పవన్ కళ్యాణ్ ప్రశ్నలు పనిచేశాయా!
posted on Jul 22, 2015 @ 4:23PM
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోను ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే అందరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పనిలో పనిగా ఏపీ ప్రత్యేక హోదా గురించి కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై ప్రశ్నల బాణాలు సంధించారు. అక్కడితో ఆగకుండా ట్విట్టర్‌లో కూడా టిడిపి ఎంపీల పైన పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ కి, టీడీపీ కి మధ్య విబేధాలు కూడా వస్తాయనుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలు నేతలపై పనిచేశాయా అంటే ఒక రకంగా పనిచేశాయనే అనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఏపీ సిఎం నారా చంద్రబాబు పై ఈ ప్రశ్నలు మరింత ప్రభావం చూపాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో చంద్రబాబు ఏపీకి రావాల్సిన అంశాలపై పట్టుబట్టాలని ఎంపీలకు, పార్టీ కేంద్రమంత్రులకు సూచించారట.
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో ఏపీ తరపు ఎంపీలు ప్రత్యేక హోదా కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పార్లమెంట్ కి వెళ్లగానే ఏం చేస్తారో తెలియదు.. వాళ్లకేమవుతుందో తెలియదు అన్న మాటలు గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అలా సమావేశాలు ప్రారంభమయ్యాయో లేదో వెంటనే ఏపీ ప్రత్యేక హోదా అంశం తీసుకొచ్చారు. మరి చంద్రబాబు ఆదేశాల మేరకు పార్లమెంటు సమావేశాల్లో ప్ర్తత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు ఎంత వరకు పోరాడుతారనే విషయమై చూడాల్సి ఉంది. అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుండి ఎంపీలు లేకపోయినప్పటికీ అధిష్టానాన్ని ఒప్పించి బిజెపిని నిలదీయాల్సి ఉంటుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రశ్నలు మన నేతల మీద బానే పనిచేశాని తెలుస్తోంది.