డీఎస్ దారిలో పొన్నాల! కారెక్కుతారా!

  ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆపార్టీని వీడి మరో పార్టీలోకి మారుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకపోవడంతో ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీని వదిలి వెళుతున్నారు. ఆఖరికి ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి.. ఎంతో రాజకీయానుభవం మూటగట్టుకున్న నేతలు కూడా పార్టీని వీడి వెళిపోతున్నారు. మొన్నీమధ్యనే డీఎస్ కూడా హస్తాన్నీ వీడి కారునెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా డీఎస్ దారిలో నడుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.   ఒక్కటిగా ఉన్న రాష్ట్ర విడిపోవడానికి కారణమయిన కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఉనికి లేకపోవడంతో పార్టీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ పిసిసి బాధ్యతలను భుజానేసుకున్నారు పొన్నాల. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం పొన్నాలను పీసీసీ భాధ్యలనుండి తీసి ఆస్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి పొన్నాలకు పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆహ్వానం అందడంలేదట. దీంతో పొన్నాల మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పొన్నాల తన సన్నిహితుల వద్ద కూడా వ్యక్తపరిచారంట. కాంగ్రెస్ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని.. పిసిసి పదవి నుంచి తనను తొలగించడంతో పాటు పలు రకాలుగా తనను కాంగ్రెసు నాయకత్వం అవమానించిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి మారాలని యోచన చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ నుండి రోజుకో నాయకుడు వేరే పార్టీలోకి వెళ్లడం జరుగుతోంది. ఇంకా ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

మొదటి రోజే రాజ్యసభలో రచ్చ

  అనుకున్నట్టుగానే పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ప్రారంభమయిన మొదటిరోజే పార్లమెంట్ లో ఆందోళనలు తలెత్తాయి. ముందునుండే విపక్షాలు వ్యతిరేక ధోరణితో ఉన్న కారణంగా పలు అంశాలపై వారు వివాదాలు లేవనెత్తారు. ముఖ్యంగా లలిత్ మోదీ వీసా వ్యవహారం. ఈ వ్యవహారం రాజ్యసభలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వీసా వ్యవహారంపై లలిత్ మోదీని ఎన్డీఏ ప్రభుత్వం వెనుకేసుకోస్తుందని.. లలిత్ మోదీ విదేశాలకు వెళ్లడానికి సుష్మా స్వరాజ్, వసుంధర రాజే సహకరించినా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. లలిత్ మోదీపై ఎఫ్ఐఆర్ దాఖలైందని.. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారని.. అయినా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదో కారణాలు చెప్పాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. మొత్తానికి ప్రారంభమయిన మొదటిరోజే ఇంత రచ్చ రచ్చగా ఉన్నాయంటే ఇంకా జరగబోయే రోజుల్లో ఎన్ని వివాదాలు తలెత్తుతాయో.

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు.. బైరెడ్డి

  ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అటు ఏపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కేంద్రమంత్రి సుజనా చౌదరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని..60 శాతం చర్చలు పూర్తయ్యాయని.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం ఖాయమని.. మరో నెలన్నర రోజుల్లో ప్రత్యేక హోదా తథ్యమని జోస్యం చెప్పారు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా రావడానికి నానా తంటాలు పడుతుంటే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద విద్యార్థులు చేపట్టిన దీక్షకు బైరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోస్తా ఆంధ్రా.. రాయలసీమ విడిపోయినప్పుడు రాయలసీమకు ప్రత్యేక హోదా అవసరమవుతుందని.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఏం అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ వర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ.. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా పై బైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నేతలందరూ మండిపడుతున్నారు.

