అమరావతికి డబ్బు ఎలా వస్తుంది!
posted on Jul 22, 2015 @ 5:38PM
ఏపీ ప్రభుత్వం ఏపీ సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన ఫొటోలు విడుదుల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోలతో ఒక్కసారిగా అమరావతిపై అంచనాలు అమాంత పెరిగిపోయాయి. ఈ సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ అందజేశారు. అంతేకాక అమరావతికి నిర్మాణానికి వాస్తు100 శాతం బావుందని.. ప్రపంచ దేశాలను తలదన్నేల ఏపీ రాజధాని ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంతా బానే ఉంది కాని ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణానికి కావాలసిన డబ్బు ఎక్కడినుండి వస్తుంది.. ఎవరిస్తారు అనే సందేహాలు మొదలయ్యాయి. ఒక రాష్ట్రానికి కావలసిన రాజధానిని ఉన్నపలంగా నిర్మించాలంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. అసలే రాష్ట్ర విభజన జరిగి ఆర్ధిక లోటుతో ఉన్న ఏపీకి ఎలాగొలా అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఇందుకుగాను తాము అప్పులుచేసి మరీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని.. 5 వేల కోట్లతో అప్పుల్లో ఉన్నామని.. ఆర్ధిక సహాయం చేయాలని కేంద్రానికి లేఖలు కూడా రాసింది ఏపీ ప్రభుత్వం. మరి అలాంటి పరిస్థితిలో ఇప్పుడు రాజధాని నిర్మాణమంటే మామూలు విషయం కాదు. .. దానికి లక్షల కోట్లు కావాలి.. ఎంతో మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. మరి మ్యాన్ పవర్ అయితే ఉంది కానీ డబ్బులే లేవు. మరి ఆ డబ్బు ఎక్కడినుండి వస్తుంది.
దానికోసం ఏపీ ప్రభుత్వం సింగపూర్, జపాన్ దేశాల నుండి పెట్టుబడిదారులను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానకి ఇప్పటికే చంద్రబాబు వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ పెట్టుబడులకు వాటాగా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్ధిక లోటు కారణంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను చూపించనుంది. ఈ భూముల విలువను లెక్కించి దానిని ఏపీ వాటాగా నిర్ణయిస్తారు. ఇంకా ఏపీ ప్రభుత్వం త్వరలో ఒక కంపెనీని ఏర్పాటు చేసి సింగపూర్, జపాన్ ప్రభుత్వాలు భాగస్వాములుగా చేస్తారు. సింగపూర్, జపాన్‌లలో ఒక దేశానికి 50 శాతం ఉంటుందని చెబుతున్నారు.. ఏపీకి 25 శాతం వాటా ఉంటుందనే అంచనా ఉంది. అయితే ఏపి రాజధాని అమరావతిలో జపాన్ పెట్టుబడులు పెడుతున్న చోట జరిగే కొనుగోళ్లలో 65 శాతం మెటీరియల్ ను జపాన్ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని కండీషన్ పెట్టింది. మిగిలిన 35 శాతం కొనుగోళ్లను స్థానికంగా చేసుకోవచ్చని సూచించంది.