తలసాని పై ఫైర్.. కేసీఆర్ సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు
posted on Jul 20, 2015 @ 3:52PM
తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ తరపున గెలుపొంది తరువాత టీఆర్ఎస్ పార్టీలోకి మారి అదే పదవితో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తలసాని పార్టీ మారిన టీడీపీ తరపు గెలిచిన పదివితోనే టీఆర్ఎస్ లో కొనసాగడంపై రాజకీయ నేతలు పలు రకాలుగా ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ కూడా పదవికి రాజీనామా చేసినట్టు.. దానిని స్పీకర్ మధుసూదనాచారి ఆమోదించలేదని వార్తలు వచ్చాయి. అయితే అసలు ట్విస్ట్ ఎంటంటే ఇప్పుడు తలసాని రాజీనామా చేసిన లేఖ ఇంతవరకూ స్పీకర్ కు అందలేదట. ఈ విషయాన్నికాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి చెప్పారు. తలసాని చేసిన రాజీనామా లేఖ ప్రతిని కోరుతూ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి గత నెల 26న సమాచార హక్కు చట్టం కింద అసెంబ్లీ సచివాలయానికి దరఖాస్తు చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సెక్రటరీ-పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ ఈనెల 8న గండ్రకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. అందులో.. ‘ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ రాజీనామాకు సంబంధించిన లేఖ ఏదీ అసెంబ్లీ సచివాలయం వద్ద లేదు’ అని పేర్కొన్నారు. దీంతో అసలు అసలు కథ బయట పడింది. ఇప్పుడు తలసాని చేసిన పనికి ప్రతిపక్షాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. అటు కేసీఆర్ .. గవర్నర్.. స్పీకర్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు ఈ విషయంపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ఒక పార్టీ నుండి గెలుపొంది మరో పార్టీలో మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్దమని.. భారత దేశ చరిత్రలో ఎక్కడా లేదని.. కేసీఆర్ రాజ్యాంగాన్ని సైతం అణగదొక్కారని విమర్శించారు. తలసానిని రాజీనామా విషయంలో కేసీఆర్ గవర్నర్ ను, స్పీకర్ ను సైతం తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. లేకపోతే గవర్నర్ కు తెలిసే ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించారు. గవర్నర్ కు నైతిక విలువలు తెలిస్తే వెంటనే తలసానిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏమంత్రి, ఎమ్మెల్యే వచ్చిన రాజీనామా చేయించి మరీ టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు సిగ్గు,లజ్జా లేకుండా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీనివాస్ ఏ ఎన్నికల్లో నిలబడకుండా బహిష్కరణ వేటు వేయాలని ఎర్రబెల్లి అన్నారు. మరోవైపు తలసాని వ్యవహారంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని అటు కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏరకంగా స్పందిస్తారో చూడాలి.