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి మాత్రం ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు అనేక విషయాలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు సాగుతాయా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాలు సజావుగా సాగనివ్వవని తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోడీ ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా వివిధ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకుంటే కానీ సమావేశాలను సజావుగా సాగన్విబోమని నిన్ననే కాంగ్రెస్‌ నేతలు స్పష్టంచేశారు. ముఖ్యంగా లలిత్ గేట్ వివాదంలో సుష్మా స్వరాజ్, తప్పుడు డిగ్రీ వివరాలను ఈసీకి సమర్పించిన వివాదంలో స్మృతి ఇరానీల రాజీనామాలకు కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. వారు రాజీనామా చేస్తేకాని సమావేశాలు సజావుగా సాగుతాయని తేల్చి చెప్పారు.   మరోవైపు భూసేకరణ బిల్లు.. యూపీఏ పాలనలో ఉన్న భూసేకరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిన నేపథ్యంలో ఆ బిల్లును ఆమోదింపచేయాలని చూస్తుంది. కానీ ఈ భూసేకరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడో తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ బిల్లుపై ర్యాలీ కూడా చేశారు. ఇదిలా ఉండగా నిన్న జరిగిన సమావేశంలో మోడీ మాత్రం మీరు ఔనన్నా.. కాదన్నా భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టితీరుతామని.. ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. దీనిని బట్టి ఈ వ్యవహారంపై కూడా పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద రచ్చనే జరగబోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘అసలు యుద్ధాన్ని’ త్వరలో చూస్తారంటూ ప్రకటించారు. అంటే మోడీకి కూడా ముందే అర్ధమయివుంటుందని.. అందుకే అలా అని ఉంటారని భావిస్తున్నారు. మోడీ అన్నట్టుగానే ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎంత వాడివేడిగా జరగనున్నాయో చెప్పకనే చెప్పాయి.

రేవంత్ ను ఆకర్ష్ ఆకర్షించలేకపోయింది

  *రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఆకర్ష్ *రేవంత్ రెడ్డి కోసం టీఆర్ఎస్ ముఖ్యనేత రంగలోకి *విచారణలో ఉన్నాను.. ఇప్పుడు చెప్పను   తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కుట్ర పన్ని ఓ పథకం ప్రకారం నోటుకు ఓటు కేసులో ఇరికించారని అందరికి తెలిసిన విషయమే. అయితే అసలు విషయం ఏంటంటే తెలంగాణ అధికార పార్టీ అన్ని పార్టీలకు చెందిన నాయకులను ఆకర్ష్ మంత్రం ద్వారా తమ పార్టీలోకి లాకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై కూడా ఈ ఆకర్ష్ మంత్రాన్ని ఉపయోగించారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అందరి మీద ఆకర్ష్ మంత్రాన్ని విసిరినట్టే రేవంత్ రెడ్డి పై కూడా ఈ మంత్రాన్ని విసిరారట.. ఆయా నేతల స్థాయిని బట్టి వారికి సరితూగే నేతలను టీఆర్ఎస్ రంగంలోకి దించుతుండగా.. రేవంత్ రెడ్డి కోసం మాత్రం ఆపార్టీకి చెందిన ఓ ముఖ్య నేత రంగంలోకి దిగారట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పడం గమనార్హం.   తను ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ ఆసక్తికరమైన మాటలు చెప్పారు. అయితే ఆఫర్ చేశారని చెప్పనైతే చెప్పారు కానీ అసలు ఏం ఆఫర్ చేశారు. ఏం మాట్లాడారు.. అనే విషయాలు చెప్పలేదు. సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఇలాంటి ఆఫర్లు చేయడం సహజం.. తాను విచారణలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పడం సరికాదని.. అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా చెపుతానని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.   మొత్తానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ అనే మంత్రం ద్వారా పార్టీ నేతలనందరికి తమ వైపుకు తిప్పుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. ఎంతకాదనుకున్నా రేవంత్ రెడ్డి మంచి వాక్చాతుర్యం ఉన్న నేత.. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రితో సహా అందరితో గట్టిగా మాట్లాడగల వక్త. అలాంటి రేవంత్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి చాలా బలోపేతంగా ఉంటుందని.. అంతేకాక తెలంగాణ నుండి ప్రతిపక్ష నేతలలో గట్టిగా వాదించే సత్తా ఉన్న నాయకుడు కూడా రేవంత్ రెడ్డే.. కాబట్టి రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ఆలోచించారేమో అధికార పార్టీ నేతలు అందుకే రేవంత్ రెడ్డి పై వల విసిరారు. కానీ అంతా బాగానే ఉన్నా రేవంత్ రెడ్డిని సెలక్ట్ చేసుకోవడం టీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. ఎందుకంటే తెదేపా పార్టీలోని బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి.. తెదేపాకి.. పార్టీ అధ్యక్షుడికి నమ్మిన బంటు లాంటి వాడు రేవంత్ రెడ్డి . అలాంటి రేవంత్ రెడ్డిని తమ ఆకర్ష్ మంత్రం ద్వారా ఆకర్షించాలనుకోవడం తప్పు. వెరసి వాళ్లు చేసిన ఆఫర్లను రేవంత్ రెడ్డి తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్, వైకాపా పార్టీలు కుమ్మక్కయి.. రేవంత్ రెడ్డిపై కుట్ర పన్ని ఓటుకు నోటు కేసులో ఇరికించారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో హరీశ్ రావు, జగన్ కలిసి ఓ హోటల్ లో సమావేశమయ్యారన్న వార్తులు కూడా వచ్చాయి. మొత్తానికి డబ్బుకు లొంగలేని కారణంగా ఓ నాయకుడిపై కుట్రపన్ని ఇలా ఇరికించడం అన్యాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

