నేడు అనంతపురంలో రాహుల్ పాదయాత్ర
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అనంతపురం జిల్లాలో ఓబులదేవర చెరువు నుండి కొండకమర్ల గ్రామం వరకు సుమారు 10 కి.మీ పాదయాత్ర చేస్తారు. ఆయన ఉదయం డిల్లీ నుండి బెంగుళూరు విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుండి నేరుగా జిల్లాలో ఓబులదేవర చెరువు గ్రామంలో ఇందిరా గాంధీ వేదిక వద్దకి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన పాదయాత్రను ఆరంభిస్తారు. దారిలో మామిళకుంటుపల్లి, దేబురాపల్లి గ్రామాలలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలని, మహిళా స్వయం సహాయక సంఘాలను, చేనేత కార్మికులను, విద్యార్ధులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు. దారిలో కొండకమర్ల గ్రామం వద్ద బహిరంగ సభ నిర్వహించి తన పాదయాత్రను ముగించి మళ్ళీ సాయంత్రం బెంగళూరు నుండి డిల్లీకి విమానంలో వెళ్ళిపోతారు.
ఈసారి ఆయన పాదయాత్రకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయన ఓబులదేవర చెరువు గ్రామంలో అంబేద్కర్ విగ్రహంతో బాటు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి తన పాదయాత్ర ఆరంభిస్తారు. రాష్ట్ర విభజన వలన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందనే కారణంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలకు రాష్ట్ర విభజన వలన రాష్ట్రానికి మంచే జరిగిందని ఆయన నచ్చజెప్పబోతున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో బాటు సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓడిపోయినా తరువాత నుండి ఇంతవరకు ప్రజలకు మొహాలు చూపించని ఆనం రామనారాయణ రెడ్డి, పళ్ళం రాజు, కిల్లి క్రుపారాణి, కెవిపి రామచంద్రరావు, తన 150వ సినిమా నిర్మాణంపైనే దృష్టిపెట్టిన చిరంజీవి, ఏఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి కొప్పలరాజు తదితరులు కూడా పాల్గొంటారు.
ఇదివరకు రాహుల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేసినప్పుడు కేవలం ఆ రాష్ట్ర నేతలే ఆయన వెంట వచ్చేరు. కానీ ఈసారి ఆయనతో బాటు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల పీసీసీ కార్యవర్గ సభ్యులు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.