బాలకృష్ణ రెండు పడవల ప్రయాణం షురూ
posted on Jun 2, 2014 @ 10:05PM
నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి అసెంబ్లీకి ఎన్నికయిన తరువాత, తాను ప్రజలకు సేవ చేస్తూనే సినిమాలు కూడా చేస్తుంటానని చెప్పారు. అయితే ప్రజాసేవకి ఎక్కువ సమయం కేటాయించేందుకు తన సినిమాలు తగ్గించుకొంటానని హామీ ఇచ్చారు. తను సినిమాలు చేస్తున్నప్పటికీ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆయన చెప్పినట్లుగానే ఈరోజు నుండి రెండు పడవల ప్రయాణం ప్రారంభించారు. ఈరోజు తన కొత్త సినిమాను హైదరాబాదులో ప్రారంభించారు. కొత్త దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వంలో చేయబోయే ఈ సినిమాలో త్రిష మొట్ట మొదటి సారిగా బాలకృష్ణతో జత కట్టబోతోంది. ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు తదితరుల సమక్షంలో సినిమా పూజా కార్యక్రమాలు ముగించికొని ఈరోజు షూటింగ్ మొదలు పెట్టారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఇక ఈరోజు బాలకృష్ణ తన హిందూపురం నియోజకవర్గం పార్టీ నేతలతో, స్థానిక మునిసిపల్ కమీషనర్ తో హైదరాబాదులో సమావేశమయ్యి స్థానిక సమస్యల గురించి చర్చించారు. వాటిలో ప్రధానంగా తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే ఒక పట్టణంలో ఒక భారీ ఓవర్ హెడ్ నీళ్ళ ట్యాంకుని నిర్మించాలని నిర్ణయించారు. త్వరలో చంద్రబాబు ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టగానే మొట్టమొదటగా హిందూపురం పట్టణంలో ఒక పెద్ద ప్రభుత్వాసుపత్రిని నిర్మింపజేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.
బాలకృష్ణ సినిమాలు మానేస్తే ఆయన అభిమానులు బాధపడతారు. ఓటేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోతే వారు బాధపడతారు. అందువల్ల ఆయన రెండు పడవలలో ప్రయాణం అనివార్యమవుతోంది. కానీ, ఎన్నికలలో పోటీ చేసి గెలిచి ‘పార్ట్ టైం ప్రజాసేవ’ చేస్తానని అంటే ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పదు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, విద్యా సంస్థలు, చివరికి మద్యం సిండికేట్లు నడిపించుకొంటూ రాజకీయ నాయకులందరూ కూడా పార్ట్ టైం ప్రజాసేవే చేస్తున్నప్పటికీ, బాలకృష్ణ సినిమాలలాగ, వారి వ్యాపార వ్యవహారాలు ప్రత్యక్షంగా కనబడవు కనుక వారు విమర్శల నుండి తప్పించుకోగలుగుతున్నారు. కానీ బాలకృష్ణ ప్రజాసమస్యలను పరిష్కరించకుండా సినిమాలు చేసుకొంటుంటే, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక మిగిలిన నేతల కంటే మరింత ఎక్కువ సమయం రాజకీయాలకు, తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కేటాయించడం మేలు.