గాయకుడు రామకృష్ణ కన్నుమూత
ప్రముఖ గాయకుడు విస్సంరాజు రామకృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. జూబిలీ హిల్స్ వెంకటగిరిలోని తన నివాసంలో రామకృష్ణ తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ 1947, ఆగస్టు 20వ తేదీన విజయనగరంలో జన్మించారు. ప్రముఖ గాయని పి.సుశీల రామకృష్ణకు పిన్ని. రామకృష్ణ నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు నటించిన అనేక చిత్రాలకు ఆయన పాటలు పాడారు. భక్తి గీతాలను పాడటంలో రామకృష్ణది ప్రత్యేక శైలి. మహాకవి క్షేత్రయ్య, దాన వీర శూర కర్ణ, అమరదీపం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం, బలిపీఠం, గుణవంతుడు, అందాల రాముడు, తాత-మనవడు, భక్త తుకారాం, శారద, భక్త కన్నప్ప, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు వంటి అనేక చిత్రాల్లో ఆయన పాడిన పాటలు చిరస్థాయిగా నిలిచాయి. దాదాపు 200 చిత్రాలలో ఐదు వేలకు పైగా పాటలు పాడారు. ఎన్నో భక్తి గీతాల ఆల్బమ్స్‌లో కూడా ఆయన పాటలు పాడారు. ప్రముఖ నటుడు సాయికిరణ్ రామకృష్ణ తనయుడు. రామకృష్ణ కన్నుమూత పట్ల సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.