జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు ముగిసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాగంటి గోపానాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా  కైవశం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఎవరిని ఎన్నిక చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడింది. పలువురి పేర్లు పరిశీలించింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు భేటీ అయ్యారు. ఆ భేటీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక.. అభ్యర్థి అంశాలపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ కార్యకర్తల అభిష్టం మేరకు కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నకకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటోలపై పిల్... డిస్మిస్ చేసిన హైకోర్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది.   ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో వేసినట్లుగా ఉందని కోర్టు అభిప్రాయపడింది.  ప్రభుత్వ కార్యాలయాలలో డిప్యూటీ సీఎం ఫొటోలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను బుధవారం (సెప్టెంబర్ 8) విచారించిన హైకోర్టు..  గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉప ముఖ్యమంత్రి  ఫొటో పెట్టకూడదని చెప్పేందుకు చట్టపరమైన నిబంధనలు ఎక్కడ ఉన్నాయని  పిటిషనర్‌ను ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.  ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటో ప్రదర్శనకు చట్టబద్ధమైన అనుమతులు లేవని, దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం రూపొందించే వరకు ఆ ఫొటోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని రైల్వే విశ్రాంత ఉద్యోగి  కొండలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు నిజమైన ప్రజా ప్రయోజనాలు ఉన్న వ్యాజ్యాలను మాత్రమే న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటాయని పేర్కొంది. రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి కోర్టులను ఒక వేదికగా మార్చుకోవడం సరైన స్పష్టం చేసింది.  అనవసర వ్యాజ్యాలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని సూచిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

తెలుగు వారి క్షేమం కోసం ముందు కదిలేది తెలుగుదేశమే!

ప్రపంచంలో ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా.. అక్కడున్న తెలుగువారి క్షేమం కోసం ముందుగా కదిలేది ఒక్క తెలుగుదేశం మాత్రమే అన్న విషయం గతంలో పలుమార్లు రుజువైంది. ఛార్ ధామ్ యాత్రలో చిక్కకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి రప్పించడంలో కానీ, బర్మా, బంగ్లాదేశ్, దుబాయ్.. ఇలా ఎక్కడ తెలుగువారు ఇబ్బందుల్లో ఉన్నా వారిని ఆదుకునేందుకు తెలుగుదేశం ఆఘమేఘాలపై కదులుతుంది. అధికారంలో ఉన్నా, లేకున్నా తెలుగు పీపుల్ ఫస్ట్ అన్న విధానంతో తెలుగుదేశం స్పందన ఉంటుందన్నది తెలిసిందే. తాజాగా నేపాల్ లో జరుగుతున్న విధ్వంసకాండ, హింసాకాండ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట ఆంధ్రప్రదేశ్ లోని టీమ్ ఎన్డీయే ప్రభుత్వం  అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సభకు హాజరుకావడం మానేసి మరీ ఆయన నేపాల్ లోని తెలుగువారిని రక్షించడం కోసం రంగంలోకి దిగారు. ఉదయమే సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకుని నేపాల్ లో చిక్కుకున్న తెలుగవారిని రక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చర్యలలో మునిగిపోయారు. ఒక స్పెషల్ వార్ రూమ్ ను ఏర్పాటు చేసి..24 గంటలలూ పర్యవేక్షించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు.  నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు, వాట్సాప్ నంబర్లను ప్రకటించారు.  నేపాల్ లో దాదాపు 300 మంది చిక్కుకున్నారనీ, వారిలో అత్యధికులు ముక్తినాథ్ యాత్రికులు ఉన్నారనీ నిర్ధారణ అయ్యింది. అత్యంత వేగంగా లోకేష్ కదిలి యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించడం వల్లనే నేపాల్ లో చిక్కుకున్న వారి సంఖ్య, ఆచూకీ ఇంత త్వరగా తెలిసిందని అంటున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారిలో కొందరితో లోకేష్ స్వయంగా ఫోన్ లో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలందిస్తామంటూ భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపారు. నేపాల్ లో చిక్కుకున్న వారి భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకూ అప్ డేట్ లు సేకరించాలని అధికారులను ఆదేశించారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారందరినీ భద్రంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తామని లోకేష్ వారి భరోసా ఇచ్చారు.  

