మోడీత్వ @ 75
posted on Sep 17, 2025 @ 11:18AM
సీఎం అయ్యే వరకూ అసెంబ్లీలో, పీఎం అయ్యే వరకూ పార్లమెంటులో అడుగు పెట్టలేదు. ఆపై రామాలయ నిర్మాణం అయ్యే వరకూ అయోధ్యలోనూ అడుగు పెట్టలేదు. అంతే కాదు ఇటు పాక్ గుండెలో వణుకు, అటు చైనాకు బెరుకు పుట్టించగల ఒన్ అండ్ ఓన్లీ నేమ్. ప్రెజంట్ యూఎస్ సిట్యువేషన్ కూడా సేమ్ టు సేమ్ సీన్. దటీజ్ నరేంద్ర దామోదర దాస్ మోడీ.
మోడీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.
మోడీ.. 1950 సెప్టంబర్ 17న గుజరాత్ లోని వాద్ నగర్ లో జన్మించారు. తన ఎనిమిదవ ఏటనే ఆర్ఎస్ఎస్ లో చేరి అక్కడ 15 ఏళ్లపాటు అంచలంచెలుగా ఎదిగారు. ఆపై 1987లో గుజరాత్ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా.. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శంకర్ సింగ్ వాగేలా, కేశూభాయ్ పటేల్ వంటి వారి మధ్య వివాదాలు చెలరేగడంతో అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఆ తర్వాత మూడు పర్యాయాల ముఖ్యమంత్రిగా పని చేయడం మాత్రమే కాకుండా.. 2014, 2019, 2024 ఎన్నికల్లో మూడు మార్లు ప్రధానిగానూ ఎన్నికయ్యారు. ఇవీ క్లుప్తంగా మోడీకి సంబంధించిన గణాంకాలు.
ఇక మోడీ ప్రభావం, ఆయన పనితనం, ఆయన ఘనత.. వంటి అంశాల విషయానికి వస్తే ఏదైతే ఆర్ఎస్ఎస్ ద్వారా ఎదిగారో అదే ఆర్ఎస్ఎస్ ని ఈనాడు శాసించే వరకూ వచ్చేశారు. గతంలో బీజేపీ గురుత్వాకర్షణ శక్తి నాగ్ పూర్ కేంద్రంగా ఉండేది. అదే నేడు.. గుజరాత్ కేంద్రంగా మారిపోయింది. అంతగా మోడీ తన ప్రభావాన్ని చూపించడం మొదలు పెట్టారు.
కావాలంటే చూడండి.. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్ల రిటైర్మెంట్ కి సబంధించి ఇలా కామెంట్ చేశారో లేదో.. ఆ వెంటనే ఆయన.. అలాంటి నియమం సంఘ్ లో లేనే లేదు. నేను కూడా 80 ఏళ్ల వయసులో.. సంఘ్ ఏ పని చెప్పినా చేస్తాననే వరకూ వచ్చారు. దటీజ్ ది పవరాఫ్ మోడీ. అంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పినట్టల్లా వినే కమలనాథుల నుంచి ఒక కమలనాథుడు చెప్పినట్టల్లా వినే ఆర్ఎస్ఎస్ వరకూ వచ్చేసింది వ్యవహారం. అంటే, కమలం పువ్వుకు కాడ ఆధారమా.. కాడకు కమలం పువ్వు ఆధారమా.. అంటే ప్రస్తుతానికైతే పువ్వే కాడకు ఆధారం అన్నట్టుగా మారిపోయింది సీన్.
ఇక మోడీ పాలన ద్వారా దేశ వ్యాప్తంగా వచ్చిన మార్పు చేర్పులేంటని చూస్తే.. అవి నోట్ల రద్దు నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, జీఎస్టీ వంటివి కీలకం. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది కూడా మోడీ హయాంలోనే. ఈ విషయంలో మోడీకి బీజేపీ దాసోహం అంటుందంటే సందేహించాల్సిన అవసరం లేదు. కారణం.. అసలు బీజేపీ ఇంతగా విశ్వ వ్యాప్తం అయ్యిందే రాముడి వల్ల. ఆనాడు అద్వానీ అయోధ్య రథయాత్రలో ఒక సహాయకుడిగా ఉన్న మోడీ.. ఇప్పుడు తన నేతృత్వంలో అయోధ్య రామమందిరం సాకారం చేయడం అన్నది ఒక చరిత్ర
ఇక పాలనాపరమైన అంశాల్లోకి వస్తే.. జీఎస్టీ ద్వారా పెద్ద మొత్తంలో ధనం ఖజానాకు చేరుతూ వచ్చింది. అయితే మోడీ పాలనలో రోడ్ల విస్తరణ, నదుల అనుసంధానం, సైనిక శక్తి పటిష్టత వంటి ఎన్నో అంశాలు భారత్ కి కలిసి వస్తున్నాయ్. ప్రస్తుతం కూడా మోడీ మిజోరాం, సిక్కిం వంటి ట్రైన్ ట్రాక్ లేని రాష్ట్రాలకు ఆ రైల్వే నెట్ వర్క్ అనుసంధానం చేస్తూ ఘనత సాధిస్తున్నారు.
