జూబ్లీహిల్స్ బైఎలక్షన్ వేడి... పార్టీల ఫోకస్
posted on Sep 16, 2025 @ 6:16PM
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలైంది. జూబ్లీ బైపోల్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బరిలో దిగనున్నారు. బీసీ నినాదానంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
నియోజకవర్గంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పోస్టర్లు వెలిశాయి. ‘కావాలి అంజన్న.. రావాలి అంజన్న.. ఇది నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష’ అంటూ జూబ్లీహిల్స్‌లో అంజన్‌కుమార్ బ్యానర్లు అంచించారు. మరోవైపు.. తాను టికెట్ ఆశిస్తున్నట్టు ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అలాగే మినిస్టర్ పదవి కూడా కావాలని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె కుటుంబంతో సహా ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కమలం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. ఈ సీటునూ సొంతం చేసుకుని బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం పక్కా వ్యూహంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నా.. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో అధిష్ఠానం నిమగ్నమైనట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే ఈ స్థానం ఉంది. దీంతో తమకే గెలిచే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది