నేడే శాసన మండలి ఎన్నికల ఫలితాలు
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో చెరో రెండు శాసనమండలి స్థానాలకు మొన్న ఆదివారంనాడు ఎన్నికలు జరిగాయి. ఈరోజు వాటి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించబడుతాయి. రెండు రాష్ట్రాలలో జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను కాకినాడలో గల రంగరాయ మెడికల్ కళాశాలలో, అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను గుంటూరులో సెయింట్ జోసెఫ్ మహిళా బీఈడి కళాశాలలో లెక్కించనున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను నల్గొండలో గల నాగార్జున ప్రభుత్వ కళాశాలలో, హైదరాబాద్, రంగారెడ్డి, మెహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను హైదరాబాద్ లో గల విక్టరీ ఇండోర్ స్టేడియంలో లెక్కించబడతాయి. ఈ నాలుగు చోట్ల ఒకేసారి ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.