పేర్నినానిపై మరో కేసు?.. ముందస్తు బెయిలొచ్చే వరకూ అజ్ణాతమేనా బాసూ!
posted on Sep 16, 2025 @ 2:38PM
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తాజాగా మరో భూ కబ్జా ఆరోపణ బలంగా వినిపిస్తోంది. బందరులోని రంగనాయకులు ఆలయ భూమికి సంబంధించి పేర్ని నానిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బైపాస్ రోడ్డు సమీపంలోని దేవుని చెరువు వద్ద భూమికి ఎండోమెంట్ అధికారులు గతంలో నిర్వహించిన వేలం ద్వారా చాలా చాలా తక్కువ ధరకు భూములు అమ్ముడుపోయాయి. ఇందుకు పేర్ని నాని చేసిన ప్రచారమే కారణమని అంటున్నారు.
అప్పట్లో అంటే వేలం సమయంలో పేర్ని నాని ఆ భూములు తిరిగి విక్రయించడానికి పనికిరావని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ భూముల గుండా హైనెన్షన్ వైరు వెడుతుండటమే ఇందుకు కారణమని నాని అప్పట్లో చేసిన ప్రచారం కారణంగా ఎవరూ కొనుగోలుకు ముందుకు రాలేదు. ఈ భూమిని పేర్ని నాని అప్పట్లో గజం 12వందల నుంచి 13 వందల రూపాయలకు అతి చౌకగా సొంతం చేసుకున్నారు. ఈ రకంగా పేర్నినాని, అతడి అనుచరులు దాదాపు 5.33 ఎకరాల భూమిని వేలం ద్వారా కారు చౌకగా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే భూమిని చదరపు గజం 40 నుంచి 50 వేల రూపాయల వరకూ విక్రయించాలని చూస్తున్నారు. అతి చౌకగా అనుచరుల పేరు మీద కొనుగోలు చేసిన భూమి చాలా భాగాన్ని పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉండగానే అంటే.. 2022 మరియు 2023 మధ్య తన, తన కుటుంబ సభ్యుల పేర్ల మీద బదలాయించేకుకున్నారు. మిగిలిన భూమిని కూడా తన కుటుంబ సభ్యుల పేర బదలాయించు కోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆ భూముల గుండా వెడుతున్న హైటెన్షన్ వైర్ ను కూడా తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూముల వ్యవహారంలో పేర్ని నానిపై కేసు నమోదయ్యేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. కేసు నమోదైతే.. ఈ కేసులో కూడా ముందస్తు బెయిలు వచ్చే వరకూ పేర్ని నాని అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతారా? చూడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. గతంలో తనపై కేసు నమోదైన ప్రతి సారీ పేర్ని నాని కోర్టు బెయిలు మంజూరు చేసే వరకూ అజ్ణాతంలో గడిపిన సంగతిని ఈ సందంర్భంగా గుర్తు చేస్తున్నారు.