కమలం గూటికి పోతుల సునీత
posted on Sep 15, 2025 @ 2:37PM
మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కమలం గూటికి చేరారు. ఆమెకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దాదాపు ఏడాది కిందట ఆమె వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో పోతుల సునీత తెలుగుదేశంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జనసేన గూటికైనా చేరుదామని ప్రయత్నించారు. అయితే ఆ పార్టీ కూడా ఆమెకు తలుపులు మూసేసింది. దీంతో గత ఏడాది కాలంలో పోతులసునీత ఏ పార్టీలోనూ లేరు.
వాస్తవానికి పోతుల సునీత తన రాజకీయ ప్రస్తానాన్ని తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభించారు. 2017లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడమే కాకుండా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలయ్యాయి.
ఆ తరువాత ఆమె వైసీపీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె బీజేపీలో చేరారు. తన భర్త పోతుల సురేష్ తో కలిసి కమలం కండువా కప్పుకున్నారు. అయితే బీజేపీ వారిని పార్టీలో చేర్చుకోవడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం, బీజేపీలు రాష్ట్రస్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ కూడా పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే వైసీపీలో ఉన్న సమయంలో పోతుల సునీత చంద్రబా బునాయుడు, లోకేష్, ఇతర తెలుగుదేశం నాయకులపై చేసిన విమర్శల కారణంగా ఆమెకు తెలుగుదేశం తలుపులు మూసేసింది. దీంతో ఆమె జనసేనలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే తెలుగుదేశంతో ఉన్న పొత్తు ధర్మాన్ని పాటించిన జనసేన ఆమె చేరికకు అంగీకరించలేదు. దీంతో ఇంత కాలం ఏ పార్టీలోనూ లేకుండా రాజకీయాలకు ఒకింత దూరంగా మెలిగిన పోతుల సునీత ఇప్పుడు కమలం కండువా కప్పుకుంది. రాష్ట్రంలో పొత్తులో ఉన్న రెండు పార్టీలూ కాదన్న వ్యక్తిని బీజేపీ ఎలా చేర్చుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.