3లక్షల ఇళ్లు.. 7లక్షల ఉద్యోగాలు.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌ ఏపీ సీడ్‌ క్యాపిటల్‌ ప్రణాళికను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని అందరూ గర్వపడేలా నిర్మిస్తామని.. 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్‌ క్యాపిటల్‌ అభివృద్ధి చేస్తామని అన్నారు. 3లక్షల నివాస గృహాలకు అనుగుణంగా బృహత్‌ ప్రణాళిక ఉందని.. ఈ ప్రణాళికతో 7లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని వివరించారు. ఆకర్షణీయ, పర్యావరణ హిత, స్వయం సమృద్ధి నగరంగా అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఏపీ సీడ్ క్యాపిటల్ సంబంధించి శనివారం ఫోటోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఔనన్నా..కాదన్నా బిల్లు ప్రవేశపెడతాం.. మోడీ

  మంగళవారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ విపక్ష నేతలూ.. మీరు ఔనన్నా.. కాదన్నా భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టితీరుతామని.. యూపీఏ పాలనలో ఉన్న భూసేకరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసిన నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరముందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని.. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు విపక్షాలపై కూడా ఉందన్నారు. మరోవైపు.. భూసేకరణ వంటి ముఖ్యమైన బిల్లులపై సర్కారు ముందడుగు వేస్తే దాన్ని తీవ్రంగా ప్రతిఘటించాలని కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్ష పార్టీలు గట్టిగా ఉన్నాయి. మొత్తానికి ఈ సారి పార్లమెంట్ సమావేశాలు వేడిగా జరుగుతున్నాయన్నది మాత్రం అర్ధమవుతోంది.

ఓటర్ కార్డుతో ఆధార్ లింక్.. లేకపోతే ఓటు లేదు

  సీఎం కేసీఆర్ బోగస్ ఓటర్ కార్డుల వ్యవహారంపై ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ నగరంలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోందని.. నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ కార్డుకు.. ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తామని..ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకుంటే ఓటు హక్కు ఉండదని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుకు ఈ ప్రక్రియను ముందు హైదరాబాద్ లో మొదలు పెడతామని.. తరువాత రాష్ట్రమంతటా అనుసంధానం చేస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన కంటే ముందే ఓటర్ల జాబితా సిద్ధం చేస్తామని చెప్పారు.

కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం

  సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి చేరే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరి శాసనసభకు పోటీ చేసి విజయశాంతి ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి విజయశాంతి రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కారు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నట్టు.. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో విజయశాంతి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్న విజయశాంతి.. కేసీఆర్ తన పార్టీలోకి అంగీకరిస్తే వెంటనే పార్టీలోకి చేరడమే అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. గతంలో కేసీఆర్ మెదక్ పార్లమెంటు సీటు ఇచ్చి విజయశాంతిని ఎన్నికల్లో గెలిపించిన సంగతి తెలిసిందే.

