడేసిన తరువాత, చల్లబడిన తెలంగాణా సెంటిమెంటుని కూడా పనిలోపనిగా ఈ యాత్ర ద్వారా రెచ్చగొడితే, త్వరలో జరగనున్న పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలలో పార్టీకి లాభదాయకంగా ఉంటుందనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.
కేసీఆర్ కి లేదా నమస్తే తెలంగాణా పత్రికకి నిజంగా రెండు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం సృష్టించి, అన్నదమ్ములుగా విడిపోయేలా చేయాలనే ఉద్దేశ్యమే ఉంటే, ఇటువంటి చవకబారు ఆలోచనలకు బదులు, ఇరుప్రాంతాల మేధావులను ఒక చోటకు చేర్చి అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం కోసం ప్రయత్నించి ఉండేవారు.
రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగి, పరిష్కరించబడవలసిన తెలంగాణా సమస్యను కేంద్రంపైకి నెట్టేసి చేతులు దులుపుకొని, ఉద్యమాలు చేసుకొంటూ రాష్ట్రాన్ని తిరోగమన పధంలోకి నడిపిస్తున్న కేసీఆర్, తన స్వలాభం కోసం ఇటువంటి నీచమయిన ఎత్తుగడలకి పాల్పడటం అందరూ ఖండించాల్సిందే.