టీడీపీ మంత్రుల ఇంగ్లీష్ కష్టాలు..
posted on Jul 23, 2015 @ 12:37PM
సరిగా మాట్లాడటం రాని వాళ్లు కూడా రాజకీయ నాయకులు అయిపోతున్నారు. పొట్టకోస్తే అక్షరం ముక్క రానివాళ్లు మంత్రులు, ఎంపీలు అయిపోతున్నారు. అలా సరైన అవగాహన లేకుండా ఆంగ్ల మీడియాతో మాట్లాడి పరువు తీశారు మన టీడీపీ ప్రబుద్ధులు. అసలే ఉన్న తలనొప్పులతో సరిపోక చంద్రబాబుకు ఈ నేతల ఆంగ్ల తంటాలు మరో తలనొప్పయ్యాయి. గోదావరి మహా పుష్కరాల సందర్భంగా మొదటి రోజు జరిగిన తొక్కిలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి దీనికి కారణం చంద్రబాబే అంటూ ఊదరగొట్టారు ప్రతిపక్షనేతలు. ఈ నేపథ్యంలోనే ఆంగ్ల మీడియా కూడా దీనిమీద చర్చ జరిపింది. ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి ఈ చర్చకు సారధ్యం వహించారు. అసలు జర్నలిస్ట్ అంటే అర్ణబ్ గోస్వామిలా ఉండాలి అని.. ప్రశ్నలతో నేతలకు చెమటలు పట్టిస్తాడు అని అంటుంటారు అందరూ. అలాంటి అతని దగ్గర మన నేతలు ఎలా ఉండాలి కాని గోదావరి పుష్కరాల గురించి అడిగిన ప్రశ్నలకు మన నేతలు సమాధానం చెప్పలేక చెమటలు కక్కారు.
ఈ చర్చలో టీడీపీ తరుపున రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పాల్గొన్నారు. కానీ ముగ్గురిలో ఒక్కరు కూడా మీడియా ప్రతినిధులకు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. తొక్కిసలాటకు భద్రత ఏర్పాట్లలోని లోపాలే కారణమని చెప్పి ఒప్పించలేక విఫలమయ్యారు. దీంతో వచ్చిరాని ఇంగ్లీష్ తో నేతలు జాతీయ స్థాయిలో పరువు తీశారని.. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలను తిప్పికొట్టలేకపోయారని చంద్రబాబుఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాక ఇక నుండి ఆంగ్ల మీడియాతో మాట్లాడే భాద్యతను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న గల్లా జయదేవ్ కు అప్పగించారట. మొత్తానికి మన నేతలు చేసిన ఘనకార్యం వల్ల పార్టీ పరువుపోయేలా చేశారు. ఇప్పుడైనా మేల్కొని కనీసం వాదనలు వినిపించగలిగేంత ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.