పుష్కర్ ఘాట్ వద్ద అగ్నిప్రమాదం, ప్రాణ నష్టం లేదు
రాజమండ్రి పుష్కరఘాట్ కి అతిసమీపంలో గోకవరం బస్టాండ్ వద్ద గల ఒక హోటల్లో గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకవడంతో పేలిపోయి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయలయినట్లు సమాచారం. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమీపంలో ఉన్న మూడు పోలీసు వాహనాలు, ఒక ఆటో, కొన్ని షాపులు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. కానీ ఈ విషయం తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. అక్కడే ఉన్న పోలీసులు తీవ్ర భయాందోళనతో ఉన్న ప్రజలను ఒక పద్దతిలో చాలా వేగంగా అక్కడి నుండి దూరంగా తరలించడంతో ఎటువంటి త్రొక్కిసలాట జరగకుండా నివారించగలిగారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇతర వాహనాలను, ప్రజలను తక్షణమే దూరంగా తరలించి, ఎవరూ లోపలకి రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది. అగ్నిమాపక సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉండటంతో మంటలు చుట్టుపక్కలకు విస్తరించక ముందే అదుపుచేయగలిగారు.
ఈ ప్రమాద సంగతి తెలుసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకొని అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఆయనతో బాటు కొంతమంది మంత్రులు, ఉన్నతాధికారులు, పుష్కర నిర్వాహకులు అందరూ అక్కడికి చేరుకొని క్షణాలలోనే పరిస్థితిని చక్కదిద్దగలిగారు. ఈ ప్రమాదం గురించి ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసారు.