ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు పుష్కరాలలో కుట్రలు?
posted on Jul 23, 2015 @ 12:02PM
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మహా పుష్కరాలను చాలా ప్రతిష్టాత్మకంగా భావించి చాలా భారీగా ఏర్పాట్లు చేసింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దానిని అంగీకరించేందుకు సిద్దంగా లేవు. అవి ఎంతసేపూ పుష్కరాల మొదటి రోజు జరిగిన దుర్ఘటన గురించి, చిన్న చిన్న సమస్యల గురించి మాత్రమే పనిగట్టుకొని చెడు ప్రచారం చేస్తున్నాయి. కానీ పుష్కర స్నానాలు చేసి వస్తున్న భక్తులందరూ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై చాలా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. అంచనాలకు మించి నిత్యం లక్షలాది మంది భక్తులు పుష్కరస్నానాలకు తరలివస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం తడబడకుండా గత తొమ్మిది రోజులుగా దిగ్విజయంగా పుష్కరాలను నిర్వహిస్తోంది. కానీ నిన్న సాయంత్రం రాజమండ్రి పుష్కర్ ఘాట్ సమీపంలో గోకవరం బస్ స్టాండ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
ఇది పొరపాటున జరిగిన ప్రమాదమా? లేక దీని వెనుక ఏదయినా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి రోజున జరిగిన దుర్ఘటన జరిగినప్పుడు కరెంటు వైర్లు తెగిపడ్డాయని ఎవరో పుకార్లు లేవదీయడం వలననే త్రొక్కిసలాట జరిగి 27మంది చనిపోయినట్లు అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ఎవరయినా ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటి కుట్రలు పన్నుతున్నారా? లేక ఈ దుర్ఘటనలు, ప్రమాదాలు యాదృచ్చికంగా జరిగినవేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ కోణం నుండి కూడా ఈ రెండు దుర్ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ కుట్రలు జరిగి ఉండి ఉంటే అది నీచ రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చును. ఈ రెండు దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ఈ రెండు రోజులు పోలీసులు, అధికారులు, పుష్కర నిర్వాహకులు, ప్రజలు అందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.