బీజేపీకి ఆయుధాలు అందించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి
posted on Jul 22, 2015 @ 9:57PM
పార్లమెంటు సమావేశాల తొలిరోజు నుండే కాంగ్రెస్, బీజేపీల యుద్ధం ప్రారంభం అయిపోయింది. లలిత్ మోడీ వ్యవహారంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలను, వ్యాపం కుంభకోణం లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామాలకు పట్టుబడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి మహమ్మద్ షాహీద్ మద్యం షాపుల లైసెన్సులు మంజూరు చేసేందుకు లంచాల కోసం కొందరు వ్యక్తులతో చేసిన బేరసారాలను ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ ద్వారా చిత్రీకరించింది. ఈ సంగతి తెలుసుకొన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేసారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆ వీడియో క్లిప్పింగ్ బీజేపీ చేతికి చిక్కింది. బీజేపీ దానినే అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేసింది.
తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై చర్చించదానికి తాము సిద్దంగా ఉన్నామని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన ముఖ్యమంత్రి హరీష్ రావత్ అవినీతి భాగోతంపై చర్చకు సిద్దపడాలని సవాల్ విసిరింది. మళ్ళీ లోక్ సభ రేపు సమావేశమయినప్పుడు ఇరు పక్షాలు మరిన్ని అస్త్రశస్త్రాలతో వచ్చే అవకాశం ఉంటుంది కనుక రేపటి నుండి పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత తీవ్ర వాగ్వాదాలు జరగవచ్చును.