కమ్మ కమ్యూనిటీపై జగన్ ఫోకస్
posted on Sep 11, 2015 @ 1:03PM
కోస్తాంధ్రలో బలమైన కమ్మ కమ్యూనిటీపై జగన్ దృష్టిపెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టయిన కమ్మ సామాజికవర్గం నుంచి తనకు కొంచెం అండ దొరికినా కొండంత బలం వచ్చినట్లేనని భావిస్తున్న వైసీపీ అధినేత... ఆయా జిల్లాల్లో పట్టున్న నేతల కోసం ఆన్వేషిస్తున్నారట. 2004లో ఈ వర్గం నుంచి కూడా వైఎస్ కు మద్దతు దొరకబట్టే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని, టీడీపీకి బలంగా కొమ్ముకాసే ఈ వర్గంలోనూ వైఎస్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానులున్నారని జగన్ భావిస్తున్నారట. కోస్తాంధ్రతోపాటు, రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రాజకీయాలను శాసిస్తున్న ఈ వర్గం అండ లేకపోతే, వచ్చేసారైనా అధికారం దక్కడం కష్టమేనన్న అంచనాకి వచ్చారట. పైగా ఆ వర్గానికి చెందిన తన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావులు....తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గం నుంచి బలమైన నేతలను పార్టీలో చేర్చుకుని డామేజ్ కంట్రోల్ కు రెడీ అవుతున్నారట. ఇప్పటికే పలువురితో జగన్ స్వయంగా చర్చలు జరిపారని, కృష్ణాజిల్లా నుంచి దేవినేని నెహ్రూ చేరడం దాదాపు ఖాయమైందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాల్లో పట్టున్న కరణం బలరాంతో కూడా సంప్రదింపులు జరిగాయని, టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయనా వైసీపీలో చేరే అవకాశముందంటున్నారు జగన్ పార్టీ నేతలు.