ఇక మోడీ అంటే 2001 నుంచి ఇప్పటి వరకూ అప్రతిహతంగా 24 ఏళ్ల పాటు సాగిన ఒకానొక అధికారపు జైత్ర యాత్ర. ఇప్పటి వరకూ నెహ్రూ, ఇందిర వయా పీవీ, వాజ్ పేయి వంటి వారెవరికీ సాధ్యం కాని మూడు మార్లు ముఖ్యమంత్రి- మూడు మార్లు వరుస ప్రధాన మంత్రిత్వం అనే ట్రాక్ రికార్డు బహుశా మోడీకి తప్ప మరే నాయకుడి పేరిట లేదని ఘంటా పథంగా చెప్పొచ్చు. అంతటి పవర్ ఫుల్ ర్యాలీ మోడీ ట్రాక్ రికార్డులకు మాత్రమే సొంతం.
అలాగని మోడీ కేవలం పాజిటివ్ వైబ్స్ తోనే నడుస్తున్నారనడానికి వీల్లేదు. ఆయన పాలనా కాలంలో ఇంటింటికీ ఉద్యోగం, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల బ్లాక్ ని వైట్ గా మార్చిన మనీ.. ఇలాంటి నెరవేరని హామీలు చాలానే ఉన్నాయి.. అయితే మోడీ పాలనా కాలంలో అంతర్జాతీయ విషయాలు ఎలాంటివని చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆయన యోగాను పరిచయం చేసిన పేరు సాధించారు. సరిగ్గా అదే సమయంలో పాక్ పై ఇప్పటి వరకూ ఒక సర్జికల్ స్ట్రైక్, మరో ఆపరేషన్ సిందూర్ ద్వారా ఆధిపత్యం చెలాయించారు. ఇవాళ పాక్, యూఎస్ ద్వారా థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వానికి అంగలార్చుతుంటే.. మోడీ ససేమిరా అంటున్నారు.
ఇక యూఎస్ తో సంబంధాల విషయానికి వస్తే ఒకప్పుడు తన ఫ్రెండ్ ట్రంప్ గెలవాలని ప్రచారం చేసిన మోడీ.. ఇవాళ అదే ట్రంప్ ఆగర్భ శతృవా అన్నట్టుగా మారిన పరిస్థితి. ఇప్పటికే ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలు విధించగా.. నాటో దేశాలకు 100 శాతం సుంకాలు భారత్ పై విధించమని సూచిస్తున్నారు.
దీంతో మోడీ కూడా యూఎస్ కి చెక్ పెట్టే దిశగా.. చైనా, రష్యా తో చెలిమి చేస్తూ.. ట్రంప్ గుండెల్లో మంటలు రేపుతున్నారు. అంతగా అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్లోబల్ సౌత్ కి నాయకత్వం వహించేందుకు యత్నిస్తున్నారు మోడీ.మోడీ విద్యార్హత వంటి అంశాలు వివాదాస్పదంగా ఉంటే.. గుజరాత్ అల్లర్ల కేసు ఆయన పొలిటికల్ కెరీల్ లో మాయని మచ్చ అని చెప్పవచ్చు.
అదలా ఉంటే.. ఒక టైంలో తన అభిమానుల చేత నోస్టర్ డామస్ చెప్పిన భారత్ నుంచి వచ్చే ప్రపంచ ధృవతార మోడీ అన్న పేరు సాధించిన మోడీ.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పడు ఆయనకు 75 ఏళ్లు. పార్టీ పరంగా అయితే.. ఈ నియమానుసారం పదవి దిగిపోవాల్సి ఉంది. అయితే నియమాలన్నవి మనకు కాదు ఇతరులను నియంత్రించడానికని ఇంకా ఆయన తన రాజకీయ ప్రస్తానం కొనసాగిస్తారా? లేదా అన్నిది చూడాలి.
హ్యాపీ బర్త్ డే మోడీ.