వైఎస్సార్ కాంగ్రెస్ బంద్, పలుచోట్ల ఉద్రిక్తత
posted on Aug 31, 2012 @ 4:24PM
రాష్ట్రంలో విద్యుత్ సమస్యపై నిరసన తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల బంద్ ప్రభావమే లేదు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఆందోళనలో ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందులలోనూ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. బస్టాండు వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు రాస్తా రోకో నిర్వహించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పులివెందులలోనే ధర్నాలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో పిన్నెల్లి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.