కాలినడకన తిరుమలకు అనిల్ కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం (సెప్టెంబర్ 10)న టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి.. గతంలో  2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకూ టీటీడీ ఈవోగా పని చేశారు.  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన అలిపిరి మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. మార్గ మధ్యంలో ఆయన భక్తులతో మాటామంతి కలిపి వారి నుంచి తిరుమలలో సౌకర్యాల కల్పనపై సలహాలు, సూచనలూ స్వీకరించారు. తాను 1984లో మొదట తిరుమలకు కుటుంబంతో పాటు వచ్చానని గుర్తు చేసుకున్న ఆయన అప్పట్లో శ్రీవారి దర్శనానికి తనకు ఏడుగంటలకు పైగా సమయం పట్టిందన్న ఆయన  సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నప్పుడు  తిరుమలలో సామాన్య భక్తుల బాధలు తెలిశాయని చెప్పారు.  చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు విధుల్లో భాగంగా తరచూ తిరుమల దర్శనానికి వచ్చేవాడినని అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తానని సింఘాల్ అన్నారు.  

ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటోలపై పిటిషన్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టడంపై ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రైల్వేలో పని చేసి రిటైర్ అయిన ఒక వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఫొటోల ప్రదర్శనపై ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని పేర్కొన్న ఆయన.. ఆ విధానం రూపొందే వరకూ ఉప ముఖ్యమంత్రి ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయనా పిటిషన్ లో కోరారు. కోర్టు ఆయన పిటిషన్ ను బుధవారం (సెప్టెంబర్ 10) విచారించే అవకాశం ఉంది.   వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది లేదు.  పవన్ కళ్యాణ్ కూడా తాను కేబినెట్ మంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కు ప్రత్యేక హోదా, గౌరవం ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో పాటు ఆయన ఫొటో కూడా ఉంచుతోంది.   అయితే ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్రపతి,  ప్రధాని,  రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోలు మాత్రమే ఉండాలనీ.. ఉప ముఖ్యమంత్రి ఫొటోను ఉంచడానికి వీల్లేదనీ పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయోత్సవ సభకు లోకేష్ దూరం.. ఎందుకంటే?

అనంతపురం వేదికగా ఈ రోజు జరగనున్న సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయోత్సవ సభకు మంత్రి నారా లోకేష్ హాజరు కావడం లేదు. ఆఖరి నిముషంలో ఆయన తన అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. ఇంతకీ ఆయన పర్యటన రద్దు చేసుకోవడానికి కారణమేంటంటే.. నేపాల్ లో  నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో  అక్కడ ఉన్న తెలుగువారిని  సురక్షితంగా రాష్ట్రానికి రప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ఆదేశించడంతో నేడు అనంతపురం లో జరుగనున్న సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాకి లోకేష్ హాజరుకావడం లేదు. తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని వెలగపూడి సచివాలయం లోని రియల్ టైమ్.గవర్నెన్స్ సెంటర లోపరిస్థితులను సమీక్షిస్తున్నారు.  ఉదయం పది గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు చేరుకున్న నారా లోకేష్ అక్కడ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని  సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు.  ఈ మేరకు సంబంధిత అధికారులంతా వెంటనే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి లోకేష్ పరిస్థితిని సమీక్షిస్తారు.   నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి   మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. 

