షర్మిలతో బొత్స మాటా మంతీ.. మతలబేంటి?
posted on Sep 15, 2025 @ 11:17AM
విశాఖ స్టీల్ ప్లాంట్ పై విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణల భేటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకు ప్రధాన కారణంగా ఈ ఇరువురూ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పక్కపక్కనే కూర్చోవడమే కాకుండా.. స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అన్నిటి కంటే అందరి దృష్టినీ ఆకర్షించిన విషయమేంటంటే.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ముందుగా బొత్స సత్యనారాయణ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి షర్మిల వచ్చారు. సమావేశం హాల్ లోకి షర్మిల ప్రవేశించడం గమనించగానే బొత్స సత్యనారాయణ తన స్థానం నుంచి లేచి నిలబడి ఆమెను పలకరించి.. తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని కోరారు. దీంతో షర్మిల బొత్స పక్కనే ఉన్న స్థానంలో కూర్చున్నారు. బొత్సతో మాట్లాడిన తరువాత.. ఆ పక్కనే ఉన్న సీపీఐ నేత రామకృష్ణను పలకరించారు. సమావేశం ముగిసిన తర్వాత, షర్మిల బొత్సకు అన్నా వెళ్లొస్తా అని చెప్పి మరీ వెళ్లారు. ఇరువురి మధ్యా సంభాషణ కొద్ది సేపే జరిగి ఉండొచ్చు కానీ.. ఆ కొద్ది సేపు జరిగిన భేటీయే వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో పలు ఊహాగాన సభలు జరగడానికి కారణమైంది. అందుకు కారణం లేకపోలేదు.
వైసీపీ ఎకో సిస్టమ్ లో ప్రత్యర్థి పార్టీలు ఉండవు. శత్రు పార్టీలు మాత్రమే ఉంటాయి. అందులోనూ షర్మిల వైసీపీ అధినేత, స్వయానా తన సోదరుడు అయిన జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తుండటమే కాకుండా.. వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు ఎంత మాత్రం కాదని విస్ఫష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ షర్మిలతో మాటా మంతీ కలపడం కచ్చితంగా జగన్ కు నచ్చదు. ఆ సంగతి తెలిసీ బొత్స సత్యనారాయణ షర్మిలను లేచి నిలబడి మరీ పలకరించడమే కాకుండా.. స్వయంగా తన పక్కన ఉన్న స్థానంలో కూర్చోమని ఆహ్వానించి మరీ మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరిం చుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.