జగన్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకొస్తారేమో.. గాలి

  టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విరుచుకు పడ్డారు. పదేళ్ల యూపీఏ పాలనలో ఏనాడూ రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోలేదని.. ఇప్పుడు ఏపీలో రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉన్నా, రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఇప్పుడు ఏపీలో రైతు ఆత్మ హత్యలు తక్కువగా ఉన్నా రాహుల్ గాంధీ ఎందుకు పర్యటిస్తున్నారో.. ఉన్నట్టుండి రైతుల మీద ఇంత ప్రేమ కలగడానికి కారణం ఏంటో అర్ధం కావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. వైకాపా నేతలు కలిసి నాటకాలు ఆడుతున్నారు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేనిపోవడంవల్ల ఆపార్ట్టీలోని నేతలు వైకాపా లోకి చేరుతున్నారని.. ఈ నేపథ్యంలో అందరూ కలిసి జగన్ ను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువస్తారేమో అని జోస్యం చెప్పారు. పనికిమాలిన ప్రతిపక్షాలు దొరకడం ఏపీ చేసుకున్న దురదృష్టమని గాలి వ్యాఖ్యానించారు.

తలసాని పై ఫైర్.. కేసీఆర్ సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు

  తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరపున గెలుపొంది తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి మారి అదే పదవితో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తలసాని పార్టీ మారిన టీడీపీ తరపు గెలిచిన పదివితోనే టీఆర్ఎస్ లో కొనసాగడంపై రాజకీయ నేతలు పలు రకాలుగా ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ కూడా పదవికి రాజీనామా చేసినట్టు.. దానిని స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించలేదని వార్తలు వచ్చాయి. అయితే అసలు ట్విస్ట్ ఎంటంటే ఇప్పుడు తలసాని రాజీనామా చేసిన లేఖ ఇంతవరకూ స్పీకర్ కు అందలేదట. ఈ విషయాన్నికాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి చెప్పారు. తలసాని చేసిన రాజీనామా లేఖ ప్రతిని కోరుతూ కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి గత నెల 26న సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సెక్రటరీ-పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఈనెల 8న గండ్రకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. అందులో.. ‘ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ రాజీనామాకు సంబంధించిన లేఖ ఏదీ అసెంబ్లీ సచివాలయం వద్ద లేదు’ అని పేర్కొన్నారు. దీంతో అసలు అసలు కథ బయట పడింది. ఇప్పుడు తలసాని చేసిన పనికి ప్రతిపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. అటు కేసీఆర్ .. గవర్నర్.. స్పీకర్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.   మరోవైపు ఈ విషయంపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ఒక పార్టీ నుండి గెలుపొంది మరో పార్టీలో మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్దమని.. భారత దేశ చరిత్రలో ఎక్కడా లేదని.. కేసీఆర్ రాజ్యాంగాన్ని సైతం అణగదొక్కారని విమర్శించారు. తలసానిని రాజీనామా విషయంలో కేసీఆర్ గవర్నర్ ను, స్పీకర్ ను సైతం తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. లేకపోతే గవర్నర్ కు తెలిసే ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించారు. గవర్నర్ కు నైతిక విలువలు తెలిస్తే వెంటనే తలసానిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏమంత్రి, ఎమ్మెల్యే వచ్చిన రాజీనామా చేయించి మరీ టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్‌ ఇప్పుడు సిగ్గు,లజ్జా లేకుండా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీనివాస్‌ ఏ ఎన్నికల్లో నిలబడకుండా బహిష్కరణ వేటు వేయాలని ఎర్రబెల్లి అన్నారు. మరోవైపు తలసాని వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని అటు కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏరకంగా స్పందిస్తారో చూడాలి.

