ఈ వినాయక చవితికి బొజ్జగణపయ్య బుజ్జి విగ్రహాలు
posted on Sep 4, 2012 @ 2:30PM
హైదరాబాద్ లో పెద్దఎత్తున ఉగ్రవాదుల ఆనవాళ్లు బైటపడుతున్నాయ్. ఇంటెలిజెన్స్ చాకచక్యం కారణంగా చాలామంది కొత్త ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా మారు వేషాల్లో తిరుగుతున్నారో అన్న భయం అందరికీ పట్టుకుంది. ఈ వినాయక చవితికి ఉగ్రవాదులు ఎలాంటి విధ్వంసరచనకు స్కెచ్చేస్తున్నారో అన్న భయం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
ఉగ్రవాదులనుంచి ముప్పు పొంచి ఉన్నందుకు వీలైనంతవరకూ చిన్న చిన్న విగ్రహాల్ని ఏర్పాటుచేసుకోవడమే మంచిదని పోలీసులు చెబుతున్నారు. చిన్న విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజించడంవల్ల చుట్టుపక్కల ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరు కొత్తవాళ్లో, ఎవరు విద్రోహులో, ఎవరు స్థానికులో తెలుసుకోవడానికి, అప్రమత్తంగా ఉండడానికి వీలౌతుందని పోలీసులు అంటున్నారు. చిన్న విగ్రహాల్ని నిమజ్జనానికి తరలించడంకూడా చాలా తేలికౌతుంది కనుక ఉగ్రవాదులకు విధ్యంసం సృష్టించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నెట్టుకు రావొచ్చని ప్రచారం చేస్తున్నారు.
సాధారణంగా గణేష్ మండపాల్లో హడావుడంతా కుర్రాళ్లదే ఉంటుంది. విగ్రహాన్ని తీసుకురావడం దగ్గర్నుంచి, మంటపాల్ని ముస్తాబు చేయడం, రాత్రివేళల్లో కాపలా పడుకోవడందాకా అంతా కాలనీల్లో కుర్రాళ్లే దగ్గరుండి చూసుకుంటారు. చాలా పెద్దఎత్తున ఉగ్రవాదులు ఆనవాళ్లు బట్టబయలుకావడంతో ఈ సారి పిల్లల బాగోగులపై తల్లిదండ్రులుకూడా కలవరపడుతున్నారు.