నన్ను కలువు.. ప్రేమ గురించి చెపుతా.. మంత్రి
posted on Sep 11, 2015 @ 11:54AM
కారణమేదైతే కాని రోజు రోజుకు ఆత్మహత్యలు చేసుకునేవారు పెరిగిపోతునే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలకు అసలు లెక్కలేకుండా పోయింది. నిన్నటికి నిన్న తెలంగాణ లో లింబయ్య అనే రైతు రాజధాని నడిబొడ్డున ఉరి వేసుకొని తన ప్రాణాలను బలిగొన్నాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుతం ఒక ఉపాయాన్ని కనుగొంది. ఏదో ఒక రకంగా ఈ ఆత్మహత్యలను నివారించాలని దీనికోసం ఒక ప్రత్యేకమైన సెల్ ను ఏర్పాటు చేశారు. దీనిని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సెల్ ను ప్రారంభించిన సందర్భంగా వచ్చిన మొదటి కాల్ ను స్వయంగా లక్ష్మారెడ్డే అందుకొని మాట్లాడారు.
అయితే కిరణ్ అనే కుర్రాడు తన ప్రేమ విఫలమైందని అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మంత్రిగారికి చెప్పడంతో మంత్రిగారు తొందరపడి అలాంటి అగాయిత్యాలకి పాల్పడవద్దని.. తల్లి దండ్రుల కోసం ఆలోచించాలని హిత బోధ చేశారంట. అంతేకాదు తన ఫోన్ నెంబరు ఇచ్చి తనను వ్యక్తిగతంగా కలవాలని.. ప్రేమ గురించి తాను చెప్తానని కూడా చెప్పారంట. మొత్తానికి రాజకీయ నాయకులు సమాజం.. బాధ్యతలే కాదు ఇలా ప్రేమ పాఠాలు కూడా చెప్పాల్సి వస్తుంది.