అర్ధరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో రెండో రోజు కూడా గోదావరి మహాపుష్కర స్నానాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండు రోజు కూడా భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, తెలంగాణలోని భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఘాట్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. కాగా నిన్న రాజమండ్రిలోని పుష్కర ఘాట్ తొక్కిసలాట నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా అక్కడ ఏపీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు కూడా మంగళవారం అర్ధరాత్రి వరకు పుష్కర ఘాట్‌ల వద్ద కలియతిరిగి అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాల సమాచారం కోసం 8333000020 టోల్‌ఫ్రీ ఫోన్‌లో సంప్రదించాలని అధికారులు కోరారు.