తెలుగు వారి గుండెలు మండిన రోజు.. బాబు అరెస్టుకు రెండేళ్లు

ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరి కన్నూ చెమ్మగిల్లిన రోజు.. ధర్మాగ్రహంతో గుండె మండిన రోజు.. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు.. అంటే 2023 సెప్టెంబర్ 9న ఒక ప్రజా నాయకుడిని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచం మొత్తం గుర్తించిన వ్యక్తిని కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అప్పటి జగన్ సర్కార్ అరెస్టు చేసింది. అయితే ఆ అరెస్టే జగన్ పాలనకు చరమగీతం పాడటానికి కారణమైంది.   ఒక దార్శనికుడిని కేవలం రాజకీయ వైరంతో ,  రాజకీయ కక్ష సాధింపుతో జగన్ సర్కార్ సరిగ్గా రెండేళ్ల కిందట  ఇదే రోజు  (సెప్టెంబర్ 9)  అరెస్టు చేసింది.  దేశం గర్వించే రాజనీతిజ్ఞుడి అరెస్టు అది.. దేశాన్ని నివ్వెరపరిచిన అరెస్టు అది.  ప్రభుత్వ టెర్రరిజాన్ని పతాకస్థాయికి చేర్చిన అరెస్టు అది.  దేశంలో కోట్ల మంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు అది.   అప్పటి వరకూ ప్రభుత్వ దమనకాండ, అరాచక చర్యలకు భయకంపితులై.. నోరెత్తడానికే భయపడుతూ ఉన్న జనంలో  తిరుగుబాటు బావుటా ఎగిరేలా చేసిన అరెస్టు అది.  జగన్ ప్రభుత్వ అరాచక, అక్రమ చర్యను ప్రశ్నించడానికి కులం, మతం, ప్రాంతం, వర్గం అన్న తేడా లేకుండా తెలుగు జాతి మొత్తం సమష్టిగా గళమెత్తి నిరసన తెలిపేలా చేసిన అరెస్టు అది.  విధ్వంస ప్రభుత్వం పతనానికి  నాంది పలికిన అరెస్టు అది.  చరిత్ర ఎన్నటికీ క్షమించని తప్పు ఆ అరెస్టు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగామార్చేసిన అరెస్టు అది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌తో గొంతెత్తేందుకు భయపడిన జనాన్ని.. ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చేలా చేసిన అరెస్టు అది.  ఆ నాడు మొదలైన ప్రజా పోరాటం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జగన్ పతనం చూసే వరకు కొనసాగేలా చేసిన అరెస్టు అది.  ఆ అరెస్టు  వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఒక లెక్క.. చంద్రబాబు అరెస్టు తరువాత ఒక లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అప్పటి వరకూ బిక్కుబిక్కు మంటూ బతుకు జీవుడా అన్న చందంలో ఉన్నఏపీ ప్రజలలో చంద్రబాబు అరెస్టు ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాలలోనూ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.  ఎక్కడైనా ఒక నాయకుడు అరెస్టైతే అందరూ ఆ నాయకుడు చేసిన అవినీతి, అక్రమాల గురించి మాట్లాడుకుంటారు.  కానీ ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రం ఆయన అరెస్టు..  ఆయన చేసిన గొప్ప పనులు, అభివృద్ధికి దోహదం చేసిన ఆయన విధానాల గురించి మాట్లాడుకున్నారు.   ఆయన విధానాలతో ఐటీ కొలువులలో చేరి ఉన్నత స్థాయికి చేరిన ఐటీ ప్రొఫెషనల్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హైదరాబాద్ లో సీబీఎన్ గ్రాటిట్యూడ్ సభను నిర్వహించారు. ఇలా సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజలూ చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా గళమెత్తి.. పోరుబాట పట్టడం... ఆయన తన నాలుగు దశాబ్దాలకు పై బడిన రాజకీయ జీవితంలో... ప్రజల మద్దతును ఏ స్థాయిలో కూడగట్టుకున్నారో ప్రపంచానికి తేటతెల్లం చేసిన అరెస్టు అది.  చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు.. ప్రజల మనిషి, ప్రజాహృదయాలలో తిరుగులేని స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహోన్నత వ్యక్తి అని చాటిన అరెస్టు అది.

సీపీ రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

  భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఏపీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశ సేవ, పురోగతికి రాధాకృష్ణన్‌ పనిచేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు ఆయన అపార జ్ఞానం, అనుభవం ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. రాధాకృష్ణన్‌కు మంత్రి నారా లోకేశ్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  మరోవైపు ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు దేశ వ్యాప్తంగా అభినందనలువెల్లువెత్తున్నాయి. ప్రజా జీవితంలో  మీ దశాబ్దల అనుభవం దేశ ప్రగతికి ఎంతో దోహదపడునుందని మీ బాధ్యతల్లో విజయవంతమవ్వాలని ఆకాంక్షిస్తున్నా అని రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. రాధాకృష్ణన్‌ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకిత చేశారని అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ నిలుస్తారని భావిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన వ్యక్తి అని రాజ్యాంగ విలువలను రాధాకృష్ణన్‌ బలోపేతం చేస్తారని ఆశిస్తున్నా ప్రధాని పేర్కొన్నారు