ఎమ్మెల్యేని తాళ్లతో బంధించిన ప్రజలు

  రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని హామీలు చేస్తారో వాళ్లకైనా గుర్తుంటుందో లేదో.. ఒక్కసారి ఎన్నికల్లో గెలిచారో అంతే వాళ్లిచ్చిన హామీలు గంగలో కలిసిపోయినట్టే. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలకడం తప్పా చేసేదేమి ఉండదు. ఒకవేళ ప్రజలు అడిగినా చేస్తామని మొహం చాటేస్తారు. అలా చేసిన ఒక ఎమ్మెల్యేని తాళ్లతో కట్టేసి బంధించి వాళ్లు అసహనాన్ని తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీవాసులు చూపించారు. వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్‌ సరాయ్‌ నియోజకవర్గంలోని చందౌలీవాసులు కరెంటు ఉండకపోవడం. మంచినీళ్ళ రాకపోవడంపై స్థానిక బిఎస్పీ ఎమ్మెల్యే బబన్ సింగ్ చౌహాన్ అనే ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారంటా. కానీ బబన్ సింగ్ చౌహాన్ మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదటా.. అయితే ఆయన స్థానికంగా ఉన్న ఓ కౌన్సిలర్‌ భర్తతో కలసి రంజాన్ శుభాకాంక్షలు చెప్పడానికి చందౌలీ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ మీటింగ్ పెట్టారంటా. ఈ నేపథ్యంలో చందౌలీవాసులు వాళ్లు సమస్యలు గురించి మరోసారి నిలదీసేసరికి మాటమాట పెరిగిందట. అంతే అసలే కోపంగా ఉన్న చందౌలీవాసులు ఎమ్మెల్యే బబన్ సింగ్ చౌహాన్ ను తాళ్లతో కట్టేసి బంధించారట.

రేవంత్ కు ధైర్యం చెప్పిన ఖైదీలు

  తెదేపా ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి నెల రోజులు జైలులో ఉన్న సంగతితెలిసిందే. కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రేవంత్ రెడ్డికి అక్కడి ఖైదీలే ధైర్యం చెప్పారంటూ.. ఈవిషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డినే చెప్పారు. అంతేకాదు ఇంకా పలు రకాల ఆసక్తికర విషయాలు చెప్పారు రేవంత్ రెడ్డి. జైలులో తనకు వంట మనిషికా నాగయ్య అనే ఖైదీని నియమించారని.. అతను చెప్పిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని వెల్లడించారు. మీలాంటి వాళ్లు ఇంత దూరం రాకూడదు.. జైలుకే వచ్చారు ఇంకా కేసీఆర్ మిమ్మల్ని ఏం చేస్తాడు? ఏదైతే అది జరుగుద్ది అని ధైర్యం చెప్పారంటా. 'సావుకు మించిన ధైర్యం లేదు. గోసిగుడ్డకు మించిన దరిద్రం లేదు.. ఇంత దూరం వచ్చిన మిమ్మల్ని కేసీఆర్ ఏం చేయలేడని చెప్పారంటా.

జయ ఆరోగ్యం గురించి మాట్లాడితే నాలుక కోస్తా.. పీ.ఆర్

  గత పదిరోజుల క్రితం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం బాలేదంటూ.. ఆమె ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు జోరుగా షికార్లు చేశాయి.. ఆ విషయం తెలిసిందే. జయలలితకు ఆరోగ్య సరిగా లేదని.. ఆమె తీవ్రమైన మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారని.. అందుకే పదవికి ప్రమాణస్వీకారం చేసినా కూడా ఎక్కువగా ఇంట్లో ఉండే బాధ్యతలు నిర్వహిస్తున్నారని పలు వదంతులు వ్యాపించాయి. ఈ విషయంపై ప్రతిపక్షనేతలు కూడా జయలలిత ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలంటూ వాదనలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఎంపీ పీ.ఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జయలలితకు ఆరోగ్యం బాలేదని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రతిపక్షాలు కావాలనే ఇలాంటి తప్పుడు సంకేతాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇంకోసారి అమ్మ ఆరోగ్యంపై ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. కాగా కేంద్రంలో భూసేకరణ చట్టం ఆమోదం కోసం ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా జయలలిత మద్దతు కోరారని, అమ్మ మద్దతిస్తే చట్టం సులభంగా ఆమోదం పొందుతుందని అన్నారు. కాగా తన ఆరోగ్యపై తప్పుడు కథనాలపై తీవ్రంగా స్పందించిన జయలలిత రెడిఫ్ వెబ్‌సైట్‌పై జయలలిత పరువునష్టం దావా కూడా వేశారు.

