మూడేళ్ల తర్వాతకూడా వై.ఎస్ పాటే..!

వైఎస్ చనిపోయి మూడేళ్లైంది. అయినా ఆయన అభిమానుల గుండెల్లో బతికేఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజానీకం ఇప్పటికీ వై.ఎస్ ని ప్రాణసమానంగా ఆరాధిస్తున్నారు. బతికున్నప్పుడు నోరు మెదపలేని మంత్రులు, వై.ఎస్ చనిపోయిన మూడేళ్ల తర్వాత నొప్పి మా దాకా వచ్చింది కనక కళంకమంతా ఆయనకే అంటగట్టాలన్నట్టుగా మాట్లాడుతున్నా జనంలో మాత్రం వీసమెత్తైనా వై.ఎస్ పేరుమీద వ్యతిరేకత కనిపించడంలేదు. వై.ఎస్ ఉన్నన్నాళ్లూ రాష్ట్ర రాజకీయాన్ని శాసించారు. ఊహించని రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించి మూడేళ్లు దాటిన తర్వాతకూడా వై.ఎస్ పేరు రాష్ట్ర రాజకీయాల్ని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది.

 

వై.ఎస్ తర్వాత అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలనుకున్న జగన్ కు కాలం కలిసిరాక పోయినప్పటికీ ప్రజల్లో వై.ఎస్ మీద మెండుగా ఉన్న అభిమానం, జగన్ కి కొండంత అండగా నిలబడుతోంది. జగన్ అవినీతి ఆరోపణల్లో పీకలదాకా కూరుకుపోయుండొచ్చుగాక, కానీ.. జనానికిమాత్రం రాజన్న కొడుకన్న సానుభూతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎవరిని కదిలించినా ఎవరు తినట్లేదు చెప్పండి. ఎందుకు పెద్దాయన కొడుకుని అలా వేధించుకు తింటున్నారు కాంగ్రెసోళ్లుఅని ప్రభుత్వాన్ని తిట్టిపోయడమేతప్ప జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాళ్లే లేరు. నిజానికి అభిమానం అనే మాటని పక్కనపెడితే.. ఎవరు తినట్లేదు చెప్పండి అనే భావన ప్రజలకు కలగడం నిజంగా దురదృష్టకరమైన పరిణామమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. పొట్టుపోసుకోవడంకోసమే, జల్సాలకోసమో లేక ఖర్చులకోసమో జేబులుకొట్టే చిల్లర దొంగల్ని క్షమించేసినట్టుగా లక్షలకోట్లు మింగేశాడని, మాయచేసి మతలబుచేసి రాష్ట్రాన్ని దోచుకుతిన్నాడని పీకల్లోతు ఆరోపణల్లో కూరుకుపోయిన వ్యక్తిని క్షమించగలిగే మనస్తత్వం ప్రజబాహుళ్యానికే మంచిది కాదని ప్రజస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తుల అంచనా.

 

ఏదెలాఉన్నా, జగన్ మీద ఎన్ని ఆరోపణలొచ్చినా, నిజంగా జగన్ అవినీతికి పాల్పడ్డాడని రుజువైనాసరే.. ప్రజలు మాత్రం వై.ఎస్ మీద అభిమానాన్ని జగన్ మీద కురిపించడం ఖాయమన్న విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా తేటతెల్లమయ్యింది. నిజానికి కాంగ్రెస్ అధిష్ఠానం.. జగన్ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని ఊహించనేలేదు. మొగ్గలోనే తుంచిపారేద్దామన్న రీతిలో అన్ని వైపులనుంచీ అడ్డుకట్టలు వేసి ఏమాత్రం తలెత్తడానికి వీల్లేకుండా నేరుగా పడగమీదే కొట్టే ప్రయత్నాలు చాలా జరిగినా, వై.ఎస్ ఆశీస్సులతోనే వాటన్నింటినీ తప్పించుకుని ఆయన తనయుడు నెగ్గుకు రాగలుగుతున్నాడని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోస్తున్న వాళ్లని అంతలా నెత్తికెత్తుకోవడం సరికాదని చాలా మంది బాహాటంగానే అనుకుంటున్నా.. వై.ఎస్ మీద ప్రజలు చూపిస్తున్న అభిమానాన్నిమాత్రం హర్షించకుండా ఉండలేకపోతున్నారు.  రాష్ట్రంలో ఇప్పుడు టిడిపి, కాంగ్రెస్ పార్టీలకంటే జగన్ పార్టీయే చాలా బలంగా ఉంది. అప్పట్లో జగన్ కి దూరంగా జరిగినవాళ్లుకూడా ఇప్పుడు రాసుకుపూసుకు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు.

వైయస్ చనిపోయిన మూడేళ్ల తర్వాతకూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పార్టీలన్నీ ఆయన పేరుని పలవరిస్తూనే ఉన్నాయ్. వై.ఎస్ చనిపోయాక రాష్ట్ర రాజకీయాలు పెను సంక్షోభంలో కూరుకుపోయాయన్న నిజాన్ని మాత్రం అందరూ అంగీకరించక తప్పదు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందన్న నమ్మకంతో కొందరుంటే, ఎలాగైనా జగన్ చేతికి అధికారం చిక్కకుండా చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగా పనిచేస్తోంది. చివరికి వై.ఎస్ దయవల్ల జగన్ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి బైటినుంచి కాంగ్రెస్ కి వెన్నుదన్నుగా నిలవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుందని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి మరి..

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.