తెలంగాణపై ఫోకస్ చేస్తాం : లోకేష్

  తెలంగాణపై తెలుగు దేశం పార్టీ ఫోకస్‌ చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఢిల్లీ మీడియా ప్రతినిధులతో లోకేశ్‌ చిట్ చాట్ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోటీపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు లోకేశ్ స్పందించారు. కవిత టీడీపీలో తీసుకోవడం అంటే జగన్‌ను చేర్చుకున్నట్లేనని అన్నారు.ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్‌ను వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేశ్‌ సూచించారు.  ఇప్పుడే కాదు.. 2029 ఎన్నికల్లోనూ మోదీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయని నారా లోకేశ్‌ అన్నారు. అవన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఆ భయంతోనే జగన్‌ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. ఏపీ లిక్కర్‌ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఫైబర్‌ నెట్‌ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదని స్పష్టం చేశారు. దేవాన్షు ఎందుకు రాజకీయాల్లో వస్తారు అనుకుంటున్నారు హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నాడని పేర్కొన్నారు.   

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం

  భారత 17వ ఉప రాష్ట్రపతిగా  ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు, సుదర్మన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్లుతో గెలుపోందారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పార్లమెంట్‌లోని ఉభయ సభల సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికంటే ముందుగా తన ఓటు వేశారు.ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేయగా, ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే, 15 మంది ఓట్లు చెల్ల లేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 13 మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో బిజూ జనతాదళ్ (బీజేడీ) నుంచి ఏడుగురు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి నలుగురు, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన మద్దతు లభించడం లేదన్న కారణంతో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆరెస్సెస్ స్వయంసేవకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఆయన ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.  ఆయన  కోయంబత్తూరు లోక్ సభ నుంచి 1998, 1999 రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2014, 2019లో వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. 2023 ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్  నియమితులయ్యారు. ఆ తర్వాత 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా  అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.  రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించారు. 2007లో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 93 రోజుల్లో రాష్ట్రంలో 19 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ ప్రయాణంలో ప్రధానంగా నదుల అనుసంధానం, ఉగ్రవాదం, ఉమ్మడి పౌరస్మృతి, అంటరానితనం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ఆ తర్వాత కూడా ఆనకట్టలు, నదుల సమస్యపై 280 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల చొప్పున రెండుసార్లు పాదయాత్రలు చేశారు.  

తలపతి విజయ్ పార్టీలోకి నటి త్రిష?

తమిళ హీరో తలపతి  విజయ్ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీలో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ధృవీకరించేశారు. తమిళనాట పొత్తులు లేకుండా ఒక కొత్త పార్టీ ఒంటరిగాఎన్నికల బరిలోకి దిగడం సాహసమనే చెప్పాలి. అయితే తన అభిమానుల బలంతో తమిళ రాజకీయాలలో సొంత బాట ఏర్పాటు చేసుకోగలన్న విశ్వాసం, ధీమా విజయ్ లో వ్యక్తం అవుతున్నాయి.  అయితే తళపతి విజయ్ కు కోలీవుడ్ పరిశ్రమ మద్దతు ఏ మేరకు ఉంటుందన్న సందేమాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా, పరోక్షంగా విజయ్ పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇక మరో హీరో కమల్ హసన్ విజయ్ కు మద్దతు ప్రకటిస్తారా అన్నిది కూడా అనుమానమే. ఇప్పటికే డీఎంకే మద్దతుతో రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఈ లోక్ నాయకుడు.. బహిరంగంగా విజయ్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. వీరిద్దరినీ పక్కన పెడితే కోలీవుడ్ పరిశ్రమలో విజయ్ వెంట నిలిచేదెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. విజయ్ అభిమానులు మాత్రం తమిళ అగ్ర నటులంతా ముందుకు వచ్చి విజయ్ కు మద్దతు పలకాలని ఆశిస్తున్నారు. అయితే ప్రముఖ నటి త్రిష మాత్రం రాజకీయంగా తలపతి విజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించారని అంటున్నారు. ఇటీవల దుబాయ్ లో  ఫెమా ఫంక్షన్ లో ఆమె రాజకీయంగా విజయ్ అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పారు.  దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ప్రముఖ స్థానంలో ఉన్న త్రిష సినీ కెరీర్ ఇప్పుడు కొద్దిగా నెమ్మదించింది. దీంతో సహజంగానే ఆమె తదుపరి అడుగు రాజకీయాలవైపు పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తలపతి విజయ్ కు ఏదో మామూలుగా బెస్టాఫ్ లక్ చెప్పలేదనీ, ముందు ముందు ఆమె తలపతి విజయ్ పార్టీ ద్వారానే రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందనీ  అంటున్నారు.  

సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభ ఏర్పాట్ల పరిశీలన

అనంతపురం వేదికగా బుధవారం (సెప్టెంబర్ 10) జరగనున్న  సూపర్ సిక్స్-సూపర్ హిట్' విజయోత్సవ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో  భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సభా ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. పర్యవేక్షించారు.  మంగళవారం (సెప్టెంబర్ 8) సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, భద్రతాపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందనీ, భద్రత విషయంలో ఎటువంటి లోటుపాట్లకూ తావీయవద్దనీ అదికారులకు అనిత ఆదేశాలు ఇచ్చారు.  సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలనీ, అలాగే సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న వంగలపూడి అనిత..  వేదిక నిర్మాణం, బారికేడ్ల ఏర్పాటు వంటి అంశాలపై కూడా అధి కారులకు  సూచనలు చేశారు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ స్థానిక ఎన్నికలు.. లింకేటి?

తెలంగాణలో స్థానిక సమరం మరో వాయిదా ఖాయం అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇదిగో.. అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న తెలంగాణ స్థానిక ఎన్నికలు కోర్టు స్పష్టమైన గడువు విధించిన తరువాత కూడా మళ్లీ మరో మారు వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తున్నది.  వాస్తవానికి స్థానిక సంస్థల గడువు ముగిసి చాలా కాలమైంది. తెలంగాణలో 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వాటి గడువు ముగిసి కూడా ఏడాది దాటింది.   అప్పటి నుంచీ కూడా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది.  ఈనేపధ్యంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు ఇప్పుడు నిర్వహిస్తాం, అప్పుడు నిర్వహిస్తామంటూ ముహూర్తాలు ఖరారు చేసి ఉజ్జాయింపుగా తేదీలనూ ప్రకటించేస్తున్నా.. అవన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తున్నాయి.  అసలీ ఎన్నికలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉన్నట్లు కనిపించదు.    ఇక ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల విషయంలో పట్టుబడుతుండటంతో కోర్టు విధించిన గడువులోగా స్థానిక ఎన్నికల నగారా మోగే అవకాశం ఇసుమంతైనా లేదన్న విషయం దాదాపు స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణకు తగినట్లుగానే ఇటీవలి మంత్రివర్గ సమావేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం లభించే వరకూ స్థానిక పోరుకు వెళ్లవద్దన్ననిర్ణయం తీసుకున్నది. అవసరమైతే కోర్టును ఆశ్రయించి మరి కొంత గడువు కోరాలని కేబినెట్ నిర్ణయించింది. అదే జరిగితే ఇక ఇప్పట్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఇసుమంతైనా లేనట్లేనని అంటున్నారు. ఎందుకంటే.. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది.  వారి వద్ద నుంచి ఈ నెల 30లోగా ఎటువంటి నిర్ణయం వెలువడకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కారణాన్ని చూపుతూ కోర్టును ఆశ్రయించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా బీహార్ ఎన్నికలు ముగిసే వరకూ తెలంగాణ స్థానిక సమరం వాయిదా పడటమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందు కోసం కోర్టును స్థానిక పోరును మూడు నుంచి నాలుగు నెలల పాటు వాయిదా వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఆ లోగా రాష్ట్రపతి లేదా గవర్నర్ నుంచి బీసీల రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నట్లుగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.   ఇంతకీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో లింకేమిటంటే.. బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలో పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్నది రేవంత్ బావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కోర్టును ఆశ్రయించైనా సరే స్థానిక ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్ పట్టుబ డుతుందని చెబుతున్నారు. 

సీఎం రేవంత్ ఇంటి ప్రహారీగోడ కూల్చివేత!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ప్రహారీగోడను అధికారులు కూల్చివేశారు. నమ్మశక్యం కాకున్నా ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. సాధారణంగా రాజకీయ నాయకులు, అందులోనూ అధికారంలో ఉన్న వారు తమను తాము చట్టానికి అతీతులుగా భావిస్తుంటారు.  భూసేకరణ, కూల్చివేతలు వంటి అంశాలు తమ ఆస్తుల వరకూ రావని, రాకూడదనీ భావిస్తుంటారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తనకూ సామాన్యులకూ ఒకే విధానం ఉండాలనీ, ఉంటుందనీ నిరూపించారు. విషయంలోకి వస్తే.. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డికి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇల్లు ఉంది. కొండారెడ్డి పల్లిలో రోడ్ల విస్తరణలో భాగంగా రోడ్లను 40 పీట్ల నుంచి 60 ఫీట్లకు పెంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోపలు గృహాల ప్రహారీ గోడలను కూల్చివేయాల్సివచ్చింది. ఆ గృహాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉంది.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తన నివాసమైనా, ఎవరి నివాసమైనా సరే ఎటువంటి మినహాయింపులూ ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు ముఖ్యమంత్రి నివాసం ప్రహారీ గోడను కూడా రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేశారు.   

