అప్పుడు చెప్పాం.. ఇప్పుడు చేసి చూపించాం!
posted on Sep 16, 2025 @ 2:17PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. విభజిత ఆంధ్రప్రదేశ్ కు రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 15 నెలలు అయ్యింది. గతంలో మూడు సార్లు సీఎంగా ఉన్న సమ యంలో ఎన్నడూ ఎదుర్కోని క్లిష్టపరిస్థితులు ఈ సారి ఆయనకు స్వాగతం పలికాయి. జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, విధ్వంస పాలన కారణంగా గత ఏడాది చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండటమే కాకుండా పది లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తిన పడింది.
ఇదే విషయాన్ని చంద్రబాబు సోమవారం (సెప్టెంబర్ 15) కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. అటువంటి పరిస్థితుల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచీ రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి అభివృద్ధి దిశగా నడిపించేందుకు తాను చేపట్టిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన ఈ సదస్సులో వివరించారు. అదే సమయంలో నగదు బదలీ పథకాలు అంటే సంక్షేమ పథకాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రాకుండా ముందుకు సాగుతున్నానని చెప్పారు.
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నాన్నా. అదే పెన్షన్ల పథకం అని చెప్పిన ఆయన ఈ పథకం ద్వారా 64 లక్షల మందికి ప్రతి నెలా మొదటి తేదీన క్రమం తప్పకుండా పెన్షన్లు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికీ ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, దీపం 2 పథకాల గురించి వివరించారు. అన్నదాతా సుఖీభవ, ఆటో డ్రైవర్లకు రూ.15వేలు పథకాల గురించి కూడా చెప్పారు. గత ఏడాది ఎన్నికలకు ముందు చెప్పాము.. ఇప్పుడు చేసి చూపిస్తున్నాము అన్న చంద్రబాబు.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలని, అందులో కలెక్టర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.