కేసీఆర్ ను పొగిడిన లగడపాటి

  అప్పుడెప్పుడో రాష్ట్ర విభజన సమయంలో హడావుడి చేసిన లగడపాటి రాజగోపాల్ అప్పటినుండి ఇప్పటివరకూ ఎక్కువ ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆంధ్ర రాష్ట్రం తరపున గట్టిగా పోరాడిన వారిలో రాజగోపాల్ కూడా ఉన్నారు. ఒకటిగా ఉన్న రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ర్టాల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పిన అప్పటి ఎంపీల్లో ఒకరు. అంతేకాక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని చెప్పి సవాల్ చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మాట మీద కట్టుబడి నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఉద్యమ సమయంలో రాజగోపాల్ కి, అప్పట్లో ఎంపీ గా ఉన్న కేసీఆర్ కు మధ్య పెద్ద మాటల యుద్ధాలే జరిగాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు అదే రాజగోపాల్ కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఎందుకంటారా... గోదావరి మహా పుష్కర స్నానాల సందర్భంగా రాజగోపాల్ అతని కుటుంబసభ్యులు కలిసి కరీంనగర్ జిల్లా మంథనిలో పుష్కర స్నానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పుష్కర్ల ఏర్పాటు చాలా బాగా చేశారని.. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అంతేకాక ఆంధ్రానుండి కూడా భక్తులు తెలంగాణకు పుష్కర స్నానాలు చేయడానికి వస్తున్నారని.. వారికి కూడా సౌకర్యాలు కల్పించాలని కోరారు.

తలసాని రాజీనామా చేయనేలేదా?

  కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి సమాచార హక్కు క్రింద తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా గురించి శాసనసభ కార్యాలయానికి వ్రాసిన ఒక లేఖకు డిప్యూటి సెక్రెటరీ మరియు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నరసింహాచార్యులు బదులిస్తూ “తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి తమకు ఇంతవరకు రాజీనామా లేఖ రాలేదని” తెలియజేసారు. ఆయన ఈ విషయాన్ని గండ్ర వెంకట రమణా రెడ్డికి ఈనెల 8న లిఖిత పూర్వకంగా తెలియజేసారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గత డిశంబర్ నెలలో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కనీ ఇంతకాలంగా దానిని స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించలేదని చెప్పుకొంటున్నారు. కానీ సమాచార హక్కు క్రింద గండ్ర అడిగిన ప్రశ్నతో తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి ఇంతవరకు పంపనే లేదని స్పష్టం అయ్యింది.

నేడు సింగపూర్ మంత్రితో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రణాళికను తయారుచేసిన సింగపూర్ సంస్థల బృందం, ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్ తో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకొన్నారు. వారు ఈరోజు రాజమండ్రి చేరుకొని రాజధాని ప్రధాన నగరం యొక్క బృహత్తర ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేస్తారు. అనంతరం వారు ఆయనతో కలిసి సాయంత్రం 4 గంటలకు షెల్టాన్ హోటల్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. మూడు రోజుల క్రితం వారు విడుదల చేసిన రాజధాని నగర ఊహాచిత్రాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈరోజు మీడియా సమావేశంలో వారు రాజధాని గురించి మరిన్ని ఆసక్తికరమయిన విశేషాలు, వివరాలు ప్రజలకు తెలియజేయవచ్చును. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాలను స్వయంగా పర్యవేక్షించేందుకు రాజమండ్రిలో బస చేసి ఉన్నందున వారు అక్కడికే వచ్చి రాజధాని ప్రణాళికను అందజేయాబోతున్నారు. ఈ సందర్భంగా వారు పుష్కరాలు జరుగుతున్న తీరును కూడా పరిశీలించే అవకాశం ఉంది.