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

  నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో సైన్యం సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన దుబాయ్ నుంచి వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపుతప్పాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆందోళనకారులు రాజధాని ఖాట్మండులో విధ్వంసం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాపై బ్యాన్, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి నేపాల్‌లో మరింత హిసాత్మకంగా మారాయి. పార్లమెంట్ ముట్టడితో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది ప్రజలు మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి  ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు.. హోంమంత్రి రాజీనామా చేసినా ప్రజల నిరసనలు ఆగకపోవడంతో.. ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం. సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే ఛాన్స్ ఉంది

చంద్రబాబుపై మల్లారెడ్డి పొగడ్తల వర్షం.. ఏంటి విషయం?

పాలమ్మిన, పూలమ్మిన వంటి డైలాగులతో హాస్యం పండించడమే కాకుండా, ఏదో ఒక వివాదంలో నిత్యం వార్తలలో కనిపించే బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై పొగడ్తల వర్షం కురిపించారు. సందర్భం, సమయంతో పని లేకుండా నిత్యం తనదైన ప్రత్యేక వాగ్ధాటిలో  అందరి దృష్టినీ ఆకర్షించే మల్లారెడ్డి ఇప్పుడు చంద్రబాబుపై అంత ఘనం పొగడ్తలు కురిపించారన్న దానిపై  ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి తన జన్మదినం సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 9)  తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పాలనను ప్రశంసించారు.   2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచి మల్లారెడ్డి పేరుకే బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాదు.. మీడియాకూ, రాజకీయ ప్రసంగాలకూ దూరంగా ఉంటూ వస్తున్నారు.  దానికి భిన్నంగా తిరుమల వేదికగా ఆయన మళ్లీ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులపై తనదైన శైలిలో గళం విప్పారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై కూడా ప్రశంసలు కురిపించేశారు.  చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. చంద్రబాబు అద్భుత పాలనా దక్షుడని కితాబిచ్చేయడమే కాకుండా.. కేంద్రంలో నరేంద్రమోడీ పాలనలో దేశంలో లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో సాగుతున్నాయన్నారు.     సరే అసలింతకీ మల్లారెడ్డి చంద్రబాబు, మోడీలపై ఇంత హఠాత్తుగా ప్రశంసల వర్షం కురిపించడం వెనుక కారణమేంటన్న చర్చ ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో జోరుగా సాగుతోంది.  

బాబు అరెస్టుకు రెండేళ్లు..

రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు..(అంటే సెప్టెంబర్ 9 2023) అప్పటి జగన్ సర్కార్ నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసింది. స్కిల్ కేసు అంటూ నంద్యాలలో బూబు షూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తన బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబునాయుడిని నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ చేసి రాక్షసానందాన్ని పొందింది. నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడిని అరెస్టు చేయడం పట్ల అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ మాత్రమే కాదు, దేశంలోని అన్ని  రాష్ట్రాలూ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో నిరసనలు మిన్నంటాయి.    చంద్రబాబు అరెస్టును ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయ స్థాయిలో  కూడా అన్ని రాజకీయపార్టీలూ తప్పుపట్టాయి.  నేషనల్ మీడియాలో కూడా  చంద్రబాబు అరెస్టు వార్తను అత్యంత ప్రముఖంగా ప్రచురించింది. ప్రసాదం చేసింది. ఇక  మేధావులు కూడా ఈ అరెస్టు వ్యవహారాన్ని కక్ష  సాధింపు చర్యగానే  అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులు, కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక , చెన్నై లాంటి  నగరాలలో యువత  చంద్రబాబుకు మద్దతుగా  నిరసనలు చేపట్టారు.   రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ న్యాయమూర్తులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు.  అసలు జగన్ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణాలలో చంద్రబాబు అక్రమ అరెస్టు ఒకటి అనడంలో సందేహం లేదు.   చంద్రబాబు అక్రమ అరెస్టుపై పెల్లుబికి ఆగ్రహ జ్వాలల సెగ అప్పటి జగన్ సర్కార్ కే కాదు.. అప్పట్లో మోడీ సర్కార్ ను కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ నాయకులు  చంద్రబాబు అరెస్టు వల్ల జగన్ మాత్రమే కాదు.. తాము కూడా తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నామని బాహాటంగానే  చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏపీలో వైసీపీ పతనాన్ని ఎన్నికలకు ముందే ఖరారు చేసేసింది.  2024లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కార్ కు ఏపీ జనం గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్షహోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయాన్ని చవి చూపించారు.   

