ఒకే సందర్భం.. పలు పేర్లు.. ఇంతకీ సెప్టెంబర్ 17న ఏంజరిగింది?
posted on Sep 17, 2025 @ 10:26AM
భారత్ లో ఒక స్వాతంత్ర దినం, మరో రిపబ్లిక్ దినోత్సవం.. ఇలాంటి జాతీయ పండగలను భారత జాతి మొత్తం ఒకే దృక్పథంలో, ఒకే కోణంలో జరుపుకుంటూ రావడం ఆనవాయితీ. అయితే.. తెలంగాణలో మాత్రం ఒక దినోత్సవాన్ని మూడు పార్టీలు మూడు రకాలుగా జరుపుకుంటారు. అదే తెలంగాణ విమోచన దినం. దీనిని బీజేపీ హైదరాబాద్ విమోచన దినోత్సవంగా, కాంగ్రెస్ తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా, బీఆర్ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పిలుస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం జరిగిన రోజుకు.. భిన్న పార్శ్వాలు కలిగి ఉండే సందర్భం బహుశా ఇదేనేమో. అంతగా ఈ దినోత్సవం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంతకీ సెప్టెంబర్ 17కి ఉన్న చారిత్రక దినం ప్రాముఖ్యత ఏంటంటే.. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో విలీనమైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏడా సెప్టెంబర్ 17ను ప్రతి పార్టీ తమ సొంత దృక్పథంతో ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయి.
తెలంగాణ అంటేనే ఉద్యమాల ఖిల్లా. భారత్ మొత్తం స్వాతంత్ర పోరాటం చేస్తే ఇక్కడ మాత్రం నిజాం పాలకులతో సమాంతరంగా సాయుధ పోరాటం చేయాల్సి వచ్చింది. అందుకే భారత్ మొత్తం 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం పొందినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజామ్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో మరో 13 నెలల పాటు బానిసత్వంలో మగ్గింది.
దీనంతటికీ కారణం రజాకార్లు.. అంటే మిలటరీ వింగ్ ఆఫ్ మజ్లిస్- ఏ- ఇత్తిహాద్ అనే పేరిట వీరు ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలపై అనేక అత్యాచారాలు, హింస వంటి దారుణమైన పద్ధతుల్లో పాలిస్తూ.. స్వతంత్ర రాజ్యం కోసం పోరాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరిట పోలీస్ యాక్షన్ ప్రకటించింది.
1948 సెప్టెంబర్ 13న, భారత సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నాలుగు రోజుల్లోనే నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న, అధికారికంగా లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది. ఈ పోరాటంలో వేల మంది తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగం చేశారు. రావి నారాయణ రెడ్డి, మల్లు స్వరాజ్యం, చండ్రరాజేశ్వరరావు, షోయాబుల్లా ఖాన్ వంటి నాయకులు ఈ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి ఈ చారిత్రక రోజును రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా జరుపుకోవడం మొదలైంది.
అయితే జనానికి మాత్రం ఇది రెండో స్వాతంత్ర పోరాట విజయం. రజాకార్ల పై సాధించిన ఘన విజయం. బ్రిటిషర్లతో ఎలాంటి పోరాటం చేశారో తెలీదు కానీ.. ఆనాటి రజాకార్ల దాష్టీకాలకు హింసాకాండకు బలైన అమరులను తలుచుకుంటూ నివాళి అర్పించే సందర్భం.