అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు : జగన్
అమరావతి తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ నిర్వహణ తీరు, మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. జగన్ ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలి వ్యవహారాలపై విస్తృతంగా వ్యాఖ్యానించారు.“అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకోవాలన్న తపన కనిపించడం లేదు,” అని ఆయన విమర్శించారు.
కొంతమంది తనకు సలహాలు ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసి ప్రతిపక్షం బలహీనపరచాలని సూచించారని చెప్పారు.“కానీ మేము అలా చేయలేదు. వారి అభిప్రాయాలూ గౌరవించాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఎవరూ గొంతు విప్పకూడదనేది అధికార పక్షం అభిప్రాయంగా కనిపిస్తోంది అని జగన్ తెలిపారు. అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉన్నప్పటికీ, మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షానికే అనుకూలంగా ఉన్నాయని, నిజమైన ప్రతిపక్షం వైయస్సార్‌సీపీ మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు.
మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో తగిన సమయం దొరుకుతుంది. ప్రజల తరఫున గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వడంలేదు,” అని అన్నారు.అందుకే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామని తెలిపారు. అయితే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని, ఆ వేదికలో ప్రజల తరఫున గొంతు విప్పాలని ఎమ్మెల్సీలకు సూచించారు.
మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. ప్రజల తరఫున ధైర్యంగా, ఆధారాలతో మాట్లాడాలి. అక్కడ మన వాయిస్ బలంగా వినిపించాలి,” అని జగన్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలిలో తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించి, తమ సూచనలు కూడా ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమయం ఇవ్వకపోవడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు నిరాకరణపై వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మండలిని ప్రధాన వేదికగా ఉపయోగించాలని ఎమ్మెల్సీలను ఆదేశించారు.