బడాయి బాబూ.. ఏంటీ డాబు?

రీసెంట్ గా చంద్రబాబు పదే పదే చెబుతున్న పీపీపీ విధానం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రైవేటు భాగస్వామ్యం మీద భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. అయినా ప్రభుత్వం కాలేజీ కట్టాల్సిందంతా కట్టి ప్రైవేటు పరం చేయడమేంటన్నదొక చర్చ. గతంలో ప్రస్తుతం ఆరోగ్య శ్రీ మాత్రం ప్రైవేటు కార్పొరేటు ఆస్పత్రులను ఎంకరేజ్ చేయడం కాదా? అన్నది బాబు ప్రభుత్వ వాదన. అంతా ప్రభుత్వమే నడిపిస్తే తడిసి మోపెడవుతుంది కాబట్టి ఇదే కరెక్ట్ అన్నది వీరి కామెంట్. ఇదెలా ఉన్నా.. ఇలా ప్రతిదీ ప్రైవేటు పరం చేయడం వల్ల చివరికి ప్రభుత్వం కన్నా ప్రైవేటే మిగలదా? అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఇక పీ4. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ఇదైతే ఆయన అనుకూల మీడియా కూడా విరుచుకుపడేంత విమర్శనాత్మకంగా మారింది. పీ4 ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యమేనా? అసలు జీరో పావర్టీ అంటూ ఒకటి ఉంటుందా? ఒక వేళ ఉంటే ఆ సమాజం ఎలా ఉండబోతోంది?   ఇప్పటికే అలివి కాని హామీలిచ్చారన్న మాట ఉండనే ఉంది. పీ 4 ద్వారా బాబు పేదరికం నిర్మూలిస్తున్నారా? లేక ఇందులోకి వచ్చే బడాబాబుల జేబులు తడిపేలా మరేదైనా పథక రచన చేశారా? అన్నది కూడా చర్చనీయాంశమే. ఎవరు సంపన్నులు కావడానికి ఈ పేదరిక నిర్మూలనా పథకం? అర్ధం కావడం లేదంటారు కొందరు. ఇప్పటికే వైసీపీ ఈ దిశగా తన విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. స్త్రీ శక్తి పథకం. ఇదైతే.. కూటమి ప్రభుత్వాన్ని భారీ ఎత్తున ఇరుకున పడేస్తోంది. మొన్న విజయనగరంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీస్తే.. నిన్న పిఠాపురంలో  ఆటో డ్రైవర్లు యాచన చేస్తూ ఈ పథకం పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫ్రీ బస్సు అవసరమా? ఫ్రీ వైద్యం విద్య అవసరమా? తేల్చుకోవాలంటూ.. ప్రభుత్వంపై ఇప్పటికే విరుచుకుపడుతున్నారు కొందరు. వికలాంగులకు కూడా ఫించన్లు తొలగిస్తున్నారంటూ మరొక గొడవ. ఇంత పెద్ద ఎత్తున ఫించన్లు అమలు చేయడం ఎందుకు? వాటిని ఇవ్వలేక పోవడం ఎందుకన్నది ఒక వాదన. ఇదిలా ఉంటే నెల నెలా బాబు ఫించన్ల పేరిట చేస్తున్న హైడ్రామా.. ఆయన పబ్లిసిటీ  మోజు ఎక్కువైందన్న కామెంట్ వినవస్తోంది. ఇప్పటికే గత గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో  29 మంది మరణించడానికి కారణం.. ఆయన పబ్లిసిటీ కోసం పెట్టుకున్న షూటింగ్ కారణంగా భక్తులను ఘాట్ లోకి స్నానానికి అనుమతించకుండా నిలువరించడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడీ ప్రచార మోజు అంత అవసరమా అన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.   సూపర్ సిక్స్- సూపర్ హిట్ అంటూ చేస్తున్న హంగామా సైతం   విమర్శలకు దారి తీస్తోంది. పథకాలు ఇచ్చామంటే ఇచ్చాశామన్నది ముఖ్యం కాదు. దాన్నెంత సవ్యంగా అందరికీ అందేలా ఇస్తున్నామన్నది ముఖ్యం. ఇలా విజయోత్సవ సభలు నిర్వహించడం కార్యక్రమాలు రూపొందించి జనం సొమ్ము తగలేయడం సరి కాదన్న వాదన వినిపిస్తోంది.  