ప్రభుత్వ శాఖల సేవలకు రేటింగ్స్.. ఏపీ సీఎం నారా చంద్రబాబు
posted on Sep 16, 2025 @ 4:09PM
ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు మంగళవారం (సెప్టెంబర్ 16) క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 తదితర అంశాలపై సమీక్షించిన చంద్రబాబు.. పాలనలో టెక్నాలజీ వినియోగంపై దిశానిర్దేశం చేశారు. కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సి అవసరం ఉందని చెప్పిన చంద్రబాబు గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగు పడినప్పటికీ, రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత మెరుగుపడాలన్నారు.
రెవెన్యూ శాఖ సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడం లేదని చంద్రబాబు అన్నారు. అందుకే ప్రభుత్వ సేవలకూ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై తమ తమ శాఖలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సమాచారం కోసం పదే పదే కలెక్టర్లను నివేదికలు అడిగే పరిస్థితి రాకూదని అన్నారు. ఆర్టీజీఎస్ నుంచి అవసరమైన మేరకు నివేదికలు తీసుకుని అందుకు అనుగుణంగా పని చేయించాలన్నారు. అన్ని ఫైళ్లూ వంద శాతం ఆన్ లైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం రెండు నెలలు గడువు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ వ్యవస్థను ఏర్పాటు చేశామనీ, దీని ద్వారా 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందుతోంది. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఏయే జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైమ్ లో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
కలెక్టర్ల కాన్ఫరెన్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు. ఆ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు. భవిష్యత్తులో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 80 వేలమంది పని చేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.