గతంలో వైసీపీ కూడా ఇంటింటికీ వంటి అతి కార్యక్రమాల ద్వారా.. పొందిన లాభం కంటే నష్టమే ఎక్కువ. చంద్రబాబు ఈ ధోరణి మానుకోవాలన్నది  జనం మాటగా వినిపిస్తోంది. అతి సర్వత్రా వర్జయేత్ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను తగ్గించుకోవడమే మేలని అంటున్నారు. మంచి ప్రభుత్వం అంటూ చేసే ప్రచారాలు సైతం చేటు తెచ్చేవే తప్ప.. వాటి ద్వారా ఎలాంటి లాభం లేదన్న విషయం చంద్రబాబు గుర్తించాలని కూడా సలహా ఇస్తున్నారు. యూరియాతో మొదలు పెట్టి రైతులకు గిట్టుబాటు ధర వంటి ఎన్నో సమస్యలుండగా బాబు   డాబు కొద్దీ చేస్తోన్న ఈ ప్రచార పటాటోపం చేటు తెచ్చేదిగానే అభివర్ణిస్తున్నారు చాలా మంది. ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ చేసిన సంక్షేమాభివృద్ధికి దక్కిన ఫలితం 11 సీట్లు. డబుల్ ఖర్చు చేసి చంద్రబాబు చేయాలని చూస్తున్న ఈ సంక్షేమ సరళి ఎలాంటి ఫలితాలిస్తాయో అన్న ప్రశ్న- కూటమి గెలవక ముందు నుంచే ఉంది. ఒక పక్క వైసీపీ ఆ పార్టీ సోషల్ మీడియా వింగులు మొదలు పెట్టిన ఫేక్ న్యూస్ దాని కట్టడికి తల బొప్పి కట్టేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ని ఒక ట్రబుల్ షూటర్ గా తయారు చేయడంలో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఎక్కే హెలికాప్టర్, దిగే ఫ్లైటు ఖర్చులు తడిసి మోపెడు అవుతోంది. ఆపై ఆయన సినిమాల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం కూడా చేటు తెచ్చేలా తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కేసు నమోదయ్యింది. ఇక నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేసి పది లక్షలిస్తామని ఆయన ప్రచార సమయంలో చేసిన ప్రకటన గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో వాలంటీర్ల వల్ల 30 వేల మంది అమ్మాయిలు తప్పి పోయారన్నది నిరూపించలేక చేతులెత్తేస్తున్నారు పవన్. ఆపై సుగాలీ ప్రీతి వ్యవహారం ఉండనే ఉంది. ఇలా కూటమి ప్రభుత్వ నిర్వహణ తలాపాపం తిలా పిడికెడుగా కనిపిస్తోందని అంటున్నారు. వీటన్నిటినీ సరిదిద్దుకోవల్సిన బాబు.. వీటన్నిటినీ పక్కన పెట్టి తన ప్రచార పటాటోపం కోసం చేస్తున్న ఈ పాలన సరైనదేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

మాట్లాడే అవకాశాలిస్తాం.. సభకు రండి!

వైసీపీ ఎమ్మెల్యేలను సభకు రావాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి కోరారు. అనర్హత వేటు వేళాడుతున్న వేళ  వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన మరోసారి సభకు రావాలంటూ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగానే వైసీపీ సభ్యులకు కూడా మాట్లేడేందకు తగిన సమయం ఇస్తామని ఆయన ఈ  సందర్భంగా చెప్పారు.  రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమతమ నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సభకు హాజరై ప్రజాసమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలను కోరారు.